ఆ హీరోయిన్‌కు ఏమైంది..
సిమ్రాన్.. ఈ పేరు 2009 వరకూ దక్షిణాది సినీ ఇండస్ట్రీలో మారుమోగిందనే చెప్పాలి. మోడలింగ్ రంగం నుంచి వచ్చిన ఈ ముంబై బ్యూటీ మొదట్లో బాలీవుడ్‌లో ఒకటి రెండు చిత్రాలు చేసి ఆ తరువాత దక్షిణాదికి దిగుమతి అయింది. ఇక్కడ తొలి రోజుల్లో ఈత దుస్తులతో సహా అందాలతో సిమ్రాన్ ఆ తరువాత నటనకు అవకాశం ఉన్న పాత్రల్లోనూ తన సత్తా చాటుకున్నారు. అలా దాదాపు దశాబ్దంన్నరపాటు తమిళ, తెలుగు భాషల్లో టాప్ కథానాయకిగా రాణించారు.
మంచి ఫామ్‌లో ఉండగానే పెళ్లి చేసుకుని నటనకు దూరం అయ్యారు. అయితే చాలామంది హీరోయిన్ల తరహాలోనే రీఎంట్రీకి సై అన్న సిమ్రాన్‌ను మంచి వెయిట్ ఉన్న పాత్రల్లో చూడబోతున్నామని అభిమానులు సహా సినీ వర్గాలు భావించాయి. అయితే అలా జరగలేదు. నిజం చెప్పాలంటే రీఎంట్రీ అయిన హీరోయిన్లలో చాలా తక్కువమందే మళ్లీ హీరోయిన్‌గా నటించడం సాధ్యమైంది. ఎక్కువమంది అక్కగానో, వదినగానో, మరో బలమైన పాత్రల్లోనో నటిస్తున్నారు. సిమ్రాన్‌కు ఈ రెండు రకాలుగానూ అవకాశాలు రాకపోవడం చర్చనీయాంశం.
ఏమాత్రం ప్రాధాన్యత కాదు కథా, గుర్తింపు లేని పాత్రల్లో నటిస్తుండడంతో అసలు ఆమెకు ఏమైంది అన్న సందేహం కలుగుతోంది. ఆ మధ్య పార్థిబన్ నటించి దర్శకత్వం వహించిన కోడిట్ట ఇడంగళ్ నిరప్పుగా చిత్రంలో కేవలం రెండు మూడు సీన్స్‌లో కనిపించి మాయమయ్యారు. తాజాగా విశాల్ హీరోగా నటించిన తుప్పరివాలన్ చిత్రంలో అయితే ఒక సహాయ నటి తరహాలో రెండే రెండు సన్నివేశాల్లో అదీ ఏమాత్రం నటనకు అవకాశం లేని పాత్రలో కనిపించారు. అసలు అలాంటి పాత్రల్లో నటించడానికి సిమ్రాన్ ఎందుకు అంగీకరిస్తున్నారు?
దర్శకనిర్మాతలు అలాంటి పాత్రలకు ఆమెను ఎందుకు ఎంపిక చేస్తున్నారన్నది ఎవరికీ అర్థం కాని ప్రశ్నగా మారింది. ఆ మధ్య కొన్ని సీరియళ్లలో నటించి బుల్లి తెరపైనా మెరిసిన సిమ్రాన్ వాటిపైనే దృష్టి సారించినా బాగుండేదంటున్నాయి సినీ వర్గాలు. సిమ్రాన్ కంటే ముందు కథానాయికలుగా రాణించిన రాధిక, కుష్బూ, భానుప్రియ వంటి వారు చిత్రాల్లో తమ పాత్రలకు ప్రాధాన్యత ఉంటేనే అంగీకరించి నటిస్తున్నారన్నది గమనార్హం.