హాస్య నటుడి కోసం ప్రత్యేక బృందం
భువనేశ్వర్: క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలో చిక్కుకున్న ఒడియా చలన చిత్ర హాస్య నటుడు తత్వ ప్రకాష్ శత్పతి అలియాస్ పప్పూ పమ్ పమ్ ఇంకా పోలీసులకు చిక్కలేదు. పోలీసు యంత్రాంగం ఉద్దేశపూర్వకంగానే పప్పూ పమ్ పమ్‌ను అరెస్టు చేయడంలో జాప్యం చేస్తోందని మహిళా సంఘాలు, ప్రజాసంఘాలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు పోలీసుల వైఖరిని నిరసిస్తూ ఆందోళనలు సాగుతున్నాయి.
తప్పించుకున్న తిరుగుతున్న పప్పూ పమ్ పమ్ గాలించి అరెస్టు చేసేందుకు జంట నగరాల పోలీసు కమిషనరేటు ప్రత్యేక టీమ్‌ని నియమించినట్లు కమిషనరు వై. బి. ఖురానియా బుధవారం తెలిపారు. జిల్లా కలెక్టరు, పోలీసు సూపరింటెండెంటు, మహిళా ఠాణా అధికార వర్గాలు ఈ అంశాన్ని ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. మహిళా సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా పప్పూ పమ్ పమ్ అరెస్టు కోసం ఆందోళనలు, ప్రదర్శనలు నిర్వహిస్తున్నాయి.
రాజకీయ వాతావరణం వేడెక్కింది. బీజేపీ మహిళా మోర్చా ప్రత్యక్షంగా రంగంలోకి దిగింది. నగరంలో పప్పూ పమ్ పమ్ ఇంటికి దగ్గర ఖండగిరి ఛక్ ప్రాంతంలో బీజేపీ కార్యకర్తలు బుధవారం రాస్తా రోకో, ఆందోళన నిర్వహించారు. ఈ ఆందోళనలో భాగంగా పప్పూ పమ్ పమ్ దిష్టి బొమ్మని దహనం చేశారు.