సెల్ఫీలతో అందాలతార హల్‌చల్
ముంబై: భారతీయ ఖైదీ సరబ్జీత్‌సింగ్ నిజ జీవితకథతో దర్శకుడు ఒమంగ్‌కుమార్ రూపొందిస్తున్న సరబ్‌జీత్ సినిమా షూటింగ్ కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో బాలీవుడ్ అందాల తార ఐశ్వర్యరాయ్ బీఎస్ఎఫ్ జవాన్లతో సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. అటు తమ అభిమాన నటిని చూసేందుకు ఉత్సాహపడ్డ అభిమానులు సెల్ఫీలతో హల్ చల్ చేశారు. సినిమా షూటింగులో భాగంగా భారత్-పాక్ సరిహద్దు ప్రాంతానికి చిత్రయూనిట్ చేరుకుంది. ఈ క్రమంలో అక్కడకు వెళ్లిన ఐశ్వర్యతో ఆర్మీ జవాన్లు ఫొటోలు దిగారు. ఐశ్వర్యరాయ్ తమను పలకరించి, ఫొటోలు దిగడంపై వారంతా సంతోషం వ్యక్తం చేశారు.
చిత్రంలోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాల చిత్రీకరణ భారత్ -పాక్ సరిహద్దులోని అట్టారిలో జరుగుతోంది. లొకేషన్లలో అభిమానులు ఆమెను చూసేందుకు ఉత్సాహం చూపించారు. కాగా పాకిస్థాన్ లాహోర్ జైల్లో 23 సంవత్సరాల పాటు బందీగా వుండి హత్యకు గురైన భారతీయ ఖైదీ సరబ్జీత్‌సింగ్ నిజ జీవితకథతో దర్శకుడు ఒమంగ్‌కుమార్ (మేరీకోమ్ ఫేమ్) ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో సరబ్జీత్‌సింగ్ పాత్రలో బాలీవుడ్ నటుడు రణదీప్ హూడా నటిస్తున్నారు. చేయని నేరానికి సుదీర్ఘంకాలం పాటు జైల్లో మగ్గిపోయిన తమ్ముడు సరబ్‌జీత్‌ను రక్షించేందుకు పోరాటం చేసిన దల్బీర్ కౌర్ పాత్ర ద్వారా ఐశ్వర్వారాయ్ మరో ప్రధాన భూమికను పోషిస్తున్న సంగతి తెలిసిందే.