ఆస్ట్రియా రాజధాని వియన్నా (పాత ఫొటో)
హైదరాబాద్ : ప్రపంచంలో పౌరులకు అత్యంత నాణ్యమైన జీవితాన్ని ఇస్తున్న నగరాల్లో ఆస్ట్రియా రాజధాని వియన్నా వరుసగా తొమ్మిదో సారి తొలిస్థానంలో నిలిచింది. మెర్సర్ అనే కన్సల్టింగ్ కంపెనీ చేసిన సర్వేలో వియన్నా ప్రజలకు నాణ్యమైన జీవితాన్ని ఇస్తున్నట్లు తేలింది.
కాగా, ఇరాక్ రాజధాని బాగ్దాద్ నగర ప్రజలు అత్యంత నరకప్రాయమైన జీవితాన్ని గడుపుతున్నారని సర్వే పేర్కొంది. మెర్సర్ చేసే సర్వే ఆధారంగా కంపెనీలు ఏటా అంతర్జాతీయ కార్మికులకు అలవెన్సులు అందజేస్తాయి. రాజకీయ స్థిరత్వం, ఆరోగ్యం, విద్య, నేరాలు, రవాణా తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని 231 నగరాలపై మెర్సర్ అధ్యాయనం చేసింది.
ప్రపంచంలో నాణ్యమైన జీవితాన్ని అందిస్తున్న టాప్ 10 నగరాల్లో యూరప్ ఖండంలో ఎనిమిది ఉన్నాయి. జర్మనీ, స్విట్జర్లాండ్ దేశాల్లో మూడేసి నగరాలు, న్యూజిలాండ్, కెనడా, ఆస్ట్రేలియాల్లో ఒక్కో నగరం టాప్ టెన్‌లో నిలిచాయి. వియన్నా తర్వాత జ్యురిచ్(రెండో స్థానం), ఆక్‌లాండ్, మ్యూనిచ్‌లు సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నాయి.
ఉత్తర అమెరికా ఖండంలోని వాంకోవర్ ఐదో స్థానంలో నిలిచింది. 25వ స్థానంలో నిలిచిన సింగపూర్ ఆసియా ఖండంలో ప్రజలకు అత్యుత్తమ జీవితాన్ని అందిస్తోంది. 89వ స్థానంలో నిలిచిన డర్బన్ ఆఫ్రికా ఖండంలో అత్యుత్తమ జీవితాన్ని ఇస్తున్న నగరంగా నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment