వెనక్కి వెళ్లాలని ఉంది : శిల్పా అగ్నిహోత్రి
వెనక్కి వెళ్లాలని ఉంది : శిల్పా అగ్నిహోత్రి
Published Mon, Oct 21 2013 1:13 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM
ఎంతో ఉత్సాహంగా కలర్స్ చానెల్ ‘బిగ్‌బాస్-సాత్ 7’ షోలో అడుగుపెట్టిన టీవీ నటి శిల్పా అగ్నిహోత్రి మిగతా వారందరికంటే ముందుగానే షో నుంచి బయటికి వచ్చినందుకు బాధపడుతోంది. ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించగల ప్రయత్నాలేవీ చేయకపోవడం వల్లే బయటికి వెళ్లిపోవాల్సి వచ్చిందని చెప్పింది. అయితే షో భాగస్వాములు ఎప్పుడూ పోట్లాడుకోవడం ఇబ్బంది కలిగించినా, అవకాశం దక్కితే మళ్లీ షోలోకి వెళ్లడానికి సిద్ధమేనని చెప్పింది. భర్త అపూర్వ అగ్నిహోత్రితోపాటు ఈ షోలో చేరిన శిల్ప శనివారమే బయటికి వచ్చింది. ‘నేను ఇంత త్వరగా ఇంటికి వెళ్తానని ఎవరూ అనుకోలేదు.
పేక్షకుల్లో ఉత్సాహం కలిగించే పనులేవీ చేయకపోవడం వల్లే ఇలా జరిగి ఉండవచ్చు. కనీసం అపూర్వ కోసమైనా అక్కడ ఉండాలనుంది. ఒక్కదాన్నే ఇంట్లో ఉంటే ఏడుపు వస్తోంది. అపూర్వ అక్కడ ఉన్నంత వరకు షోను క్రమం తప్పకుండా చూస్తా’ అని వివరించినశిల్ప లావణ్య, క్యూంకీ.. సాస్ భీ కభీ బహూ థీ వంటి సీరియల్స్ ద్వారా ప్రేక్షకులకు చేరువయింది. అయితే షోలో పోట్లాటలపై ఈ బ్యూటీ బాధపడింది. అపూర్వ, తనకు పెళ్లై చాలా ఏళ్లవుతున్నా గొడవలు పెట్టుకున్నది చాలా తక్కువ సందర్భాల్లోనేనని చెప్పింది. బిగ్‌బాస్ భవనంలోని వ్యక్తులు మాత్రం గొడవలను చాలా ఇష్టపడుతున్నారని చెప్పింది.
బిగ్‌బాస్ ఇంటిని ‘స్వర్గం’, ‘నరకం’గా విభజించారు. శిల్పకు స్వర్గంలో చోటు దక్కగా, అపూర్వ నరకంలో చిక్కుకున్నాడు. ‘ఇద్దరం వేర్వేరు చోట్ల ఉంటాం కాబట్టి కలుసుకోవడం వీలుకాదనుకున్నాం. కానీ అలాంటిదేమీలేదు. కబర్లు చెప్పుకోవచ్చు. ముద్దాడుకోవచ్చు కూడా. షోలో బాగా ప్రవర్తిస్తే ఇద్దరం కలిసి ఉండే అవకాశం కూడా దక్కేది’ అని వివరించింది. ప్రస్తుతం గౌహర్‌కాన్, కుశాల్ టాండన్, తనీషా ముఖర్జీ, అర్మాన్ కోహ్లీ, ఆసిఫ్ అజీమ్, సంగ్రామ్ సింగ్, ఎల్లీ ఎవ్మ్,ర ప్రత్యూషా బెనర్జీ, వివేక్ మిశ్రా, వీజే ఆండీ, కామ్యా పంజాబీ, అపూర్వ షోలో మిగిలారు.
Advertisement
Advertisement