మార్చి 9న ఆకాశంలో అద్భుతం
న్యూఢిల్లీ: మార్చి 9న ఆకాశంలో అద్భుతం జరగనుంది. రోజూ తెల్లవారగానే అరుణ వర్ణంలో శోభించే సూర్యుడిని చూస్తాం. కానీ మార్చి 9న మాత్రం పాక్షికంగా ఉదయించే సూర్యుడిని గమనించొచ్చు. తెల్లవారుజామున 4 గంటల 49 నిమిషాలకు ప్రారంభమయ్యే సూర్యగ్రహణాన్ని భారత దేశంలోని వాయువ్య రాష్ట్రాల వారు తప్ప అందరూ చూడొచ్చని ఎర్త్ సెన్సైస్ మంత్రిత్వ శాఖ సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. వచ్చే బుధవారం ఉదయం ఒక్కో ప్రాంతంలో ఒక్కో సమయంలో గ్రహణం కనబడుతుంది.
హైదరాబాద్‌లో ఉదయం 6.29 నుంచి 6.47 వరకు 18 నిమిషాలపాటు, నల్లగొండ జిల్లాలో 6.26 నుంచి 6.47 వరకు 21 నిమిషాల పాటు, చెన్నైలో ఉదయం 6.21 నుంచి 6.47 వరకు, ఢిల్లీలో 6.38 నుంచి 6.44 వరకు, కోల్‌కతాలో 5.51 నుంచి 6.05 వరకు గ్రహణాన్ని వీక్షించొచ్చు. భారత్‌తోపాటు థాయ్‌లాండ్, ఇండొనేషియా, దక్షిణ కొరియా, జపాన్, ఆస్ట్రేలియా, ఉత్తర పసిఫిక్ సముద్రప్రాంతంలో ఈ గ్రహణం కనబడుతుంది. గ్రహణం ఉదయమే సంభవిస్తున్నా.. నేరుగా చూస్తే కళ్లకు ప్రమాదం.