బాలీవుడ్ బాక్సాఫీస్ భాయీజాన్ | 2015 very special year in Bollywood | Sakshi
Sakshi News home page

బాలీవుడ్ బాక్సాఫీస్ భాయీజాన్

Published Tue, Dec 29 2015 11:16 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

బాలీవుడ్  బాక్సాఫీస్ భాయీజాన్ - Sakshi

బాలీవుడ్ బాక్సాఫీస్ భాయీజాన్

టాలీవుడ్‌కే కాదు... బాలీవుడ్‌కి కూడా ఈ 2015 చాలా స్పెషల్ ఇయరే. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలతో పాటు కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలకు బాక్సాఫీస్ దగ్గర ప్రేక్షకులు పట్టం కట్టారు. ఇక, ఈ ఏడాది ‘కింగ్ ఆఫ్ ది బాలీవుడ్’ అంటే సల్మాన్‌ఖాన్ పేరే చెప్పాలి. సల్మాన్ ఒకటికి రెండు భారీ హిట్లు సాధించారు. అలాగే వ్యక్తిగతంగా ఆయన కిది మరపురాని సంవత్సరం. కోర్టులో తన మీద ఉన్న కేసుల నుంచి సల్మాన్ బయటపడగలిగారు. ఇక, క్వీన్ ఆఫ్ ది బాలీవుడ్ అంటే దీపికా పదుకొనెనే. ఆమె నటించిన మూడు సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అందాల తార ఐశ్వర్యారాయ్ ‘జజ్బా’తో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. ఈ ఏడాది హిందీలో వందకు పైనే సినిమాలు విడుదలైనా సక్సెస్ రేటు మాత్రం తక్కువే. విమర్శకుల ప్రశంసలు, వసూళ్ళు రెండూ కలగలిపి చూస్తే, బాలీవుడ్‌లో ఈ ఏడాది అగ్రశ్రేణిలో నిలిచిన పది ప్రయత్నాలపై ఫోకస్...
 
 సరిహద్దుల్ని చెరిపేసిన సెంటిమెంట్!
 బాక్సాఫీస్‌ను ఈ ఏడాది వసూళ్ల వర్షంలో తడిపి ముద్ద చేసిన చిత్రం ‘బజరంగీ భాయీజాన్’. కబీర్‌ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సల్మాన్‌ఖాన్ ఇమేజ్ ను తారస్థాయికి చేర్చింది. మొత్తం ఈ ఏడాదిలో ఫస్ట్ ప్లేస్‌ను ఆక్రమించింది. పాకిస్తాన్ నేపథ్యం, తప్పిపోయిన ఓ మూగ చిన్నారిని కన్నవారి దగ్గరకు చేర్చాలని ఓ నిజాయతీపరుడు పడే శ్రమ చుట్టూ తిరిగే ఈ చిత్రం దేశాల సరిహద్దుల్ని చెరిపేసి, ప్రపంచవ్యాప్తంగా కంట తడిపెట్టించింది. కోట్లు కురిపించింది.
 బడ్జెట్: రూ.90 కోట్లు, వసూళ్లు: రూ. 626 కోట్లు (ప్రపంచవ్యాప్తంగా)
 
 నిజంగా ఇది ‘ప్రేమ్’ లీల
 సల్మాన్‌ఖాన్ ప్రేమ్ పేరుతో క్యారెక్టర్ చేశాడంటే ఆ సినిమా హిట్ కిందే లెక్క. దాదాపు పదేళ్ల తర్వాత సూరజ్ బర్జాత్యా దర్శకత్వంలో ఆయన మళ్లీ ప్రేమ్‌గా కనిపించిన చిత్రం ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’. ఇటీవల ఎక్కువగా చేస్తున్న యాక్షన్ కథా చిత్రాలకు భిన్నంగా సల్మాన్ చేసిన ఈ డ్యుయల్ రోల్ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకుంది. తెలుగులో ‘ప్రేమ్ లీల’గా అనువాదమైంది.
 బడ్జెట్: రూ.110 కోట్లు
 వసూళ్లు: రూ. 400 కోట్లు (ప్రపంచవ్యాప్తంగా)
 
 కంగనా వన్స్ ఎగైన్
 ‘క్వీన్’, ‘తను వెడ్స్ మను’ చిత్రాలతో టాప్ హీరోయిన్ స్టేటస్ సాధించిన కంగన ఈ ఏడాది ‘తను వెడ్స్ మను రిటర్న్స్’తో ప్రేక్షకులను పలకరించారు. ఆనంద్ ఎల్ రాయ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో రెండు విభిన్నమైన పాత్రల్లో కంగనా రనౌత్ ద్విపాత్రాభిన యం జనాన్ని కట్టి పడేసింది.
 బడ్జెట్: రూ.39 కోట్లు  వసూళ్లు: రూ. 243 కోట్లు(ప్రపంచవ్యాప్తంగా)
 
 క్రేజీ కాంబినేషన్‌తో సక్సెస్
 షారుక్‌ఖాన్- కాజోల్ అయిదేళ్ల విరామం తర్వాత తెరపై కనువిందు చేసిన చిత్రం ‘దిల్‌వాలే’. రోహిత్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవలే విడుదలై కమర్షియల్ విజయం సొంతం చేసుకుంది. రోహిత్ శెట్టి మార్కు మాస్ మసాలా ఫార్మట్‌లో తెరకెక్కిన ఈ చిత్రానికి ఒకే ఒక్క హైలైట్ షారుక్‌ఖాన్-కాజోల్. అదే ఈ సినిమాకు గొప్ప పేయింగ్ ఎలిమెంట్. ఆ మ్యాజిక్‌తోనే బాక్సాఫీస్ వద్ద గట్టెక్కగలిగారు.
 బడ్జెట్: రూ. 100 కోట్లు
 వసూళ్లు: రూ. 287కోట్లు (ఇప్పటివరకూ) (ప్రపంచవ్యాప్తంగా)
 
 బాజీరావ్ గెలిచాడు!
 దిగ్దర్శకుడు సంజయ్‌లీలా బన్సాలీ అత్యంత భారీ బడ్జెట్‌తో తెర కెక్కించిన చారిత్రక కథా చిత్రం ‘బాజీరావ్ మస్తానీ’. రణ వీర్‌సింగ్, ప్రియాంకా చోప్రా, దీపికా పదుకొనే నటించిన ఈ చిత్రం ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలందుకుంటోంది.
 బడ్జెట్: రూ. 125 కోట్లు, వసూళ్లు: రూ. 202.85 కోట్లు(ఇప్పటివరకూ)
 
 సీక్వెల్ కూడా అదిరింది!
 హాలీవుడ్ హిట్ సిరీస్ ‘స్టెప్ అప్’ను స్ఫూర్తిగా తీసుకొని తెరకెక్కిన చిత్రం ‘ఏబీసీడీ’. 2013లో ప్రభుదేవా ప్రధానపాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. దానికి సీక్వెల్‌గా రెమో డిసౌజా దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘ఏబీసీడీ-2’. ప్రభుదేవా, వరుణ్‌ధావన్, శ్రద్ధాకపూర్ ముఖ్యపాత్రల్లో నటించిన ఈ చిత్రం వాణిజ్య విజయాన్ని సొంతం చేసుకుంది. త్రీడీ ఫార్మట్‌లో తెరకెక్కిన తొలి డ్యాన్స్ మూవీ ఇదే కావడం విశేషం.
 బడ్జెట్: రూ. 65 కోట్లు వసూళ్లు: రూ. 157 కోట్లు (ప్రపంచవ్యాప్తంగా)
 
 హాలీవుడ్ తరహా యాక్షన్ ‘బేబీ’
 బాలీవుడ్‌లో మినిమమ్ గ్యారెంటీ హీరో ఎవర ంటే తొలుత వినిపించే పేరు అక్షయ్‌కుమార్. హిట్స్, ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా  కెరీర్‌లో దూసుకువెళుతున్న అక్షయ్‌కుమార్ ‘బేబీ’ చిత్రంతో ఈ ఏడాది పలకరించారు. ‘స్పెషల్ ఛబ్బీస్’ ఫేమ్ నీరజ్‌పాండే ఈ చిత్రానికి దర్శకుడు. ఉగ్రవాద నేపథ్యంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ అక్షయ్ కుమార్ కెరీర్‌లో ఓ మైలురాయి. విశేషమేమిటంటే ఒక్క డ్యూయెట్ కూడా లేకుండా హాలీవుడ్ శైలిలో సాగిన ఈ సినిమా యాక్షన్ ప్రియులను ఆకట్టుకుంది.
 బడ్జెట్: రూ. 58 కోట్లు వసూళ్లు: రూ. 125 కోట్లు (ప్రపంచవ్యాప్తంగా)
 
 ప్రేక్షకుల దిల్ ధడక్ దియా!
 ఆ కుటుంబానికి డబ్బు, ఆస్తి, అంతస్తు, హోదా అన్నీ ఉంటాయి. కానీ సంబంధాలు అంతంత మాత్రమే. ఇష్టం లేని పెళ్లి చేశాడని తల్లితండ్రుల మీద కోపంగా ఉన్న కూతురు, కొడుకైతే  తనకు నచ్చినట్టు బతకాలనుకుంటాడు. ఇలా పైకి ఎంత ప్రేమగా ఉన్నా లోపల మాత్రం వాళ్లందరి మధ్య ఉన్న రిలేషన్‌షిప్ జీరో. ఇలాంటి విచిత్రమైన ఫ్యామిలీ కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘దిల్ ధడక్‌నే దో’. ఫర్హాన్ అఖ్తర్ సోదరి జోయా అఖ్తర్ ఈ చిత్రానికి దర్శకు రాలు. హీరో ఆమిర్‌ఖాన్ ఈ చిత్రంలోని ప్లూటో అనే కుక్కకు వాయిస్ ఓవర్ ఇస్తూ కథ నెరేట్ చేయడం విశేషం.
 బడ్జెట్: రూ. 85 కోట్లు, వసూళ్లు: రూ. 144 కోట్లు (ప్రపంచవ్యాప్తంగా)
 
 ఓ థ్రిల్లింగ్ అనుభవం
 కథానాయిక అనుష్కా శర్మ నిర్మాతగా మారి తీసిన చిత్రం ‘ఎన్‌హెచ్10’. పరువు హత్యల నేపథ్యంలో థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు అందుకుంది. అనుష్కా శర్మలోని అభినయప్రతిభను అందరికీ తెలియజెప్పింది.  
 బడ్జెట్: రూ. 13 కోట్లు వసూళ్లు: రూ. 39 కోట్లు (ప్రపంచవ్యాప్తంగా)
 
 జనం మెచ్చిన విభిన్న ప్రయత్నం
 దీపికా పదుకొనే నటనలోని మరో కోణాన్ని ఆవిష్కరించిన చిత్రం ‘పీకూ’. అమితాబ్‌బచ్చన్, దీపికా పదుకొనే తండ్రీకూతుళ్లుగా నటించిన ఈ చిత్రానికి శూజిత్ సర్కార్ దర్శకుడు. కాన్‌స్టిపేషన్ (మలబద్ధకం) అంశాన్ని అత్యంత సున్నితంగా డీల్ చేసిన శూజిత్ డెరైక్షన్‌కు మంచి మార్కులు పడ్డాయి.
 బడ్జెట్: రూ.  42 కోట్లు వసూళ్లు: రూ. 100 కోట్లు (ప్రపంచవ్యాప్తంగా)
 
 అంచనాలు భారీ... రిజల్ట్ ఫ్లాప్...
 రణ్‌బీర్  కపూర్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో  తెర కెక్కిన చిత్రం ‘బాంబే వెల్వెట్’. 1960ల నాటి బొంబాయిలో మాఫియా నేపథ్యంలో అనురాగ్ కశ్యప్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మొదటిసారిగా దర్శకుడు కరణ్ జోహార్ విలన్ పాత్రలో నటించిన చిత్రం ఇదే. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బొక్కబోర్లా పడింది.  ఇక ‘షమితాబ్’ పరిస్థితీ ఇంతే. ‘రాంఝణా’తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ధనుష్ తన రెండో చిత్రంలోనే అమితాబ్ లాంటి అగ్ర నటుడితో నటించారు. కానీ, దర్శకుడు ఆర్. బాల్కీ గత చిత్రాలకు తగ్గట్టుగా లేకపోవడంతో ఈ సినిమా పరాజయం పాలైంది. ఎప్పటి నుంచో ఓ హిట్ కోసం ఆశగా ఎదురుచూస్తున్న హీరో అభిషేక్ ఈ ఏడాది ‘ఆల్ ఈజ్ వెల్’తో మరో ఫ్లాప్ తన ఖాతాలో వేసుకున్నారు. సైఫ్ అలీఖాన్ ‘ఫాంటమ్’, కంగనా రనౌత్ , ఇమ్రాన్ ఖాన్ జంటగా నటించిన  ‘కత్తీ బత్తీ’ కూడా ఈ ఏడాది ఫ్లాప్ లిస్ట్‌లో చేరాయి.
 
 నయా సినిమా... నయా జమానా
 ఈ ఏడాది విడుదలైన ‘తల్వార్, మసాన్, దమ్ లగాకే హైస్సా’ లాంటి చిత్రాలు బాలీవుడ్‌లో కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టాయి. నీరజ్  ఘేవాన్ దర్శకత్వం వహించగా, వారణాసి ఒడ్డున భగ్న ప్రేమకథ నేపథ్యంలో సాగే ‘మసాన్’ ప్రేక్షకుల నుంచే కాకుండా విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంది. నిజజీవిత ఘటన ఆధారంగా తీసిన ‘తల్వార్’ టేకింగ్ గురించి జనం చెప్పుకున్నారు. బాహ్య సౌందర్యం కన్నా భార్యాభర్తల మధ్య ప్రేమబంధం గొప్పదని చెప్పే ‘దమ్ లగాకే హైస్సా’ లావైన ప్రేమకథగా నిలిచింది. ఇక రాజమౌళి ‘బాహుబలి’ హిందీ అనువాద రూపం అత్యధిక వసూళ్ళు సాధించిన సౌతిండియన్ హిందీ డబ్బింగ్‌గా నిలిచింది.
 
 ఇక్కడ హిట్టు! కానీ, అక్కడే...
 బాలీవుడ్‌కి ఈ ఏడాది రీమేక్స్ పెద్దగా అచ్చిరాలేదు. తెలుగు సూపర్‌హిట్ ‘ఒక్కడు’ హిందీలో ‘తేవర్’గా రీమేకైనా తేలిపోయింది. హాలీవుడ్ ‘వారియర్’ సూపర్‌హిట్‌కి రీమేక్‌గా భారీ అంచనాల నడుమ విడుదలైన ‘బ్రదర్స్’ చిత్రం నిరాశపరిచింది. ఇక మలయాళ, కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో హిట్టయిన ‘దృశ్యమ్’ కథ హిందీలో మాత్రం జనాన్ని ఆకట్టుకోలేకపోయింది. తమిళ హిట్ ‘రమణ’ (తెలుగులో చిరంజీవి ‘ఠాగూర్’)కు రీమేక్‌గా వచ్చిన ‘గబ్బర్ ఈజ్ బ్యాక్’ అక్షయ్‌కుమార్ - దర్శకుడు క్రిష్‌లకు ఆశించినంత సంతృప్తిని ఇవ్వలేకపోయింది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement