హరారే : మొసలి బారి నుంచి తన స్నేహితురాలిని కాపాడేందుకు ఓ బాలిక సాహసోపేత చర్యకు పూనుకుంది. మొసలితో భీకర పోరాటం చేసి తనను కాపాడింది. ఈ ఘటన జింబాబ్వేలో చోటుచేసుకుంది. రెబెకా ముంకోబ్వే తన స్నేహితులతో కలిసి సిందెరేలా అనే గ్రామంలోని చెరువులో ఈత కొట్టేందుకు వెళ్లింది. ఈ క్రమంలో లయోటా మౌవానీ(9)ని ఓ మొసలి లోపలికి లాక్కెళ్లింది. దీంతో ఆమె భయంతో గట్టిగా కేకలు వేయడంతో రెబెకా.. లయోటాను లాక్కెళ్తున్న మొసలిని అనుసరించింది. మొసలిపైకి అమాంతం ఎక్కి ముష్టి యుద్ధం చేస్తూ దాని కళ్లు పీకేసింది.
ఈ క్రమంలో రెబెకా చర్యతో నొప్పితో విలవిల్లాడిన మొసలి లయోటాను వదిలి నీళ్లలోకి వెళ్లిపోయింది. దీంతో ఆమెను వీపునకు కట్టుకుని రెబెకా సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చింది. అనంతరం ఆమెను స్థానిక ఆస్పత్రిలో చేర్పించింది. ఈ విషయం గురించి నర్సు మాట్లాడుతూ.. లయోటాకు స్వల్ప గాయాలు అయ్యాయని, ప్రస్తుతం ఆమెకు చికిత్స అందిస్తున్నట్లు పేర్కొంది. ఇక తన కూతురిని కాపాడినందుకు లయోటా తండ్రి రెబెకాకు ధన్యవాదాలు తెలిపాడు. కాగా తన ప్రాణాలు సైతం లెక్కచేయక స్నేహితురాలిని కాపాడిన రెబెకాపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment