హాలీ... జాలీ... సమ్మర్ | hollywood movies in summer holidays special story | Sakshi
Sakshi News home page

హాలీ... జాలీ... సమ్మర్

Published Tue, Mar 22 2016 12:40 AM | Last Updated on Sun, Sep 3 2017 8:16 PM

హాలీ... జాలీ... సమ్మర్

హాలీ... జాలీ... సమ్మర్

వేసవిలో సందడి చేయడానికి హాలీవుడ్ సూపర్‌హీరోలు సిద్ధమైపోయారు. బ్యాట్‌మ్యాన్, సూపర్‌మ్యాన్ లతో పాటు సూపర్‌హీరోలు ఐరన్‌మ్యాన్, కెప్టెన్ అమెరికా తమ పోరాటాలతో వెండితెరపై సరికొత్త అనుభూతిని అందించడానికి సై అంటున్నారు. ఈ ఫిక్షన్ చిత్రాలతో పాటు ఓ నిజజీవిత కథ కూడా ఈ వేసవికి తెరపై రానుంది. మరి ఈ వేసవిలో విడుదలయ్యే  హాలీవుడ్ చిత్రాల విశేషాలు....

బ్యాట్‌మ్యాన్, సూపర్‌మ్యాన్ తలపడితే: మూడేళ్ల క్రితం వచ్చిన ‘మ్యాన్ ఆఫ్ స్టీల్’ కథలో ప్రపంచాన్ని కాపాడిన సూపర్‌మ్యాన్ అందరికీ ఆరాధ్య దైవం అయిపోతాడు. కానీ కాలక్రమంలో సూపర్‌మ్యాన్ ప్రవర్తనలో అనూహ్యమైన మార్పు వస్తుంది. సూపర్‌మ్యాన్ వైఖరి నచ్చక, అతనితో పోరాటానికి బ్యాట్‌మ్యాన్ సిద్ధమవుతాడు. ఈ ఇద్దరి మధ్య యుద్ధం జరుగుతున్న తరుణంలో మానవ జాతిని అంతం చేయడానికి ఒక రాక్షసుడు ఎంటర్ అవుతాడు. అతనిపై పోరాటానికి వీరిద్దరితో పాటు మరో సూపర్‌ఉమన్ ‘వండర్ ఉమన్’ తోడవుతుంది. వీళ్ళంతా కలసి ప్రపంచాన్ని ఎలా కాపాడారనే ఇతివృత్తంతో తెరకెక్కిన సీక్వెల్ ‘బ్యాట్‌మ్యాన్ వర్సెస్ సూపర్‌మ్యాన్’. గతంలో ‘300’, ‘మ్యాన్ ఆఫ్ స్టీల్’ చిత్రాల ద్వారా ప్రసిద్ధికెక్కిన జాక్ స్నైడర్ ఈ చిత్రానికి దర్శకుడు. హాలీవుడ్ నటుడు బెన్ ఎఫ్లిక్ బ్యాట్‌మ్యాన్‌గా నటిస్తుంటే, ‘మ్యాన్ ఆఫ్ స్టీల్’తో సూపర్‌మ్యాన్‌గా ఎంట్రీ ఇచ్చిన హెన్రీ క్యావిల్ ఈ చిత్రంలో కూడా అదే పాత్ర పోషించనున్నారు. విడుదల:  మార్చి 25

 ఆమె కూతురి కథ: 14 ఏళ్ల క్రితం ఏ మాత్రం స్టార్ వాల్యూ లేకుండా చిన్న సినిమాగా విడుదలై ఘన విజయం సాధించిన చిత్రం - ‘మై బిగ్ ఫ్యాట్ గ్రీక్ వెడ్డింగ్’. దాదాపు రూ. 33 కోట్లతో రూపొందిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 2400 కోట్లకు పైగా వసూలు చేసి బాక్సాఫీస్ దగ్గర కనకవర్షం కురిపించింది. ఇప్పుడీ చిత్రానికి సీక్వెల్‌గా ‘మై బిగ్ ఫ్యాట్ గ్రీక్ వెడ్డింగ్-2’ ఈ సమ్మర్‌కి రానుంది. నవ్వులు పంచడానికి సిద్ధమవుతోంది. మొదటి భాగంలో గ్రీక్ కుటుంబానికి చెందిన కథానాయిక తన దేశస్థుడిని కాకుండా ఓ అమెరికన్‌ను ప్రేమిస్తుంది. ఇంట్లో వాళ్లకు ఇష్టం లేకపోయినా ఆ  ప్రేమను పెళ్లి వరకూ ఎలా తీసుకెళ్లిందనేదే ఈ చిత్ర కథాంశం. ఇప్పుడీ సీక్వెల్‌లో కథానాయిక కూతురు ఎవరిని ప్రేమించి, పెళ్లి చేసుకుందనేది ఈ చిత్రంలో చూపించనున్నారు. పైగా కథానాయిక కుటుంబం వెనుక దాగి ఉన్న ఓ రహస్యం ఇతివృత్తంగా ఈ సినిమా సాగనుంది. మొదటి భాగానికి కథ-స్క్రీన్‌ప్లే అందించిన కథానాయిక నియో వర్డోలాస్ ఈ చిత్రానికి కూడా కథను అందించడం విశేషం. దాదాపు ప్రీక్వెల్‌లో కనిపించిన నటీనటులే సీక్వెల్‌లో కూడా కనిపించనున్నారు. విడుదల :మార్చి 25

 మోగ్లీ సాహసాలు: మోగ్లీ, బాలూ....ఇలాంటి పాత్ర లు వింటే జంగిల్ బుక్ ఠక్కున గుర్తొస్తుంది. దూరదర్శన్ ఏలుతున్న రోజుల్లో ఈ యానిమేషన్ సీరియల్ ఓ సంచలనం. అప్పట్లో చాలా మంది పిల్లలకు ఎంతో ఇష్టమైన కార్టూన్ సీరియల్. ఇప్పుడు అదే సినిమా రూపంగా రానుంది. అడ విలో ఓ పిల్లాడు తప్పిపోతాడు. ఎలుగుబంటి, చిరుతపులి, గొర్రిల్లా - ఇంకా మిగతా జంతువులు అతణ్ణి పెంచుతాయి. మరి తర్వాత ఆ పిల్లాడి జీవితంలో జరిగిన సంఘటనలే ఈ చిత్రం. భారత సంతతికి చెందిన పదేళ్ళ నీల్ సేథీ ఈ చిత్రంలో మోగ్లీగా కనిపించనున్నారు.  ఇందులో మోగ్లీ పాత్ర తప్ప అన్నీ యానిమేషన్‌లోనే రూపొందించారు దర్శకుడు జాన్ ఫెవ్రూ. ప్రముఖ హాలీవుడ్ తారలు బిల్ ముర్రే, బెన్ కింగ్‌స్లే, స్కార్లట్ జొహాన్సెన్, ఫ్రిదా పింటో వంటివారు ఇందులోని యానిమేషన్ పాత్రలకు గాత్రం అందించారు. ఇక ఈ చిత్రం హిందీ వెర్షన్‌కు ప్రియాంకా చోప్రా, ఇర్ఫాన్‌ఖాన్, నానా పటేకర్, ఓంపురి డబ్బింగ్ చెప్పారు. విడుదల: ఏప్రిల్ 15

 హంట్స్ మ్యాన్: నాలుగేళ్ల క్రితం విడుదలైన ఫ్యాంటసీ- యాక్షన్ థ్రిల్లర్ ‘స్నో వైట్ అండ్ ద హంట్స్ మ్యాన్’. దానికి  సీక్వెల్‌గా ‘హంట్స్ మ్యాన్: ద వింటర్ వార్’ ఇప్పుడు ప్రేక్షకులను మళ్లీ  గ్రాఫిక్స్‌తో కనువిందు చేయడానికి సిద్ధమవుతోంది. ప్రజలను ఇబ్బంది పెట్టే క్వీన్ రవెన్నాను, ఆమె సోదరి ఫ్రేయాలను నాయకా నాయికలు ఎలా ఎదుర్కొన్నారనేదే ఈ చిత్ర కథాంశం. సెడ్రిక్ నికోలాస్-ట్రాయోన్ ఈ చిత్రానికి దర్శకుడు. విడుదల: ఏప్రిల్ 22

 తెరపై రామానుజన్ జీవితం: గణితశాస్త్రంలో కొత్త పుంతలు తొక్కి, ఎన్నో అద్భుత ఆవిష్కరణలకు ఆద్యుడైన భారతీయ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జీవితం ఆధారంగా ఓ హాలీవుడ్ చిత్రం రూపొందింది. 1991లో రాబర్ట్ కనిగల్ రాసిన ‘ద మ్యాన్ హూ న్యూ ఇన్ఫినిటీ’ అనే నవల ఆధారంగా అదే పేరుతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు మాథ్యూ బ్రౌన్. ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ఫేమ్ దేవ్ పటేల్ ఈ చిత్రంలో రామానుజన్ పాత్ర పోషించారు. మొదట రామానుజన్ పాత్రకు సౌతిండియన్ హీరో మాధవన్‌ను అనుకున్నారు. ఆ తర్వాత ఈ చిత్రానికి హాలీవుడ్ స్థాయిలో గుర్తింపు ఉన్న నటుడు కావాలని దేవ్‌పటేల్‌ను ఎంపిక చేసుకుంది చిత్ర బృందం. ఇప్పటికే ఈ చిత్రం టొరంటో, దుబాయ్ చలనచిత్రోత్సవాల్లో ప్రదర్శితమై, విమర్శకుల ప్రశంసలు అందుకుంది.  విడుదల: ఏప్రిల్ 29

 ఈ సారి ఐరన్‌మ్యాన్, స్పైడర్‌మ్యాన్‌లతో: బ్యాట్‌మ్యాన్, సూపర్‌మ్యాన్, స్పైడర్‌మ్యాన్‌ల తర్వాత ఈ జనరేషన్ సూపర్‌హీరోలలో ఐరన్‌మ్యాన్, కెప్టెన్ అమెరికా సూపర్‌హీరో పాత్రలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కెప్టెన్ అమెరికా సూపర్‌హీరో కథతో  2011లో ‘కెప్టెన్ అమెరికా: ద ఫస్ట్ ఎవెంజర్’ వచ్చింది. దానికి సీక్వెల్ ‘కెప్టెన్ అమెరికా: వింటర్ సోల్జర్’ కూడా ఆకట్టుకుంది. ఇప్పుడీ కెప్టెన్ అమెరికాకు మూడో భాగంగా రానున్న ‘సివిల్ వార్’లో ఐరన్‌మ్యాన్ కూడా జతకలిశాడు. వీరిద్దరి సాహసాలతో పాటు స్పైడర్‌మ్యాన్ కూడా ఈ భాగంలోనే సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు. ఎవెంజర్స్‌గా ప్రపంచాన్ని కాపాడే పదిమంది అతీంద్రియ శక్తులున్న సూపర్‌హీరోలు అనుకోని కారణాలతో విడిపోతారు. చివరకు, కెప్టెన్ అమెరికా, ఐరన్‌మ్యాన్‌లు ఒక్కటై  ప్రపంచాన్ని ఎలా కాపాడారనేది కథ. ఆంటోని రుస్సో, జోయ్ రుస్సోల ద్వయం ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.  విడుదల: మే 6

 ఎక్స్‌మెన్ మళ్లీ వస్తున్నారు: 16 ఏళ్లు...ఎనిమిది భాగాలతో ప్రేక్షకులను అలరించిన ఎక్స్‌మెన్ మళ్లీ ‘ఎపోకిలిప్స్’ టైటిల్‌తో సినీ అభిమానులను పలకరించనుంది. ఇటీవలే ఎనిమిదో భాగంగా వచ్చిన ‘డెడ్‌పూల్’ ఘనవిజయం ఇచ్చిన ఉత్సాహంతో ‘ఎపోకిలిప్స్’ను విడుదల చేయనున్నారు. ప్రపంచాన్ని కాపాడడానికి ఎక్స్‌మెన్ టీమ్ ఏం చేసిందనే కథాంశంతో ఈ చిత్రం రూపొందింది. బ్రియాన్ సింగ్ ఈ చిత్రానికి దర్శకుడు.  విడుదల: మే 27

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement