మంజుల ఘట్టమనేని
‘‘ఏదో ఒక సినిమా డైరెక్షన్ చేయాలనే ఆలోచన, అవసరం నాకు లేదు. ప్రకృతిలో నేను ఏదైతే ఫీల్ అయ్యానో దాన్ని ప్రేక్షకులకు పంచాలని ఓ బాధ్యతగా ‘మనసుకు నచ్చింది’ కథ తయారు చేసుకున్నా. పైగా నాన్నగారు (కృష్ణ), మహేశ్‌బాబు సంపాదించుకున్న ఇమేజ్ వల్ల నాపై ఓ బాధ్యత ఉంటుంది’’ అని మంజుల ఘట్టమనేని అన్నారు. సందీప్ కిషన్, అమైరా దస్తూర్ జంటగా మంజుల దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘మనసుకు నచ్చింది’. సంజయ్ స్వరూప్. పి.కిరణ్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 16న విడుదలవుతోంది. మంజుల పంచుకున్న విశేషాలు..
► ప్రస్తుత బిజీ లైఫ్‌లో మనం చిన్న చిన్న అనుభూతుల్ని కోల్పోతున్నాం. వాటిని ఎలా ఆస్వాదించాలి? ప్రకృతితో ఎలా మమేకం కావాలి? అన్నదే ‘మనసుకు నచ్చింది’ క£ý . భాషపై నాకు పట్టు లేకపోవడంతో కథ రాయడానికి ఏడాది పట్టింది. నేను డైలాగులు ఇంగ్లీష్‌లో రాశా. వాటిని బుర్రా సాయిమాధవ్‌గారితో తెలుగులో రాయించాం.
► నా ఫస్ట్ లవ్ ఎప్పుడూ డైరెక్షనే. నేను డైరెక్షన్ చేస్తాననగానే నా భర్త (సంజయ్ స్వరూప్) సపోర్ట్ చేశారు. నాన్నగారు (కృష్ణ) థ్రిల్ అయ్యారు. ఈ సినిమాకి కిరణŠ గారు నిర్మాత అనగానే ఇంకా సంతోషపడ్డారు. మహేశ్‌బాబుకి చెప్పగానే ‘నీకు పిచ్చెక్కిందా. సడెన్‌గా డైరెక్షన్ ఏంటి?’ అన్నాడు. కానీ నా కథ విన్నాక నమ్మకం వచ్చింది. సినిమాలో ప్రకృతికి వాయిస్ ఓవర్ ఇచ్చాడు. ట్రైలర్ చూసి షాక్ అయ్యాడు. చాలా బాగుందన్నాడు.
► ప్రకృతే మా సినిమాలో ప్రధాన హైలెట్. అది కూడా ఒక హీరోనే. స్వచ్ఛమైన ప్రేమకథ, ఫన్ అందరినీ ఆకట్టుకుంటాయి. ప్రతి సన్నివేశం నా హృదయం నుంచి వచ్చింది. ఇందులో నిత్య పాత్ర నా క్యారెక్టర్‌కి దగ్గరగా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ‘మనసుకు నచ్చింది’ ఒక సముద్రం లాంటి సినిమా.
► సందీప్‌ని దృష్టిలో పెట్టుకుని కథ రాయలేదు. ముందు కథ రాసుకున్నా. హీరో ఎవరైతే బాగుంటారా? అనుకున్నా. కిరణ్‌గారు సందీప్ పేరు చెప్పారు. అప్పటి వరకూ నేను సందీప్ సినిమాలు చూడలేదు. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ సీడీ పంపితే చూశా. తర్వాత కలిసినప్పుడు కథకి తనే కరెక్ట్ అనిపించింది. మంచి పాత్ర ఇవ్వాలే కానీ తను బాగా నటిస్తాడు.
► నాకు డైరెక్షన్ కష్టం అనిపించలేదు. చాలా ఎంజాయ్ చేశా. నేను డైరెక్షన్ చేసిన తీరు చూసిన కెమెరామెన్ రవి యాదవ్ ‘మీకిది తొలి సినిమాలా లేదు మేడమ్. పది సినిమాలు తీసిన అనుభవం ఉన్నట్లుంది’ అన్నారు. నా సినిమాకు రెహమాన్‌గారితో సంగీతం చేయించాలనే ఆలోచన ఉండేది. రధన్ స్వరపరచిన ‘అందాల రాక్షసి’ పాటలు వినగానే నాకు రెహమాన్‌గారు గుర్తుకొచ్చారు. రధన్ అద్భుతమైన పాటలు, నేపథ్య సంగీతం ఇచ్చారు.
► నాన్నగారు, మహేశ్ ఇంకా ఈ సినిమా చూడలేదు. ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తామన్నారు. 16వ తేదీ ఎప్పుడొస్తుందా అని చాలా ఎగై్జటింగ్‌గా ఉంది. మహేశ్‌కి ఏ కథ అయినా సరిపోతుంది. తను ఇక్కడ ఉండటం టాలీవుడ్ అదృష్టం. తనతో పనిచేయడం నా కల. తన ఇమేజ్‌కి తగ్గట్టు కథ రెడీ చేస్తే పిలిచి మరీ అవకాశమిస్తాడేమో.
► ట్రైలర్ చూసిన కొందరు కృష్ణవంశీగారిలా కొత్తగా తీశావని అభినందిస్తున్నారు. రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలు తప్ప కొత్త కథలను ప్రేక్షకులు ఆదరించరనే భావన ఫిల్మ్‌మేకర్స్‌లో ఉంది. ఆ ఆలోచనా ధోరణి మారాలి. ప్రేక్షకులు చాలా తెలివైనవారు. కొత్త కథలనెప్పుడూ ఆదరిస్తారు. అందుకే ‘పెళ్ళిచూపులు, అర్జున్‌రెడ్డి, తొలిప్రేమ’ వంటి వైవిధ్యమైన చిత్రాలు వచ్చాయి.. హిట్ అయ్యాయి.
► ఓ టాప్ హీరో ప్రజలకు సేవ చేద్దామనుకొని రాజకీయాల్లోకి ఎలా వెళ్లాడు? అనే అంశంపై ఓ కథ రాసుకున్నా. అది పవన్ కల్యాణ్‌గారి వ్యక్తిత్వానికి దగ్గరగా ఉంటుంది. అవకాశం వస్తే ఆయనతో చేయడానికి రెడీ. హీరోని దృష్టిలో పెట్టుకుని కథలు రాయను. కథ రాశాకే హీరో ఎవరని ఆలోచిస్తా.
Comments
Please login to add a commentAdd a comment