Amaiya Dastur
-
వెంటనే స్టెప్పేశా
‘అవకాశం ఎప్పుడొస్తుందో మనకు తెలియదు. ఏమాత్రం అశ్రద్ధగా ఉన్నా చాన్స్ మిస్ చేసుకుంటాం’ అని అంటున్నారు అమైరా దస్తూర్. ధనుశ్ సరసన నటించిన ‘అనేకుడు’ (డబ్బింగ్) ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అమైరా.. స్ట్రయిట్ సినిమా ‘మనసుకు నచ్చింది’తో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించారు. తాజాగా ఈ భామ ప్రభుదేవాతో నటించే చాన్స్ కొట్టేశారు. ప్రస్తుతం దర్శకుడు ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో ‘కాదలై తేడి నిత్యానంద’ సినిమా చేస్తున్నారామె. ఆ సినిమా తర్వాత ప్రభుదేవా కీలక పాత్రధారిగా ఆదిక్ ఓ సైకలాజికల్ థ్రిల్లర్ తెరకెక్కించనున్నారు. ఇందులో ప్రభుదేవాతో యాక్ట్ చేసే చాన్స్ వచ్చిందని ఎగై్జట్ అవుతున్నారు అమైరా. ఈ విషయం గురించి మాట్లాడుతూ – ‘‘కాదలై తేడి..’ సమయంలోనే ఈ సినిమా గురించి దర్శకుడు చెప్పారు. కథ నాకు బాగా నచ్చింది. ఇందులో భాగమవ్వాలని అనుకున్నాను. ఈ సినిమాలో హీరోయిన్గా చేస్తావా? అని ఆయనే అడిగారు. ప్రభుదేవా సరసన చాన్స్ వస్తే ఎవరు మిస్ చేసుకుంటారు? వెంటనే యస్ చెప్పాను. స్క్రిప్ట్‌పరంగా ఫస్ట్ హాఫ్‌లో సంప్రదాయంగా కనిపిస్తా. సెకండ్ హాఫ్‌లో చాలా బోల్డ్‌గా, సెక్సీగా కనిపిస్తాను. అలాగే ప్రభుదేవాగారితో కాబట్టి డ్యాన్స్ విషయంలో బాగా కేర్ తీసుకుంటున్నాను’’ అన్నారు అమైరా. -
మాట సాయం!
మాట్లాడేందుకు స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు బాలీవుడ్ కథానాయిక కంగనా రనౌత్. ఏమంటున్నారు బాస్..! ఏ విషయాన్నైనా కుండబద్దలు కొట్టినట్లు చెప్పే కంగనాకు స్పీచ్‌లో ట్రైనింగా అంటున్నారా? అసలు విషయం ఏంటంటే.. ఆమె కొత్త మాటలు నేర్చుకుంటున్నది సినిమా కోసం. ప్రకాశ్ కొవెలమూడి దర్శకత్వంలో కంగనా రనౌత్, రాజ్‌కుమార్ రావ్, అమైరా దస్తూర్ ముఖ్య తారలుగా నటిస్తున్న చిత్రం ‘మెంటల్ హై క్యా’. ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ లండన్‌లో స్టార్ట్ అయ్యింది. ఈ షెడ్యూల్ దాదాపు నెల రోజులు జరుగుతుంది. ఇందులో వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్‌గా కంగనా రనౌత్ నటిస్తున్నారు. ఇందుకోసం ఆమె ప్రొఫెషనల్స్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నారట. మాట్లాడటం చేత కాక కాదు.. వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ అంటే.. మంచి మాడ్యులేషన్‌తో మాట్లాడాలి కదా. రియల్ లైఫ్‌లో మాటలతో చెడుగుడు ఆడే కంగనా ఈ సినిమాలో భాష రాని వారికి మాట సాయం చేస్తారన్నమాట. ఈ సంగతి ఇలా ఉంచితే... కంగనా రనౌత్ ముఖ్య పాత్రలో నటించిన చిత్రం ‘మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ’. క్రిష్ దర్శకత్వంలో వీరనారి ఝాన్సీ లక్ష్మీభాయ్ జీవితం ఆధారంగా రూపొందిన ఈ సినిమా రిలీజ్‌కు రెడీగా ఉంది. -
ప్రస్థానం ప్రారంభం
అబ్బా.. బాలీవుడ్ సినిమాలు భలే ఉంటాయిరా బాబు! మన టాలీవుడ్లో అలాంటి సినిమాలు రావడం తక్కువ అని కొందరు అంటుంటారు. కానీ ఎవరి టాలెంట్ వాళ్లకు ఉంటుంది. రీసెంట్ టైమ్స్‌లో అయితే మన తెలుగు సినిమాలు ప్రపంచాన్ని ఓ ఊపు ఊపేస్తున్నాయి. అందుకు మన ‘బాహుబలి’ చిత్రమే నిదర్శనం. అంతెందుకు ఇప్పుడు చూడండి. తెలుగు సినిమాలు ‘ప్రస్థానం, టెంపర్, అర్జున్‌రెడ్డి’ బీటౌన్‌లో రీమేక్ అవుతున్నాయి. ‘అర్జున్‌రెడ్డి’ హిందీ రీమేక్ జూలైలో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఆల్రెడీ ‘టెంపర్’ రీమేక్ ‘సింబా’కు టీమ్ కొబ్బరికాయ కొట్టారు. గురువారం హిందీ ‘ప్రస్థానం’ మొదలైంది. తెలుగులో డైరెక్ట్ చేసిన దేవా కట్టానే దర్శకత్వం వహిస్తున్నారు. సంజయ్ దత్, మనీషా కోయిరాల, అలీ ఫజల్, అమైరా దస్తూర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. నటుడు జాకీ ష్రాఫ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారట. పదేళ్ల క్రితం హిందీ చిత్రం ‘కార్తూస్’లో కలిసి నటించిన సంజయ్, మనీషా, జాకీ మళ్లీ ఇప్పుడు ‘ప్రస్థానం’ హిందీ రీమేక్‌లో నటిస్తుండటం విశేషం. ‘‘ఫస్ట్ డే షూట్లో సంజయ్‌దత్ పాల్గొన్నారు. చాలా హ్యాపీగా ఉంది’’ అని పేర్కొన్నారు దేవా కట్టా. -
ఇది నా గుడ్ టైమ్
రాజ్ తరుణ్, అమైరా దస్తూర్ జంటగా సంజనారెడ్డి దర్శకత్వంలో ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ‘రాజుగాడు’ చిత్రం ఈ రోజు విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో కథానాయిక అమైరా దస్తూర్ మాట్లాడుతూ– ‘‘మూడేళ్ల క్రితం నేను నటించిన ‘అనేగన్’ సినిమా చూసి దర్శకురాలు సంజన ఫోన్ చేశారు. సినిమాలో నటిస్తారా? అని అడిగారు. వాస్తవానికి తెలుగులో నాకు ‘రాజుగాడు’ తొలి చిత్రం కావాల్సింది. షూటింగ్ ఆలస్యం కావడం వల్ల ఇది నా రెండో సినిమాగా మారింది. ఈ సినిమా ఫస్ట్ హాఫ్‌లో హైదరాబాదీ అమ్మాయిలా, సెకండాఫ్‌లో విలేజ్ అమ్మాయిలా నటించాను. రాజ్ తరుణ్ నాకన్నా ఒక ఏడాదే పెద్ద. ఇద్దరి అభిరుచులు బాగా కలిశాయి. షూటింగ్లో ఉన్నా, బయట ఉన్నా రాజ్ ఒకేలా సరదాగా ఉంటాడు. దర్శకురాలు సంజన చాలా స్మార్ట్. ఆమెతో వర్క్ చేస్తే ఒక ఫ్యామిలీతో వర్క్ చేసినట్లు ఉంటుంది. సంజయ్‌లీలా భన్సాలీ నా ఫేవరెట్ డైరెక్టర్. ‘పద్మావత్’ లాంటి íపీరియాడికల్ సినిమాలో నటించాలన్నది నా డ్రీమ్’’ అన్నారు. ప్రస్తుతం అమైరా హిందీలో దేవకట్టా దర్శకత్వంలో ‘ప్రస్థానం’ రీమేక్, ప్రకాశ్ కోవెలమూడి దర్శకత్వంలో ‘మెంటల్ హై క్యా’ చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ సినిమాల గురించి ఆమె చెబుతూ– ‘‘ఈ ఏడాది నాకు చాలా లక్కీ. ఇద్దరు సౌత్ డైరెక్టర్స్‌తో హిందీ సినిమాలు చేస్తున్నాను. నిజంగా ఇది నాకు గుడ్ టైమ్. మంచి మంచి పాత్రలు చేసే అవకాశం వస్తోంది’’ అన్నారు. -
అదే నా విజయంగా భావిస్తున్నా
‘‘ఇప్పటి పరిస్థితుల్లో డైరెక్షన్ చాన్స్ రావడం చాలా అరుదు. నన్ను నమ్మి అవకాశమిచ్చిన నిర్మాత అనిల్ సుంకరగారికి ఎప్పటికీ రుణపడి ఉంటా. మా నాన్నగారు సినిమాలు చూసి 25 ఏళ్లవుతోంది. ‘రాజుగాడు’ సినిమాలోని రెండు సన్నివేశాలు ఆయనకి చూపించడంతో తెగ నవ్వుకున్నారు. అదే నా విజయంగా భావిస్తున్నా’’ అని సంజనారెడ్డి అన్నారు. రాజ్‌తరుణ్, అమైరా దస్తూర్ జంటగా సంజనారెడ్డి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మించిన ‘రాజుగాడు’ జూన్ 1న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ–రిలీజ్ ఫంక్షన్ నిర్వహించారు. అనిల్ సుంకర మాట్లాడుతూ– ‘భలే భలే మగాడివోయ్’ చూసి మారుతీగారిని మంచి కథ అడగ్గా ‘రాజుగాడు’ కథ ఇచ్చారు. ఆ కథను సంజనారెడ్డి అద్భుతంగా తెరకెక్కించారు. జూన్ 1 ఆమె జీవితంలో బిగ్గెస్ట్ డేగా నిలుస్తుంది. రాజ్ తరుణ్‌తో మళ్లీ మరో సినిమా ఎప్పుడు తీయాలా? అని ఆలోచిస్తున్నాను. మా సినిమా ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్విస్తుంది’’ అన్నారు. ‘‘ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో నేను నటించిన 5వ సినిమా ఇది. ఈ బ్యానర్లో ఇంకా చాలా సినిమాలు చేయాలి. సంజనా ప్రతి ఆర్టిస్ట్ నుంచి మంచి కామెడీ రాబట్టుకున్నారు’’ అన్నారు రాజ్ తరుణ్. ‘‘ఈ సినిమాలో నటించే అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. సినిమా బాగా వచ్చింది. అందరికీ నచ్చుతుంది’’ అన్నారు అమైరా దస్తూర్. -
వర్మగారే నాకు స్ఫూర్తి
‘‘మాది శ్రీకాకుళం జిల్లా టెక్కలి. ఐటీ కంపెనీలో కొన్ని రోజులు పని చేశా. జర్నలిస్ట్‌గా కూడా వర్క్ చేశాను. సినిమా రంగంపై ఆసక్తితో ఓ స్నేహితుడి ద్వారా రామ్‌గోపాల్ వర్మగారి వద్ద ‘రౌడీ’ సినిమాకి సహాయ దర్శకురాలిగా చేశా. నేను డైరెక్టర్ కావడానికి ఆయనే స్ఫూర్తి’’ అని సంజనారెడ్డి అన్నారు. రాజ్ తరుణ్ హీరోగా, అమైరా దస్తూర్, పూజిత హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘రాజుగాడు’. సంజనారెడ్డి దర్శకత్వంలో ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ సినిమా జూన్ 1న విడుదలవుతోంది. ఈ సందర్భంగా సంజనారెడ్డి మాట్లాడుతూ– ‘‘శివ’ సినిమా 25 వసంతాల సమయంలో అమలగారిని కలిశాను. ఆమె నన్ను ఓ యాడ్‌ను డైరెక్ట్ చేయమన్నారు. నేను చేసిన యాడ్ అందరికీ నచ్చడంతో నాలో నమ్మకం పెరిగింది. అలా సినిమా ప్రయత్నాలు చేస్తున్న టైమ్‌లో రాజ్‌తరుణ్ పరిచయం అయ్యారు. ‘రాజుగాడు’ నిర్మాతల్ని ఆయనే పరిచయం చేశారు. ఈ చిత్రంలో హీరోకి క్లిప్టోమేనియా అనే డిజార్డర్ ఉంటుంది. ఈ వ్యాధి ఉన్నవారు వాళ్లకు తెలియకుండానే దొంగతనం చేస్తుంటారు. ఈ వ్యాధి వల్ల హీరో ఉద్యోగాలన్నీ కోల్పోతాడు. కొడుకు కోసం తండ్రి రాజేంద్ర ప్రసాద్ సూపర్‌మార్కెట్ నడుపుతుంటాడు. ఇద్దరి మధ్య కామెడీ చక్కగా ఉంటుంది. ఇంటర్వెల్, క్లయిమాక్స్ సినిమాటిక్‌గా ఉంటాయి. మిగతాదంతా పక్కింటి కథను తెరపై చూస్తున్నట్లు ఉంటుంది. సినిమా విడుదల తర్వాత మరిన్ని అవకాశాలు వస్తాయనే నమ్మకం ఉంది’’ అన్నారు. -
ప్రతి సినిమా స్పెషలే
‘‘సినిమా రిజల్ట్‌ని డిసైడ్ చేసే ఫ్యాక్టర్స్ చాలానే ఉంటాయి. ఎక్కువ చిత్రాల్లో నటించాలని ఆరాటపడను. మంచి చిత్రాలు చేయాలని ఆచితూచి స్క్రిప్ట్‌ను ఎంచుకుంటున్నాను. నేను చేసే ప్రతి సినిమా నాకు స్పెషలే. తప్పుల నుంచి కొత్త విషయాలు నేర్చుకున్నప్పుడే కెరీర్లో ముందుకు వెళ్లగలుగుతాం’’ అన్నారు రాజ్ తరుణ్. సంజనారెడ్డి దర్శకత్వంలో రాజ్ తరుణ్, అమైరా దస్తూర్ జంటగా ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మాం సుంకర నిర్మించిన చిత్రం ‘రాజుగాడు’. నటుడు రాజేంద్రప్రసాద్ కీలక పాత్ర చేసిన ఈ చిత్రం జూన్ 1న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన పాత్రికేయల సమావేశంలో హీరో రాజ్ తరుణ్ పలు విషయాలు ముచ్చటించారు. ► మహిళా దర్శకులతో వరుస చిత్రాలు చేయడానికి పెద్దగా కారణాలు లేవు. యాదృశ్చికంగా అలా కుదిరిందంతే. ‘రంగులరాట్నం’ సినిమా కంటే ముందే ‘రాజుగాడు’ ప్రారంభమైంది. ఈ ఏడాదికి సంక్రాంతికి ‘రాజుగాడు’ చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకున్నాం. కానీ ‘రంగులరాట్నం’ లైన్లో ఉండటంతో కుదర్లేదు. మంచి డేట్ చూసుకుని ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాం. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ► ఈ చిత్రంలో క్లిప్టోమేనియా అనే డిజార్డర్ వల్ల తెలియకుండానే దొంగతనం చేసే హీరో క్యారెక్టర్ చేశాను. ఇలా డిజార్డర్‌తో బాధపడే హీరో ఊహించని పరిస్థితులను ఫేస్ చేసి ఎలా బయటపడ్డాడన్నదే చిత్రం కథ. సినిమా మొత్తం ఎంటర్టైనింగ్ పంథాలో సాగుతుంది. ► డైరెక్టర్ అంటే డైరెక్టరే. అందులో లేడీ అయితే ఏంటీ? జెంట్ అయితే ఏంటీ? ఎవరైనా ఎంత బాగా ఎగ్జిక్యూట్ చేస్తారన్నదే ముఖ్యం. డైరెక్షన్లో నేనూ ఇన్వాల్వ్ కాను. ఎందుకంటే ఎవరి ఆలోచనలు వారికి ఉంటాయి. కానీ స్టోరీ డిస్కషన్స్‌లో మాత్రం పాల్గొంటాను. ► నేను హీరోగా నటిస్తున్న ‘లవర్’ సినిమా దాదాపు పూర్తయ్యింది. ఆ నెక్ట్స్ సూర్యప్రతాప్గారి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాను. అలాగే వశిష్ట అనే కొత్త అబ్బాయి దర్శకత్వంలో సినిమా చేయడానికి కమిట్ అయ్యాను. -
బాలీవుడ్ ప్రస్థానం
‘హీరోలూ విలన్లూ లేరీ నాటకంలో..’ అంటూ 2010లో దర్శకుడు దేవా కట్టా రూపొందించిన పొలిటికల్ థ్రిల్లర్ ‘ప్రస్థానం’ మంచి సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే. శర్వానంద్ నటన, సాయి కుమార్ డైలాగ్స్ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్స్గా నిలిచాయి. ఇప్పుడు అవే పదునైన సంభాషణలు బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ పలకబోతున్నారు. తెలుగులో రిలీజ్ అయిన ఎనిమిది సంవత్సరాలకు ఈ సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నారు దేవా కట్టా. సాయి కుమార్ పాత్రలో సంజయ్ దత్, శర్వానంద్ పాత్రలో అలీ ఫాజల్ నటించనున్నారు. హీరోయిన్గా అమైరా దస్తూర్ కనిపించనున్నారు. ఈ సినిమాకు సంజయ్ దత్ ఓ నిర్మాత కావడం విశేషం. సంజయ్ దత్ తల్లి, బాలీవుడ్ సూపర్‌స్టార్ నర్గీస్ జయంతి సందర్భంగా జూన్ 1న ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. -
స్పీడ్ పెరిగింది
సూపర్‌స్టార్ కృష్ణ కూతురు మంజుల తొలిసారి దర్శకత్వం వహించిన ‘మనసుకు నచ్చింది’ సినిమాలో బాగా నటించి తెలుగు ప్రేక్షకులకు నచ్చేశారు ముంబై బ్యూటీ అమైరా దస్తూర్. తెలుగు తెరపైకి రాకముందే తమిళ చిత్రాల్లో నటించిన అమైరా ఇప్పుడు మరో తమిళ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. జీవీ ప్రకాశ్ హీరోగా అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో రూపొందనున్న ఫాంటసీ లవ్ \చిత్రంలో నటించనున్నారామె. మూడేళ్ల క్రితం జీవీ, రవిచంద్రన్ కాంబినేషన్లోనే వచ్చిన తమిళ చిత్రం ‘త్రిష ఇల్లా నయనతార’తెలుగులో ‘త్రిష లేదా నయనతార’ అనే పేరుతో రిలీజైంది. ఈ సంగతి ఇలా ఉంచితే.. రాజ్ తరణ్, అమైరా దస్తూర్ జంటగా నటించిన తెలుగు చిత్రం ‘రాజుగాడు’ రిలీజ్‌కు రెడీగా ఉంది. ఇలా ఒక సినిమా రిలీజ్ కాకముందే మరో సినిమాను లైన్లో పెడుతూ స్పీడ్ పెంచారు అమైరా. అంతేకాదండోయ్. ఒక హిందీలో చిత్రంలో నటించడం కోసం ఆమె జిమ్నాస్టిక్స్ను ప్రాక్టీస్ చేస్తున్నారు కూడా. -
వినోదాల రాజుగాడు
రాజ్ తరుణ్, అమైరా దస్తూర్ జంటగా రూపొందుతోన్న చిత్రం ‘రాజుగాడు’. సంజనారెడ్డిని దర్శకురాలిగా పరిచయం చేస్తూ ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ సినిమా మే 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా రామబ్రహ్మం సుంకర మాట్లాడుతూ –‘‘రాజ్ తరుణ్ మా బ్యానర్లో చేస్తున్న నాలుగో చిత్రమిది. హిలేరియస్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోంది. హీరో క్యారెక్టరైజేషన్, రాజేంద్రప్రసాద్‌గారి కామెడీ ప్రత్యేక ఆకర్షణలు. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌కి విశేషమైన స్పందన రావడంతో పాటు సినిమా మీద మంచి హైప్ క్రియేట్ అయింది.ఈ చిత్రాన్ని వేసవి కానుకగా మే 11న రిలీజ్ చేస్తున్నాం. త్వరలోనే ఆడియో విడుదల చేస్తాం. మా బ్యానర్లో ‘రాజుగాడు‘ మరో హిట్ సినిమాగా నిలుస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. నాగినీడు, రావురమేష్, పృథ్వీ, కృష్ణ భగవాన్, సుబ్బరాజు, రాజా రవీంద్ర, సితార, మీనాకుమారి, ప్రమోదిని తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: బి.రాజశేఖర్, సంగీతం: గోపీ సుందర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కృష్ణ కిషోర్ గరికపాటి, సహ నిర్మాత: అజయ్ సుంకర–డా.లక్ష్మారెడ్డి. -
మంచి సినిమా చూశాం అంటారు
‘‘రియల్ లైఫ్‌లో నేను మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగా. కానీ.. ‘మనసుకు నచ్చింది’ సినిమాలో సూరజ్ పాత్రలో హై క్లాస్ అబ్బాయిగా కనిపిస్తా. నాకు అలాంటి స్నేహితులు ఉండటంతో సూరజ్‌గా సులభంగా నటించగలిగా’’ అని హీరో సందీప్ కిషన్ అన్నారు. సందీప్ కిషన్, అమైరా దస్తూర్, త్రిదా చౌదరి హీరో హీరోయిన్లుగా మంజుల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మనసుకు నచ్చింది’. సంజయ్ స్వరూప్, పి.కిరణ్ నిర్మించిన ఈ సినిమా ఈ రోజు విడుదలవుతోంది. ఈ సందర్భంగా సందీప్ కిషన్ మీడియాతో మాట్లాడుతూ– ‘‘మంజులగారు చెప్పిన కథ వినగానే చాలా ఎగై్జట్ అయ్యా. ప్రతి సన్నివేశం చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. నాకు చెప్పిన కథని మంజులగారు అలాగే తెరపైకి తీసుకురావడం గ్రేట్. ఇదొక ఫీల్ గుడ్ మూవీ. మనం మిస్సవుతున్న చిన్న చిన్న సంతోషాలని ఈ కథ గుర్తు చేస్తుంది. ఇటీవల నా సినిమాల్లో వినోదం మిస్ అవడంతో ప్రేక్షకులు సరిగ్గా ఆదరించలేదు. ‘మనసుకు నచ్చింది’లో ఫన్ ఉంటుంది. రియలిస్టిక్ పెర్ఫార్మెన్స్ నేనిప్పటి వరకూ చేయలేదు. ఈ చిత్రంలో చేశా. పిల్లల నుంచి పెద్దల వరకూ.. ముఖ్యంగా పిల్లలకీ, మహిళలకి మా సినిమా బాగా నచ్చుతుంది. ఓ మంచి సినిమా చూశామనే భావన అన్ని వర్గాల ప్రేక్షకులకు కలుగుతుంది’’ అన్నారు. ప్రస్తుతం కునాల్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నా. ఆ తర్వాత నందిని పులి అనే లేడీ డైరెక్టర్‌తో లవ్‌స్టోరీ, కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో సినిమాలు చేయనున్నా’’ అన్నారు. బషీద్ వల్ల నాకే ఎక్కువ నష్టం ‘‘సీవీ కుమార్ స్వీయదర్శకత్వంలో నిర్మించిన ‘మాయవన్’ సినిమా తమిళంలో సూపర్ హిట్ అయింది. ఆ సినిమాని నిర్మాత ఎస్.కె. బషీద్ తెలుగులో ‘ప్రాజెక్ట్ జెడ్’ పేరుతో విడుదల చేశారు. ఆ సినిమాకి నేను తెలుగు డబ్బింగ్ చెప్పలేదని, దాంతో నష్టపోయానని ఆయన ఆరోపిస్తున్నారు. రామానాయుడు స్టూడియోలో నేను డబ్బింగ్ చెప్పా. సీవీ కుమార్‌గారికి బషీద్ పూర్తి డబ్బులు చెల్లించలేదు. దాంతో ఆయన డబ్బింగ్ వెర్షన్ ఇవ్వలేదు. కానీ బషీద్ సెన్సార్ ప్రింట్‌నే రిలీజ్ చేయడంతో ఫ్లాప్ అయింది. ఆ రకంగా బషీద్ వల్ల నాకే ఎక్కువ నష్టం. తమిళంలో హిట్ అయిన ఓ సినిమాని తెలుగులో చంపేశాడు బషీద్’’ అని సందీప్ కిషన్ అన్నారు. -
అక్కతో సినిమా కూడా చేస్తానేమో?
‘‘మంజుల డైరెక్షన్ చేస్తుందని ఊహించలేదు. హాలిడేస్ టైమ్‌లో తను ఏదో రాసుకుంటుంటే కవిత రాసుకుంటుందేమో అనుకున్నా. కానీ సినిమా కథ రాసుకుంటుందని అనుకోలేదు’’ అని హీరో మహేశ్‌బాబు అన్నారు. సందీప్ కిషన్, అమైరా దస్తూర్, త్రిదా చౌదరి హీరో హీరోయిన్లుగా మంజుల దర్శకత్వంలో సంజయ్ స్వరూప్, పి.కిరణ్ నిర్మించిన ‘మనసుకు నచ్చింది’ సినిమా రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ–రిలీజ్ వేడుకకి ముఖ్య అతిథిగా విచ్చేసిన మహేశ్‌బాబు మాట్లాడుతూ– ‘‘మంజుల కథ ప్రిపేర్ చేసుకొని, సినిమా చేయబోతున్నానని చెప్పినప్పుడు నేను షాక్ అయ్యా. ఒకరకంగా గర్వంగా ఫీలయ్యాను. విజువల్స్ బాగా నచ్చాయి. మా కిరణ్‌గారి సపోర్ట్, గైడెన్స్ సినిమాకి చాలా ప్లస్ అయ్యింది. సినిమా తప్పకుండా హిట్ అవుతుందని ఆశిస్తున్నా. భవిష్యత్‌లో మా అక్కతో (మంజుల) సినిమా కూడా చేస్తానేమో?’’ అన్నారు. ‘‘మనసుకు నచ్చింది’ కథ రాయడం మొదలుకొని, సినిమా పూర్తి చేయడం వరకూ ఒక నేచురల్ ప్రాసెస్‌లా జరిగింది. మా నాన్నగారు (కృష్ణ), తమ్ముడు మహేశ్ గర్వపడేలా ఈ సినిమా ఉంటుంది. ఒకానొక సందర్భంలో మహేశ్ కొడుకు గౌతమ్ వెళ్లి ‘నాన్నా.. మంజుల ఆంటీ సినిమాలో ఎప్పుడు యాక్ట్ చేస్తావ్?’ అని అడిగితే చాలా సింపుల్‌గా ‘అదే నా ఆఖరి సినిమా అవుతుంది’ అన్నాడట (నవ్వుతూ). కిరణ్‌గారి సహకారానికి రుణపడి ఉంటా’’ అన్నారు మంజుల. ‘‘మంజులగారి దర్శకత్వంలో హీరోగా చేయడం.. అది ఆమె ఫస్ట్ మూవీ కావడం నా లక్’’ అన్నారు సందీప్ కిషన్. -
అప్పుడు మహేశ్ పిలిచి మరీ చాన్స్ ఇస్తాడేమో!
‘‘ఏదో ఒక సినిమా డైరెక్షన్ చేయాలనే ఆలోచన, అవసరం నాకు లేదు. ప్రకృతిలో నేను ఏదైతే ఫీల్ అయ్యానో దాన్ని ప్రేక్షకులకు పంచాలని ఓ బాధ్యతగా ‘మనసుకు నచ్చింది’ కథ తయారు చేసుకున్నా. పైగా నాన్నగారు (కృష్ణ), మహేశ్‌బాబు సంపాదించుకున్న ఇమేజ్ వల్ల నాపై ఓ బాధ్యత ఉంటుంది’’ అని మంజుల ఘట్టమనేని అన్నారు. సందీప్ కిషన్, అమైరా దస్తూర్ జంటగా మంజుల దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘మనసుకు నచ్చింది’. సంజయ్ స్వరూప్. పి.కిరణ్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 16న విడుదలవుతోంది. మంజుల పంచుకున్న విశేషాలు.. ► ప్రస్తుత బిజీ లైఫ్‌లో మనం చిన్న చిన్న అనుభూతుల్ని కోల్పోతున్నాం. వాటిని ఎలా ఆస్వాదించాలి? ప్రకృతితో ఎలా మమేకం కావాలి? అన్నదే ‘మనసుకు నచ్చింది’ క£ý . భాషపై నాకు పట్టు లేకపోవడంతో కథ రాయడానికి ఏడాది పట్టింది. నేను డైలాగులు ఇంగ్లీష్‌లో రాశా. వాటిని బుర్రా సాయిమాధవ్గారితో తెలుగులో రాయించాం. ► నా ఫస్ట్ లవ్ ఎప్పుడూ డైరెక్షనే. నేను డైరెక్షన్ చేస్తాననగానే నా భర్త (సంజయ్ స్వరూప్) సపోర్ట్ చేశారు. నాన్నగారు (కృష్ణ) థ్రిల్ అయ్యారు. ఈ సినిమాకి కిరణŠ గారు నిర్మాత అనగానే ఇంకా సంతోషపడ్డారు. మహేశ్‌బాబుకి చెప్పగానే ‘నీకు పిచ్చెక్కిందా. సడెన్‌గా డైరెక్షన్ ఏంటి?’ అన్నాడు. కానీ నా కథ విన్నాక నమ్మకం వచ్చింది. సినిమాలో ప్రకృతికి వాయిస్ ఓవర్ ఇచ్చాడు. ట్రైలర్ చూసి షాక్ అయ్యాడు. చాలా బాగుందన్నాడు. ► ప్రకృతే మా సినిమాలో ప్రధాన హైలెట్. అది కూడా ఒక హీరోనే. స్వచ్ఛమైన ప్రేమకథ, ఫన్ అందరినీ ఆకట్టుకుంటాయి. ప్రతి సన్నివేశం నా హృదయం నుంచి వచ్చింది. ఇందులో నిత్య పాత్ర నా క్యారెక్టర్‌కి దగ్గరగా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ‘మనసుకు నచ్చింది’ ఒక సముద్రం లాంటి సినిమా. ► సందీప్‌ని దృష్టిలో పెట్టుకుని కథ రాయలేదు. ముందు కథ రాసుకున్నా. హీరో ఎవరైతే బాగుంటారా? అనుకున్నా. కిరణ్‌గారు సందీప్ పేరు చెప్పారు. అప్పటి వరకూ నేను సందీప్ సినిమాలు చూడలేదు. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ సీడీ పంపితే చూశా. తర్వాత కలిసినప్పుడు కథకి తనే కరెక్ట్ అనిపించింది. మంచి పాత్ర ఇవ్వాలే కానీ తను బాగా నటిస్తాడు. ► నాకు డైరెక్షన్ కష్టం అనిపించలేదు. చాలా ఎంజాయ్ చేశా. నేను డైరెక్షన్ చేసిన తీరు చూసిన కెమెరామెన్ రవి యాదవ్ ‘మీకిది తొలి సినిమాలా లేదు మేడమ్. పది సినిమాలు తీసిన అనుభవం ఉన్నట్లుంది’ అన్నారు. నా సినిమాకు రెహమాన్‌గారితో సంగీతం చేయించాలనే ఆలోచన ఉండేది. రధన్ స్వరపరచిన ‘అందాల రాక్షసి’ పాటలు వినగానే నాకు రెహమాన్‌గారు గుర్తుకొచ్చారు. రధన్ అద్భుతమైన పాటలు, నేపథ్య సంగీతం ఇచ్చారు. ► నాన్నగారు, మహేశ్ ఇంకా ఈ సినిమా చూడలేదు. ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తామన్నారు. 16వ తేదీ ఎప్పుడొస్తుందా అని చాలా ఎగై్జటింగ్‌గా ఉంది. మహేశ్‌కి ఏ కథ అయినా సరిపోతుంది. తను ఇక్కడ ఉండటం టాలీవుడ్ అదృష్టం. తనతో పనిచేయడం నా కల. తన ఇమేజ్‌కి తగ్గట్టు కథ రెడీ చేస్తే పిలిచి మరీ అవకాశమిస్తాడేమో. ► ట్రైలర్ చూసిన కొందరు కృష్ణవంశీగారిలా కొత్తగా తీశావని అభినందిస్తున్నారు. రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలు తప్ప కొత్త కథలను ప్రేక్షకులు ఆదరించరనే భావన ఫిల్మ్‌మేకర్స్‌లో ఉంది. ఆ ఆలోచనా ధోరణి మారాలి. ప్రేక్షకులు చాలా తెలివైనవారు. కొత్త కథలనెప్పుడూ ఆదరిస్తారు. అందుకే ‘పెళ్ళిచూపులు, అర్జున్‌రెడ్డి, తొలిప్రేమ’ వంటి వైవిధ్యమైన చిత్రాలు వచ్చాయి.. హిట్ అయ్యాయి. ► ఓ టాప్ హీరో ప్రజలకు సేవ చేద్దామనుకొని రాజకీయాల్లోకి ఎలా వెళ్లాడు? అనే అంశంపై ఓ కథ రాసుకున్నా. అది పవన్ కల్యాణ్‌గారి వ్యక్తిత్వానికి దగ్గరగా ఉంటుంది. అవకాశం వస్తే ఆయనతో చేయడానికి రెడీ. హీరోని దృష్టిలో పెట్టుకుని కథలు రాయను. కథ రాశాకే హీరో ఎవరని ఆలోచిస్తా. -
మహేశ్ ఇంప్రెస్ అయ్యాడు – మంజుల
‘‘నేను డైరెక్షన్ చేస్తున్నానంటే మహేశ్ నమ్మలేదు. టీజర్స్, సాంగ్స్ చూసి షాక్ అయ్యాడు. వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఈ సినిమా చూసి ఇంప్రెస్ అయ్యాడు’’ అన్నారు మంజుల. సందీప్ కిషన్, అమైరా దస్తూర్, త్రిదా చౌదరి హీరో హీరోయిన్లుగా మంజుల ఘట్టమనేని దర్శకత్వం వహించిన సినిమా ‘మనసుకు నచ్చింది’. పి.కిరణ్, సంజయ్ స్వరూప్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా మంజుల మాట్లాడుతూ–‘‘ఏదో ఓ సినిమా డైరెక్ట్ చేయాలని ఈ సినిమా డైరెక్ట్ చేయలేదు. మంచి విషయం ఉండబట్టే చేశాను. బేసిక్‌గా నేను రొమాంటిక్ పర్సన్‌ను. అందుకే ఓ స్వీట్ లవ్‌స్టోరీ రాసుకున్నాను. ఈ సినిమా చూసి కెమెరామేన్ ఛోటాగారు బెస్ట్ లవ్ స్టోరీ అన్నారు. కథను ముందు కిరణ్‌గారికి చెప్పాను. ఆయనకు బాగా నచ్చింది. ఆ సాయంత్రమే సాయిమాధవ్ బుర్రాకి చెప్పాను. ఆయనకూ బాగా నచ్చింది. ఈ సినిమాలో మా ఆయన (సంజయ్) స్పెషల్ రోల్ చేశారు. ఆయన లక్కీ యాక్టర్. ఆయన చేసిన సినిమాలన్నీ హిట్టయ్యాయి. మా అమ్మాయి కూడా మంచి రోల్ ప్లే చేసింది. సందీప్, అమైరా బాగా చేశారు. నా దగ్గర పవన్ కల్యాణ్ కోసం మంచి కథ ఉంది. ఆయనకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఆ ఒక్క సినిమా చేసి రాజకీయాల్లోకి వెళ్లొచ్చు’’ అన్నారు.‘‘ప్రతి ఒక్కరి లైఫ్‌లో జరిగిన కొన్ని సంఘటనలను గుర్తు చేసే అందమైన చిత్రం. ఇందులో ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయని ఒక ఇంట్రస్టింగ్ మెసేజ్ ఉంటుంది. ఇది ఏ జానర్ సినిమా అని ఒక ఫ్రెండ్ అడిగాడు. ఏం చెప్పాలో అర్థం కాలేదు. కానీ ఒక మంచి కాఫీలాంటి సినిమా అవుతుంది అనిపించింది. నా కెరీర్లో గుర్తుండిపోయే చిత్రం అవుతుంది’’ అన్నారు సందీప్ కిషన్. ‘‘మంజుల కథ చెప్పగానే నాకు బాగా నచ్చింది. బేసిక్‌గా నాకు లవ్‌స్టోరీస్ అంటే చాలా ఇష్టం. అందరికీ నచ్చుతుందని ఈ సినిమా తీశాం. ఫిబ్రవరి 16న విడుదల చేస్తున్నాం’’ అన్నారు పి.కిరణ్. ‘‘ప్రేక్షకులందరికీ నచ్చే కథ. అందరికీ నచ్చే డైలాగ్స్ రాశాను. మంజులగారు క్లారిటీతో, మనసుకు హత్తుకునేలా రాయించుకున్నారు’’ అన్నారు బుర్రా సాయిమాధవ్. ‘‘సినిమా చూశాం. చాలా హ్యాపీగా ఉన్నాం. అందరికీ నచ్చేలా ఓ మంచి సినిమా తీసిన మంజులకు నా కంగ్రాట్స్. కిరణ్‌గారు లేకపోతే ఈ సినిమా లేదు’’ అన్నారు సంజయ్ స్వరూ‹ప్. ఈ సినిమాకు సంగీతం: రధన్, కెమెరా: రవి యాదవ్, మాటలు: సాయి మాధవ్ బుర్రా. -
రెండేళ్లలో తెలుగు డబ్బింగ్ చెబుతా
‘‘నా పాత్ర పేరు నిత్య. యోగా టీచర్ని. మంజులగారు నన్ను ఆడిషన్ ద్వారా ఎంపిక చేశారు. పైగా నిత్య పాత్ర నా వ్యక్తిత్వానికి దగ్గరగా ఉంటుంది. అందుకే నటించేందుకు ఒప్పుకున్నా’’ అని కథానాయిక అమైరా దస్తూర్ అన్నారు. సందీప్‌కిషన్, అమైరా దస్తూర్ జంటగా మంజుల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మనసుకు నచ్చింది’. పి.కిరణ్, సంజయ్ స్వరూప్ నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 16న విడుదల కానుంది. ఈ సందర్భంగా అమైరా పలు విశేషాలు పంచుకున్నారు. ► బీకామ్ చదివిన నేను మోడల్‌గా చేశా. ‘ఇస్సక్’ అనే హిందీ చిత్రం ద్వారా తొలిసారి కెమెరా ముందుకొచ్చా. జాకీచాన్ ‘కుంగ్ ఫు యోగా’, ఇమ్రాన్ హష్మి ‘మిస్టర్ ఎక్స్’, ధనుష్ ‘అనేగన్’(తెలుగులో అనేకుడు) తదితర సినిమాల్లో నటించా. తెలుగులో ‘మనసుకు నచ్చింది’ నా తొలి సినిమా. ► అందం, అభినయానికి ప్రాధాన్యం ఇస్తా. ఈ సినిమాలో అలాంటి పాత్రే దక్కినందుకు హ్యాపీ. పాటలకు వచ్చి వెళ్లిపోయే పాత్ర కాదు నాది. కథతో పాటు సాగుతుంది. కొద్దిసేపట్లో పెళ్లిచేసుకోబోయే సూరజ్ (సందీప్), నిత్య ఎందుకు పారిపోయారు? ఆ తర్వాత ఎటువంటి పరిణామాలు చోటుచేసుకున్నాయన్నదే ఆసక్తికరం. ► మంజులగారు ఈ సినిమాని బాగా తెరకెక్కించారు. సందీప్ కిషన్ మంచి సహనటుడు. సెట్లో ఎంతో హెల్ప్ చేశాడు. తెలుగు రాకపోవడంతో ఇబ్బందులు పడ్డా. ఇప్పుడు నేర్చుకుంటున్నా. రెండేళ్లలో నా పాత్రకి నేనే డబ్బింగ్ చెప్పుకుంటాను. ► రాజ్‌తరుణ్‌తో ‘రాజుగాడు’ చిత్రంలోనూ నటిస్తున్నా. బాలీవుడ్‌తో పాటు దక్షిణాదిలోని అన్ని భాషా చిత్రాల్లో నటించా లని ఉంది. -
మంచి ఫీల్
సూపర్‌స్టార్ కృష్ణ తనయ మంజుల ఘట్టమనేని దర్శకురాలిగా పరిచయమవుతోన్న చిత్రం ‘మనసుకు నచ్చింది’. సందీప్ కిషన్ హీరోగా, అమైరా దస్తూర్, త్రిదా చౌదరి హీరోయిన్లుగా మంజుల దర్శకత్వంలో ఆనంది ఆర్ట్ క్రియేషన్స్–ఇందిరా ప్రొడక్షన్స్ పతాకాలపై సంజయ్ స్వరూప్–పి.కిరణ్ నిర్మించారు. ఇటీవల సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమాని ఫిబ్రవరి 16న విడుదల చేస్తున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ –‘‘ఫ్రెష్, రొమాంటిక్ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రమిది. డైరెక్టర్‌గా మంజులకు తొలి చిత్రమైనా అనుభవం ఉన్నవారిలా చక్కగా తెరకెక్కించారు. ఒక మంచి సినిమా చూశామనే భావన ప్రేక్షకులకు కలిగించేలా ఉంటుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. రధన్ మ్యూజిక్ సినిమాకి బిగ్గెస్ట్ ఎస్సెట్‌గా నిలుస్తుంది’’ అన్నారు. ప్రియదర్శి, పునర్నవి భూపాలం, నాజర్, అరుణ్ ఆదిత్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: రవి యాదవ్, మాటలు: సాయిమాధవ్ బుర్రా. -
తెలుగులో ఇంకొకటి!
జాకీచాన్ హీరోగా నటించిన ఇండో–చైనీస్ సిన్మా ‘కుంగ్ ఫు యోగా’తో హిందీ హీరోయిన్ అమైరా దస్తూర్‌కు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు దక్కింది. పాపులారిటీ పెరిగిన తర్వాత కొందరు రీజనల్ సినిమాలను చిన్న చూపు చూస్తారు. అమైరా అలా కాదు. ఓ పక్క హిందీలో ఛాన్సుల కోసం ప్రయత్నిస్తూనే, మరో పక్క తెలుగు సినిమాలకు సంతకం చేస్తున్నారు. మహేశ్‌బాబు సోదరి మంజుల దర్శకత్వంలో సందీప్‌కిషన్ హీరోగా రూపొందుతోన్న సినిమాలో ఓ కథానాయికగా నటిస్తున్న అమైరా, సుధీర్‌బాబు హీరోగా చేయనున్న కొత్త సినిమాకు సంతకం చేశారట! ‘దిక్కులు చూడకు రామయ్యా’ ఫేమ్ త్రికోటి ఈ చిత్రానికి దర్శకుడు. ప్రస్తుతం ‘శమంతక మణి’, ‘వీరభోగ వసంతరాయులు’ వంటి మల్టీస్టారర్స్ చేస్తున్న సుధీర్‌బాబు, ‘భలే మంచి రోజు’ తర్వాత సోలో హీరోగా నటించనున్న చిత్రమిది..