ఫాంటసీ చిత్రంగా బ్రహ్మ డాట్ కామ్
తమిళసినిమా: ఫాంటసీ కామెడీ చిత్రాలకు మినిమం గ్యారెంటీ ఉంటుంది. అలా తెరకెక్కుతున్న తాజాగా చిత్రం బ్రహ్మ డాట్ కామ్ అంటున్నారు ఆ చిత్ర దర్శకుడు పురుష్ విజయకుమార్. ఈయన కథ, కథనం, మాటలు, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్న ఈ చిత్రాన్ని గణేశ్ డ్రీమ్ ఫ్యాక్టరీ పతాకంపై మిలానా కార్తికేయన్ నిర్మిస్తున్నారు. నకుల్, ఆస్నాజవేరి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఇందులో కే.భాగ్యరాజ్, కౌశల్య, సిద్ధార్థ్ విపిన్, జగన్, ప్రేమమ్‌ప్రియ, శ్రీరామ్ ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు.
సిద్ధార్థ్ విపిన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ ఇది ఫాంటసీ, కామెడీ ఇతివృత్తంతో తెరకెక్కిస్తున్న విభిన్న కథా చిత్రం అని చెప్పారు. దేవుళ్లకు మానవులకు మధ్య జరిగే సంఘటనలే చిత్ర కథ అని చెప్పారు.కరెక్ట్‌గా చెప్పాలంటే ఇది కంప్యూటర్ యుగంలో తిరువిడైయాడల్ చిత్రం అని చెప్పవచ్చన్నారు. చిత్ర షూటింగ్‌ను చెన్నై, బ్యాంకాంగ్, మలేషియాలో చిత్రీకరించినట్లు చెప్పారు. ఇందులో ప్రముఖ బాలీవుడ్ సంగీత దర్శకుడు విశాల్ శేఖర్ ఒక పాట పాడడం విశేషం అన్నారు. త్వరలోనే చిత్ర టీజర్, ఆడియోలను విడుదల చేయనున్నట్లు దర్శకుడు వెల్లడించారు.