150 సినిమాల్లో నటించా ..
సినీ హీరో భానుచందర్
మిర్యాలగూడ : తాను ఇప్పటి వరకు 150 సినిమాల్లో నటించానని ప్రముఖ సినీహీరో భానుచందర్ అన్నారు. సోమవారం మిర్యాలగూడలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాను నటించిన 150 చిత్రాల్లో 92 సినిమాల్లో హీరో పాత్రలు పోషించినట్లు చెప్పారు. ప్రస్తుతం మిక్చర్‌పొట్లం సినిమాలో టెర్రరిస్ట్ పాత్రలో నటించినట్లు వివరించారు. ఈ సినిమాలో హీరోగా ఆయన కుమారుడు నటిస్తున్నాడని తెలిపారు.
సినిమా పరిశ్రమపై ప్రభుత్వాలు పన్ను రాయితీ కల్పిస్తే ఎక్కువ సినిమాలు తీసే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. నాటి సినిమాలను కళాకారులు కష్టపడి చేసేవారని, నేడు ఎక్కువగా కంప్యూటర్ గ్రాఫిక్స్‌పై ఆధారపడుతున్నారని పేర్కొన్నారు. కరాటే నేర్చుకోవడం వల్ల క్రమశిక్షణ అలవడుతుందన్నారు. చైనాలో ప్రతి ఒక్కరూ తాయ్‌చే యోగా చేస్తారని తెలిపారు. ఆయన వెంట సుమన్ బుడోకాన్ కరాటే అధ్యక్షుడు బూడిద సైదులుగౌడ్, మాజీ జెడ్పీటీసీ దోసపాటి శ్రీనివాస్, టీఆర్‌ఎస్ నాయకురాలు పందిర్ల పద్మావతి పాల్గొన్నారు.