ఆ భయంకరమైన క్రీడ.. వాళ్లకు వినోదం!
జపాన్: ప్రతి ఆరు సంవత్సరాలకు వచ్చే ఆ పండుగ అంటే అక్కడి ప్రజలకు ఎంతో పవిత్రం. ఆ పండుగే 'ఆన్‌భషీరా'. ఈ సందర్భంగా జరుపుకునే ఉత్సవంలో వందల సంఖ్యలో ఔత్సాహికులు పాల్గొని పెద్ద చెట్టు మొండాలకు మోకుతాడులు బిగించి కూర్చొని స్వారీ చేస్తారు. 12 వందల సంవత్సరాల కాలం నుంచి వస్తున్న తమ ఆచార సంప్రదాయలను పాటిస్తూ ప్రతి ఆరు సంవత్సరాలకు ఒకసారి రెండు నెలలపాటు ఈ పండుగను జరుపుకుంటారు జపాన్ వాసులు. శువాలో జరుపుకునే ఈ పండుగను పురస్కరించుకుని ప్రత్యేక పూజలతో గాలి, నీరును వారు దేవుళ్లుగా కొలుస్తారు. ఈ ఉత్సవంలో జరుపుకునే క్రీడ అతి భయంకరమైనది.
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 10 టన్నుల (అంటే అక్షరాల 10వేల కిలోలు అన్నమాట) బరువు ఉన్న చెట్టు మొండాలకు మోకుతాడులు బిగించి పై కొండ మీద నుంచి లోయలోకి జారుకుంటూ వెళ్లాలి. అంతేకాదు.. చెట్ల మొండాలపై బిగించిన తాళ్లను గట్టిగా పట్టుకుని జట్లగా కొండ మీద గడ్డి సాయంతో కిందకు జారుతుంటారు. ఈ క్రమంలో పొరపాటున జారిపడితే అంతే ప్రాణాలు గాల్లో కలిసిపోవాల్సిందే. అయినా తమ ప్రాణాలను లెక్కచేయకుండా క్రీడలో పాల్గొనడానికి ఎంతోమంది ఔత్సాహికులు పోటీపడుతుంటారు. ఇలా కొండపై నుంచి జారుతూ స్వారీ చేయాల్సి ఉంటుంది. తమ గమ్యం చేరుకునే లోపు ఒకవేళ కిందపడినా మళ్లీ లేచి ఆ చెట్టు మొండాలకు ఉన్న తాళ్ల సహాయంతో మళ్లీ స్వారీ చేస్తుండటం ఈ క్రీడా విశేషం. ఎంతో పవిత్రంగా భావించే ఈ పండుగ క్రీడను అక్కడి ప్రజలు దేవుడికి సమర్పించే మొక్కుగా చెల్లిస్తుంటారు.
ఈ క్రీడలో పాల్గొన్న వారంతా ఆ చెట్టు మొండాలతో జారుకుంటూ కొండ దిగువన ఉన్న షెరైనాలోని షింటోలో గ్రామ పురోహితుడి ఆధ్వర్యంలో జరిగే శుద్దీకరణ వేడుక వద్దకు రావాలి. ఈ క్రమంలో ఎవరైనా మార్గం మధ్యలో తీవ్రంగా గాయపడినా, లేక మరణించినా వారికి పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ క్రీడను అక్కడి ప్రజలు 'కిటోషీ' గా పిలుస్తారు. కొండ కిందకు చేరుకున్న తరువాత ఆ చెట్టు మొండాలను తాళ్ల సాయంతో పైకెత్తగా మరొకొందరూ ఆ చెట్ల మొండాలపైకి ఎగబాకి పైనున్న వాలాలను అందుకోవాలి. ఈ సమయంలో కొందరూ జారిపడుతుంటారు.. అయినా మళ్లీ ప్రయత్నిస్తూ పైకి ఎగబాకుతారు. మే నెలలో జరిగిన ఉత్సవంలో చెట్టు మొండాన్ని పైకెత్తే క్రమంలో మోకుత్రాడు జారిపోవడంతో ఒక్కసారిగా 40 అడుగుల చెట్టు మొండంపై నుంచి కిందకు జారిపడి ఒక వ్యక్తి మృతిచెందాడు. గతంలోనూ ఇదే తరహా క్రీడలో నలుగురు వ్యక్తులు మృతిచెందారు.