
ముగ్గురు హీరోలు... ముగ్గురు హీరోయిన్లు... ఛలో అమెరికా
ప్రేమంటే ఇద్దరి వ్యక్తుల హృదయానుబంధం.. స్నేహమంటే ఇష్టకష్టాలు పంచుకోవడం... ఆనందమంటే పది మందితో సంతోషాలను పంచుకోవడం. స్నేహం, ప్రేమ, భావోద్వేగాల పరిచయంతోనే ప్రతి వ్యక్తీ జీవిత ప్రయాణం చేస్తారు. ఇప్పుడీ మూడు అంశాలు మేళవించి రచయిత గోపీమోహన్ ఓ కథ రాశారు. దీని ప్రత్యేకత ఏంటంటే... ఈ కథతోనే ఆయన మెగాఫోన్ పట్టనున్నారు. టైటిల్ ‘ఇష్టంగా సంతోషంగా ఆనందంగా’. ఈ చిత్రం ద్వారా దర్శకునిగా మారుతున్నట్టు గోపీమోహన్ ఏడాది క్రితమే ప్రకటించారు. అయితే స్క్రిప్ట్ వర్క్ మాత్రం ఇప్పుడు పూర్తయింది. పలు కమర్షియల్ చిత్రాలకు కథలు అందించిన మీకు ఈ కథ రాయడానికి ఏడాది ఎందుకు పట్టింది? అని గోపీమోహన్‌ని ‘సాక్షి’ అడిగితే.. ‘‘రచయితగా పనిచేసినప్పుడు దర్శకుల అభిరుచికి తగ్గట్టు రాయడం జరుగుతుంది.
అదే ఓ రచయిత.. దర్శకునిగా మారుతున్నాడంటే ప్రేక్షకులు అతడి నుంచి కొత్తదనం ఆశిస్తారు. అందులోనూ సున్నితమైన భావోద్వేగాలు గల చిత్రమిది. స్క్రీన్‌ప్లే కొత్తగా ఉంటుంది. అందుకే కొంచెం టైమ్ పట్టింది. అమెరికా నేపథ్యంలో కథ సాగుతుంది. ఇందులో ముగ్గురు హీరోలు, ముగ్గురు హీరోయిన్లు నటిస్తారు’’ అని చెప్పారు. ఈ వారంలో టాలీవుడ్ యువ హీరోలను కలసి గోపీమోహన్ కథ చెప్పనున్నట్లు వినికిడి.