నడిగర్ సంఘం పదవికి రాజీనామా చేస్తా..
తమిళసినిమా: దక్షిణ భారత నటీనటుల సంఘం(నడిగర్‌సంఘం) ఉపాధ్యక్ష పదవి నుంచి వైదొలగనున్నట్లు నటుడు, శాసన సభ్యుడు కరుణాస్ వెల్లడించారు. హాస్యనటుడిగా, కథానాయకడిగా ప్రాచుర్యం పొందిన ఈయన ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎంపికైన విషయం తెలిసిందే. అదే విధంగా నడిగర్‌సంఘం ఎన్నికల్లోనూ ఉపాధ్యక్షుడిగా పోటీ చేసి గెలిచారు. ఇప్పుడా పదవి నుంచి వైదొలగనున్నట్లు కరుణాస్ వెల్లడించారు. దీని గురించి ఆయన తె లుపుతూ యుక్త వయసు లోనే తాను నటుడవ్వాలని కలలు కనే వాడినన్నారు.
అది నెరవేరిందని,అయితే రాజకీయవాదినవ్వాలని ఎప్పుడూ అనుకోలేదని అన్నారు. ఆశ పడడం మానవ సహజం అనీ,అయితే అత్యాశ కూడదని అన్నారు.45 చిత్రాలలో నటించానని ముఖ్యమంత్రి కావాలనుకోవడం దురాశే అవుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.రాజకీయాలు అంత సులభం కాదన్నారు. నడిగర్‌సంఘం ఎన్నికల సమయంలో పలు గ్రామాలు తిరిగి నటీనటుల ఆర్థిక పరిస్థితిని తెలుకున్నామన్నారు. అదే విధంగా శాసన సభ ఎన్నికల్లో వేలాది గ్రామాలు తిరిగి ప్రజల స్థితిగతులను అడిగి తెలుసుకున్నానన్నారు.
నడిగర్‌సంఘం సభ్యుల సమస్యలను చాలా వరకూ పరిష్కరించానని, సంఘం భవన నిర్మాణ నిధికి స్టార్స్ క్రికెట్‌ను నిర్వహించినట్లు గుర్తు చేశారు. ఇక ఒక శాసనసభ సభ్యుడిగాప్రజల సమస్యల పరిష్కారానికి కృషిచేయనున్నట్లు తెలిపారు. ఒక నటుడిగా నడిగర్‌సంఘం ఉపాధ్యక్ష పదవి నుంచి త్వరలో వైదొగలనున్నట్లు కరుణాస్ వెల్లడించారు. రాజకీయాలపైనే పూర్తి దృష్టి ఉంచుతానని చెప్పారు.