తొలి తెలుగు బాలల సినిమా సతీ అనసూయ (1936) | First Telugu Children's film Sati Anasuya | Sakshi
Sakshi News home page

తొలి తెలుగు బాలల సినిమా సతీ అనసూయ (1936)

Published Fri, Nov 15 2013 1:15 AM | Last Updated on Sat, Sep 2 2017 12:36 AM

First Telugu Children's film Sati Anasuya

 చిన్న పిల్లలతో కలిసి సినిమా చూడడమే కష్టమనుకుంటాం. అలాంటిది కేవలం చిన్న పిల్లలతోనే సినిమా తీయడం అంటే ఇంకెంత కష్టం! దానికన్నా సముద్రంలో ఈత కొట్టడమే సులువేమో. కానీ... అందులో ఉండే మజానే వేరు. ఎప్పుడో 77 ఏళ్ల క్రితం తెలుగు తెరపై ఇలాంటి ప్రయోగం చేశారు చిత్తజల్లు పుల్లయ్య. అదే ‘సతీ అనసూయ’. 18వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవం హైదరాబాద్‌లో జరుగుతున్న సందర్భంగా ఓసారి ‘సతీ అనసూయ’ను స్మరించుకోవడం మన కర్తవ్యం. ఆ సినిమా తాలూకు నేపథ్యం, నాటి జ్ఞాపకాల్లోకి వెళితే...
 
 చిత్తజల్లు పుల్లయ్య అంటే మూకీల కాలం నుంచి ఉన్న వ్యక్తి. బొంబాయి, మద్రాసుల్లో హేమాహేమీల దగ్గర పని చేసి సినిమా మేకింగ్‌ని ఔపోసన పట్టిన ప్రతిభాశాలి. తెలుగు నాట సినిమా థియేటర్ల నిర్మాణం విషయంలో ఓ ఉద్యమం తీసుకొచ్చాడు. ఆయన వల్లనే తెలుగు నేలపై చాలా టూరింగ్ టాకీసులు వెలిశాయి. కలకత్తాకు చెందిన ఈస్టు ఇండియా ఫిలిం కంపెనీవారు టాకీల నిర్మాణం ప్రారంభించి సి.పుల్లయ్యను సంప్రదించారు. అలా ఆయన దర్శకత్వంలో ‘సతీ సావిత్రి’ (1932), ‘లవకుశ’ (1934) చిత్రాలు వచ్చాయి. రెండూ సూపర్‌హిట్లే. దాంతో ఆయనకు డెరైక్టర్‌గా ప్రేక్షకుల్లో ఓ ఇమేజ్ వచ్చేసింది. ఇప్పుడాయన దగ్గర రెండు స్క్రిప్టులు సిద్ధంగా ఉన్నాయి. ‘ధ్రువ విజయము’, ‘సతీ అనసూయ’. అయితే ‘సతీ అనసూయ’ను అంతా చిన్నపిల్లలతో చేస్తే బావుంటుందేమోనన్న ఆలోచన సి.పుల్లయ్యకు వచ్చింది. 
 
 అప్పటికి అలాంటి ప్రయోగం ఎవ్వరూ చేయలేదు. దాదాపు 60 మంది పిల్లలు కావాలి. ఎంపిక ప్రక్రియే చాలా కష్టం. అయినా కూడా ఎన్నో ఊళ్లు తిరిగి మరీ మెరికల్లాంటి పిల్లలను ఎంపిక చేశారు. అప్పుడాయన దగ్గర రేలంగి వెంకట్రామయ్య ప్రొడక్షన్ మేనేజర్. అప్పటికాయన నటుడు కాలేదు. రాజమండ్రిలో ‘తులాభారం’ నాటకం చూసి, అందులో నటించిన ఓ అమ్మాయిని సి.పుల్లయ్యకు పరిచయం చేశారు రేలంగి. పేరు కృష్ణవేణి. బాగా చలాకీగా ఉన్న ఆ అమ్మాయిని టైటిల్ రోల్‌కి ఎంచుకున్నారు. హీరో పాత్రకు జీఎన్ స్వామి అనే కుర్రాణ్ణి ఎంపిక చేశారు. గంగ పాత్రకు రావు బాలసరస్వతి, నారదుడి పాత్రకు సూర్యనారాయణ, కౌశికుడి పాత్రకు సుందరమ్మ తదితరుల్ని తీసుకున్నారు. సి.పుల్లయ్య కొడుకు సి.ఎస్.రావు దేవేంద్రుడి పాత్రకు ఎంపికయ్యాడు. వీళ్లందర్నీ కలకత్తా తీసుకువెళ్లారు. షూటింగంతా అక్కడే. ఓ పెద్ద ఇల్లు తీసుకుని పిల్లలందర్నీ అక్కడే ఉంచారు. 
 
షూటింగ్ వల్ల వాళ్ల చదువుకి ఇబ్బంది కలగకూడదని ఓ మాస్టార్ని కూడా ఏర్పాటు చేశారు. ఇక షూటింగ్ లేని సమయాల్లో కళాదర్శకుడు అడవి బాపిరాజు పిల్లలందర్నీ ఒక చోట కూర్చోబెట్టి కథలు చెప్పేవారు. రేలంగి అప్పుడప్పుడూ పిల్లలందర్నీ జంతు ప్రదర్శనశాల, ఇతర ప్రాంతాలకు తీసుకువెళ్లేవారు.షూటింగ్ అంతా పూర్తయ్యాక నిడివి చూస్తే చాలా తక్కువగా అనిపించింది. అటువైపు అంతా పెద్ద తారలతో తీసిన ‘ధ్రువ విజయము’కూ నిడివి సమస్య వచ్చింది. దాంతో రెండు చిత్రాలనూ కలిపి ఒకే టికెట్‌కు ప్రదర్శించాలని నిర్ణయించారు. అప్పట్లో టికెట్ వెల బేడ (రెండణాలు). ఇలా రెండు చిత్రాల్ని కలిపి ఒకే ప్రదర్శనలో చూపడం ఇదే ప్రథమం. 1936 మే 8న ఈ చిత్రాలు విడుదలయ్యాయి.
 
అసలు చిన్నపిల్లలతో పౌరాణికం తీయడమే ఓ సాహసమైతే, ప్రజల మెప్పు పొందడం స్ఫూర్తిదాయకమని ఆనాటి మేథావులంతా సి.పుల్లయ్యను మెచ్చుకున్నారు.ఇందులో మొత్తం 29 పాటలు, పద్యాలు ఉన్నాయి. ప్రభల సత్యనారాయణ సంగీత దర్శకత్వం చేశారు. అన్నమాచార్య కీర్తన ‘జో అచ్యుతానంద జోజో ముకుంద’ను ఈ సినిమాలో ఉపయోగించారు. ఇలా అన్నమాచార్య కీర్తనను సినిమాలో ఉపయోగించడం ఇదే తొలిసారి. అలాగే సినిమా పాటలు, పద్యాలు, సంభాషణలు ఒక రికార్డు రూపంలో రావడమన్నది ఈ సినిమాతోనే మొదలైంది. కాకినాడకు చెందిన సన్ రికార్డింగ్ కంపెనీ ఈ రికార్డులు విడుదల చేసింది. ఈ సినిమాలో నటించిన కృష్ణవేణి, రావు బాలసరస్వతి ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఉన్నారు. రావు బాలసరస్వతి తొలితరం నేపథ్య గాయనిగా కీర్తి గడించారు. ఇక సి.కృష్ణవేణి నటిగా, నిర్మాతగా లబ్దప్రతిష్టురాలు అనిపించుకున్నారు. మహానటుడు ఎన్టీఆర్‌ను ‘మనదేశం’తో పరిచయం చేసిన ఘనత కృష్ణవేణిదే.
 
‘‘మాది పశ్చిమ గోదావరి జిల్లా పంగిడి. 1924 డిసెంబర్ 24న పుట్టాను. మా నాన్నగారు యర్రంశెట్టి లక్ష్మణరావు డాక్టరు. చిన్నప్పుడే స్కూల్‌లో ప్రహ్లాద, ధ్రువ వంటి పాత్రలు చేశాను. బాలనటిగా ‘సతీ అనసూయ’ నాకు తొలి సినిమా. నాతో పాటు చాలామంది పిల్లలు నటించారు. మా అందరికీ ఏదో పిక్‌నిక్‌కు వెళ్లిన ఫీలింగే ఉండేది. ఈ సినిమాకు నాకు వెయ్యి రూపాయలు పారితోషికం ఇచ్చారు. ఈ సినిమా తర్వాత బాలనటిగా ‘తుకారాం’ (1937), ‘మోహిని రుక్మాంగద’ చేశాను. ‘సతీ అనసూయ’ విడుదలై అప్పుడే 77 ఏళ్లయ్యిందా అనిపిస్తోంది.  
 - సి.కృష్ణవేణి
 
 
‘‘నేను పుట్టింది 1928లో. 1934లోనే హెచ్.ఎం.వి. సంస్థకు సోలో రికార్డు పాడాను. ఆ రికార్డు విని సి.పుల్లయ్యగారు మా నాన్నగార్ని సంప్రదించి ఇందులో గంగ వేషం ఇచ్చారు. ఆ వయసులో నాకు సినిమా అంటే తెలీదు. షూటింగ్ అంటే తెలీదు. ఏదో సెలవుల్లో ఆడుకోవడానికి కలకత్తా వెళ్లినట్టుగా అనిపించిందంతే. ఈ సినిమా షూటింగ్‌లో జరిగిన రెండు సంఘటనలు నాకిప్పటికీ గుర్తున్నాయి. జనుల పాపాల వల్ల గంగ కలుషితమైపోయినట్టుగా సీన్ తీస్తున్నారు. దాని కోసం నాకు నల్ల డ్రెస్ వేసి, జుట్టు విరబోసుకుని పరిగెత్తమన్నారు. నా వెనుక జనుల పాపాలు పిశాచాల రూపంలో వెంటబడుతుంటాయన్న మాట. ఆ పిశాచాలుగా నటించింది నారదుడు, కౌశికుడు వేషాలేసిన కుర్రాళ్లే. వాళ్లకు వళ్లంతా నలుపు రంగు పూసేశారు. 
 
 నేను మధ్యలో గుర్తుపట్టేసి నువ్వు నారాయణవి కదా అని అడిగేశాను. దాంతో తబలిస్ట్ పరదేశి బెత్తంతో నన్ను భయపెట్టి ‘‘అలా పేర్లు చెప్పకూడదు. వాళ్లంతా పిశాచాలు, నువ్వు భయపడాలంతే’’ అని చెప్పారు. అలా పరిగెడుతూనే ‘ఏది దారి నాకిచట’ అనే పాట పాడాలి నేను. ట్రాలీలో కెమెరాతో పాటు వయొలినిస్ట్, తబలిస్ట్ కూడా కూర్చున్నారు. వాళ్లు అవి ప్లే చేస్తుంటే, నేను పరిగెడుతూనే పాట పాడేశాను. నిజంగా చాలా కష్టం అది. అయినా నేను అవలీలగానే పాడేశాను. ఇక రెండో సంఘటన ఏంటంటే - సతీ అనసూయ దగ్గరకు గంగ వెళ్లి వరం కోరుకోమంటుంది. ఆశ్రమంలో నది పారేలా చేయమని అనసూయ కోరుతుంది. ఆ సీన్ ఎలా తీశారంటే - ఒక కాలువలా గొయ్యి తవ్వారు.
 
మధ్యలో రాయి మీద నన్ను నిలబెట్టారు. నేను వరం ఇవ్వగానే అటు నుంచీ ఇటు నుంచీ డ్రమ్ములతో నీళ్లు వదిలేశారు. దీనికి రిహార్సల్ ఏమీ లేదు. డెరైక్ట్‌గా షాట్. డ్రమ్ములతో నీళ్లు వదిలిన ఫోర్స్‌కి నేను వెనక్కి పడిపోయి నీళ్లల్లో కొట్టుకుపోయా. ఆ సినిమాకు అసిస్టెంట్ డెరైక్టర్‌గా పనిచేసిన ఓ బెంగాలీ అతను వెంటనే నన్ను పట్టుకున్నాడు. నా అభిమాన గాయకుడు కె.ఎల్.సైగల్‌ని ఈ షూటింగ్ సమయంలోనే కలవగలిగాను. ఈ సినిమాకు నాకు 250 రూపాయలు పారితోషికం ఇచ్చారు.       
 - రావు బాలసరస్వతి
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement