షూటింగ్‌లో ప్రమాదం.. స్టంట్ మాస్టర్ మృతి
షూటింగ్‌లో ప్రమాదం.. స్టంట్ మాస్టర్ మృతి
Published Tue, Aug 15 2017 10:57 AM | Last Updated on Sun, Sep 17 2017 5:33 PM
వాన్‌కవర్: హాలీవుడ్ లో ఓ విషాదం చోటుచేసుకుంది. డెడ్‌పూల్ పార్ట్ 2 షూటింగ్ లో అపశ్రుతి చోటుచేసుకోగా, ఓ మహిళా స్టంట్ మాస్టర్ మృతి చెందారు. ఈ విషయాన్ని నటుడు ర్యాన్ రెనాల్డ్స్ తన ట్విట్టర్ లో తెలియజేశారు.
సోమవారం బ్రిటీష్ కొలంబియాలోని వాన్‌కవర్ కన్వెన్షన్ సెంటర్ వద్ద సినిమాకు సంబంధించి ఓ యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరించేందుకు సిద్ధమయ్యారు. స్టంట్ మాస్టర్ ఓయ్ ఎస్‌జే హర్రిస్ రిహార్సల్ చేస్తోంది. వేగంగా బైక్ నడుపుతూ ఓ సిగ్నల్ ను క్రాస్ చేసింది. అయితే అక్కడ మలుపు తిరిగే క్రమంలో బైక్ ను అదుపు చేయలేక ఆమె పక‍్కనే ఉన్న ఓ మాల్ లోని తలుపులను ఢీకొట్టింది. ప్రమాదంలో అక్కడికక్కడే ఆమె చనిపోగా, పగిలిన అద్ధాలు, రక్తపు మరకల చిత్రాలు బయటకు రావటం ప్రమాద తీవ్రతను తెలియజేస్తున్నాయి.
"ఈరోజు జరిగిన ఘటనతో నా గుండెలు బరువెక్కిపోయింది. డెడ్ పూల్ షూటింగ్ లో ప్రమాదం జరిగింది. అప్పటిదాకా మాతో నవ్వుతూ ఉన్న స్టంట్ మాస్టర్ ప్రాణాలు వదిలింది. ఇది ఊహించని పరిణామం. ఆమె కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నా" అని నటుడు ర్యాన్ పేర్కొన్నారు.
భద్రతా చర్యలు పాటించకపోవటం మూలంగానే షూటింగ్ లలో తరచూ ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని నిపుణులు చెబుతున్నారు. చివరిసారిగా 1996లో బ్రిటీష్ కొలంబియాలో ఓ షూటింగ్ సందర్భంగా హెలికాప్టర్ నుంచి దూకిన ఓ స్టంట్ మాస్టర్ పారాచ్యూట్ ఓపెన్ కాకపోవటంతో ప్రాణాలు కోల్పోయాడు.
Advertisement
Advertisement