ప్రపంచ అత్యుత్తమ సంగీత దర్శకుల జాబితాలో ఇళయరాజా
ప్రపంచ అత్యుత్తమ సంగీత దర్శకుల జాబితాలో ఇళయరాజా
Published Tue, Mar 18 2014 12:06 AM | Last Updated on Sat, Sep 2 2017 4:49 AM
ఎన్నియో మారికాన్, మేక్స్ స్టీనర్, జాన్ విలియమ్స్, బెర్నాడ్ హెర్మాన్, నినో రోటా, టోరు టేకిమిత్సు, మైకేల్ లెగ్రాండ్, అలెన్ మెంకెన్... వీళ్లంతా ప్రపంచ ప్రసిద్ధి గాంచిన సంగీత దర్శకులు. ఈ జాబితాలో ఇళయరాజా పేరు కూడా చేరింది. ప్రపంచ సినిమా విశేషాలను అందించే టాప్‌మోస్ట్ వెబ్‌సైట్ ‘టేస్ట్ ఆఫ్ సినిమా’ ప్రపంచ స్థాయిలో పాతికమంది అత్యుత్తమ సంగీత దర్శకుల జాబితాను ఇటీవల రూపొందించింది. ఇందులో తొమ్మిదో స్థానం ఇళయరాజాకు దక్కింది.
మ్యూజిక్ కంపోజర్‌గా, సింగర్‌గా, లిరిక్ రైటర్‌గా భారతీయ సినీ సంగీతంపై ఇళయరాజా ప్రగాఢమైన ముద్ర వేశారని ఆ వెబ్‌సైట్ కొనియాడింది. ఈ జాబితాలో చోటు సంపాదించిన ఏకైక భారతీయ సంగీత దర్శకుడు ఇళయరాజానే కావడం విశేషం. 38 ఏళ్ల క్రితం స్వరకర్తగా తన కెరీర్ ఆరంభించిన ఇళయరాజా నవతరంతో పోటీపడుతూ ఇప్పటికే తన స్వరాలతో శ్రోతల హృదయాలను గెలుచుకుంటున్నారు. తమిళం, తెలుగు, హిందీ, కన్నడం, మలయాళం తదితర భాషల్లో ఇప్పటివరకూ 950 చిత్రాలకు సంగీత దర్శకత్వం చేశారు. ప్రస్తుతం ఆయన తెలుగు, తమిళ, హిందీ భాషల్లో పదికి పైగా చిత్రాలకు స్వరా లందిస్తున్నారు.
Advertisement