లోడుక్కు పాండిగా కరుణాస్
హాస్యనటుడు కరుణాస్ మరోసారి కథానాయకుడిగా తెరపైకి రానున్నారు. హాస్యపాత్రలో తనకంటూ ఒక బాణీని ఏర్పరచుకుని ప్రాచుర్యం పొందిన కరుణాస్ అంబా సముద్రపు అంబాని చిత్రంతో హీరోగా తెరంగేట్రం చేశారు. ఆ తరువాత కథానాయకుడిగా పలు చిత్రాలు చేసినా అవి ఆశించిన విజయాలు సాధించకపోవడంతో హాస్యపాత్రపై దృష్టి సారించిన ఆయన తాజాగా మరోసారి లోడుక్కు పాండిగా హీరోగా రానున్నారు. విశేషం ఏమిటంటే కరుణాస్ నటుడిగా పరిచయమైన నందా చిత్రంలో ఆయన పాత్ర పేరు లోడుక్కు పాండి. ఈ పాత్ర కరుణాస్‌కు చాలామంచి పేరు తెచ్చిపెట్టింది. ఇప్పుడా పేరునే సినిమా టైటిల్‌గా పెట్టుకుని తెరపైకి రానున్నారు. ఎ.విక్టరీ క్రియేషన్స్, జి.పిక్చర్స్ అధినేతలు భరద్వేష్, బి.శ్రీను నిర్మిస్తున్న ఈ చిత్రానికి రజనీస్ దర్శకత్వం వహిస్తున్నారు.
నేహా సక్సేనా కథానాయకిగా పరిచయమవుతున్న ఈ చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ ఇతరులను మోసం చేయడం మరొకరి అవకాశాన్ని అక్రమంగా పొందటంలాంటి జీవితం కంటే సక్రమ మార్గంలో జీవిస్తే విజయాన్ని పొందవచ్చని మోసపూరితంగా చేజిక్కించుకునే విజయం శాశ్వతం కాదని చెప్పే ఇతివృత్తంతో రూపొంది స్తున్న చిత్రం లోడుక్కు పాండి అని వివరించారు. ఈ చక్కని సందేశాన్ని వినోదభరితంగా చెప్పనున్నట్లు చిత్రం కోసం ప్రత్యేకంగా రూ.16 లక్షల వ్యయంతో భారీ సెట్‌ను రూపొందించి చిత్రీకరించినట్లు చెప్పారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తయ్యాయని త్వరలోనే విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు వెల్లడించారు.