
ఈసారి నాన్న అవార్డు అమితాబ్‌కి ఇస్తున్నాం : నాగార్జున
‘‘నాన్నగారు ఓ మంచి సంకల్పంతో ఈ అవార్డుని ఏర్పాటు చేశారు. తరాలు మారినా ఈ అవార్డు ప్రదానం మాత్రం ఆగకూడదనేది ఆయన కోరిక. ఆ కోరికను నెరవేర్చడమే మా పరమావధి. 2013వ సంవత్సరానికి గాను నాన్న జాతీయ పురస్కారానికి బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్‌ని ఎంపిక చేశాం’’ అని నాగార్జున అన్నారు.. ఈ నెల 27న ఈ పురస్కార వేడుక జరుగనుంది. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ ‘‘కోరిన వెంటనే ఈ వేడుకకు అతిథులుగా రావడానికి అంగీకరించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుగారికీ, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుగారికి కృతజ్ఞతలు.
రెండు గంటలపాటు జరిగే ఈ వేడుక కోసం శోభన ఒక ప్రత్యేక డాన్స్ కంపోజ్ చేశారు. అలాగే... ‘మనం’ చిత్రంలో నాన్నకు ఇష్టమైన పాటను ఓ 60మంది పిల్లలు ఆలపిస్తారు. అక్కినేని ఫిలిం ఇనిస్టిట్యూట్‌కి చెందిన 19మంది విద్యార్థులు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న సందర్భంగా అమితాబ్‌గారి చేతుల మీదుగా సర్టిఫికెట్ల ప్రదానం జరుగుతుంది’’ అన్నారు. ‘‘దాదాసాహెబ్‌ఫాల్కే అవార్డు అందుకున్న క్షణంలో అక్కినేని మనసులో మొలకెత్తిన ఆలోచనకు రూపమే ఈ ‘ఏయన్నార్ నేషనల్ అవార్డు’’ అని టి.సుబ్బరామిరెడ్డి అన్నారు. ఇంకా నాగసుశీల కూడా మాట్లాడారు.