నేనెవరి మాటా విననంతే!
‘‘నా కెరీర్‌లో ఇప్పటివరకూ 2013 బెస్ట్ ఇయర్ అనుకున్నాను. కానీ, ఇప్పుడు 2015 బెస్ట్ అంటున్నా. ఈ ఏడాది సూపర్ అని చెప్పడానికి ‘బాజీరావ్ మస్తానీ’ ఒక్కటి చాలు. ‘పీకు’ కూడా నాకు మంచి పేరు తెచ్చింది’’ అని నటి దీపికా పదుకొనే అన్నారు. సినిమాలు సెలక్ట్ చేసుకునే విషయంలో ఎవరి మాటా విననని ఆమె చెబుతూ - ‘‘దర్శకుడు నాకు కథ చెప్పిన తర్వాత చేయాలా? వద్దా? అనే విషయాన్ని నేనే నిర్ణయించుకుంటా. కథ నచ్చితే ఒప్పేసుకుంటా. కథ అంత బాగాలేదని ఎవరైనా వెనక్కి లాగాలని చూసినా వినను. ఒక్కసారి నేను డిసైడ్ అయ్యాక ఇక ఇతరుల మాటలు వినను.
వృత్తిపరంగానే కాదు... వ్యక్తిగతంగా కూడా అన్ని నిర్ణయాలూ నావే. ఇల్లు కొనడం నుంచి ఇన్వెస్ట్‌మెంట్స్ వరకూ ఎవరినీ సంప్రతించను. మా అమ్మానాన్న నాకు అంత స్వేచ్ఛ ఇచ్చారు. దానికి కారణం నా నిర్ణయాల మీద వాళ్లకున్న నమ్మకమే’’ అన్నారు. ‘‘ ‘మీ సినిమా వంద కోట్లకు పైగా వసూలు చేసిందట కదా?’ అని కొంతమంది అడుగుతుంటారు. కలెక్షన్స్ గురించి నాకెందుకు? మొదటి ఆటకే హిట్ టాక్ రావాలని మాత్రం కోరుకుంటాను. ఆ టాక్ వినపడితే చాలు. రిలీఫ్ ఫీలవుతాను’’ అని చెప్పారు.