.పెళ్లి గౌనుతో.. పదేళ్లుగా..
పెళ్లి గౌను వేసుకుని ఎంజాయ్ చేస్తున్న ఈ మహిళ.. గత పదేళ్లుగా ఇదే డ్రస్ వేసుకుంటోంది! నమ్మకున్నా.. ఇది నిజం. ఈమె పేరు జియాంగ్ జన్‌ఫెంగ్(47). చైనాలోని జిమోకు చెందిన జియాంగ్ నిరుపేద. 18 ఏళ్ల వయసులో ఈమెను కొందరు దుండగులు కిడ్నాప్ చేసి.. ఓ వయసు మళ్లిన వ్యక్తికి అమ్మేశారు. జియాంగ్ పెళ్లాడిన ఆ ముసలాడు ఈమెను చాలా చిత్రహింసలు పెట్టాడు. బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు. నిర్బంధంలో పెట్టాడు. చాన్నా ళ్లు చిత్రహింసలు భరించిన జియాంగ్ ఓరోజు అక్కడి నుంచి తప్పించుకుని.. పారిపోయింది. ఆమెకో మహిళ పరిచయమైంది. ఆశ్రయం కల్పించింది.
తన సోదరుడు జూను పరిచయం చేసింది. జియాంగ్ జూకు నచ్చింది. జూకు జియాంగ్ నచ్చాడు. దీంతో 2004లో పెళ్లి చేసుకున్నారు. అన్నేళ్లు చిత్రహింసలు తప్ప.. జీవితంలో ఆనందమన్నది ఎరుగని జియాంగ్.. ఆ రోజును జీవితాంతం గుర్తుండిపోయేలా చేసేందుకు.. పెళ్లి గౌనును జీవితాంతం ధరించాలని నిర్ణయించింది. గత పదేళ్లుగా దాన్నే పాటిస్తోంది. పొలం పనుల్లోకి వెళ్లినా.. ఈ గౌనుతోనే పనిచేస్తుంది. అందరూ విచిత్రంగా చూసినా.. తన జీవితానికి వసంతాన్ని ప్రసాదించిన తన భర్త జూకు గుర్తుగా దీన్ని వేసుకుంటున్నట్లు ఆమె చెబుతోంది.