అభిమానుల గుండెల్లో ఖైదీ | khaidi 150 movie review | Sakshi
Sakshi News home page

అభిమానుల గుండెల్లో ఖైదీ

Published Thu, Jan 12 2017 11:07 PM | Last Updated on Tue, Oct 30 2018 5:58 PM

అభిమానుల గుండెల్లో ఖైదీ - Sakshi

అభిమానుల గుండెల్లో ఖైదీ

రివ్యూ

చిత్రం: ‘ఖైదీ నంబర్‌ 150’
తారాగణం: చిరంజీవి, కాజల్‌ అగర్వాల్
రచన: పరుచూరి బ్రదర్స్,
మాటలు: సాయిమాధవ్‌ బుర్రా, వేమారెడ్డి
సినిమాటోగ్రఫీ: రత్నవేలు, కళ: తోట తరణి
కూర్పు: గౌతంరాజు, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: వాకాడ అప్పారావు
నిర్మాత: రామ్‌చరణ్, స్క్రీన్‌ప్లే: దర్శకత్వం: వి.వి. వినాయక్‌
రిలీజ్‌: జనవరి 11, నిడివి: 147 నిమిషాలు


పెద్ద హీరో... పెద్ద బడ్జెట్‌... చాలా ఏళ్ళ గ్యాప్‌ తర్వాత చేస్తున్న సినిమా... కాబట్టి, పెద్ద పెద్ద అంచనాలు... ఇన్ని ఉన్నప్పుడు కథ ఎంచుకోవడం కొద్దిగా కష్టమే. కానీ, ‘ఖైదీ నంబర్‌ 150’కి చిరంజీవి సరైన కథనే ఎంచుకున్నారు. రెండేళ్ళ పైచిలుకు క్రితం తమిళంలో రిలీజై, రూ. 100 కోట్లు వసూలు చేసిన విజయ్‌ ‘కత్తి’ సినిమాకు ఇది అధికారిక రీమేక్‌. తమిళనాడు, కేరళ లాంటి ప్రాంతాల్లో వస్తున్న శీతల పానీయాల కంపెనీలు, తమ కార్పొరేట్‌ బలం, బలగంతో ఊళ్ళకు ఊళ్ళను ఖాళీ చేయించి, అక్కడి భూగర్భ జలాల్ని వాడుకుంటున్నాయి. ఆ సమకాలీన సామాజిక పరిస్థితిని ప్రస్తావిస్తూ, ఒక సోషల్‌ కామెంట్‌గా ఆ సినిమాను తమిళ దర్శకుడు ఏ.ఆర్‌. మురుగదాస్‌ తీర్చిదిద్దారు. సామాజిక బాధ్యతతో పాటు హిట్‌\ సినిమాకు కావాల్సిన హంగులన్నీ ఉన్నాయి.

కథగా చెప్పాలంటే... కలకత్తాలో జైలులో గడుపుతున్న చిల్లర దొంగ ‘కత్తి శీను’ (చిరంజీవి). అక్కడ పారిపోయిన ఒక కరడుగట్టిన ఖైదీని పోలీసులకు మళ్ళీ అప్పగించడానికి సాయపడతాడు. కానీ, ఆ క్రమంలో తానే తప్పించుకొని, పారిపోతాడు. హైదరాబాద్‌ వచ్చిన శీను, తన మిత్రుడైన మరో దొంగ మల్లి (అలీ)తో కలసి బ్యాంకాక్‌కి వెళ్ళి, పోలీసులకు చిక్కకుండా ఉందామనుకుంటాడు. ఈలోగా దుండగుల తుపాకీ కాల్పులకు గాయపడ్డ ఉద్యమకారుడు శంకర్‌ (రెండో చిరంజీవి)ని చూసి, అచ్చంగా అతను తనలానే ఉండడంతో ఆశ్చర్యపోతాడు. గాయపడ్డ శంకర్‌ను పోలీసులు చూసి, కత్తి శీను అనుకొనేలా చేస్తాడు. తీరా బ్యాంకాక్‌కెళ్ళే లోపల అనుకోకుండా శంకర్‌ స్థానంలోకి తాను వెళతాడు. డబ్బుల కోసమలా చేసినా, అక్కడ శంకర్‌ ఎవరో, అతని పోరేమిటో తెలుసుకుంటాడు.

ఫ్లాష్‌బ్యాక్‌లో నీరూరు గ్రామం... చుట్టుపక్కలి వందల గ్రామాలతో పాటు అక్కడి రైతుల నుంచి భూములు కాజేసేందుకు కార్పొరేట్‌ విలన్‌ అగర్వాల్‌ (నిన్నటి నాయిక అంజలా ఝవేరీ భర్త తరుణ్‌ అరోరా) చేసే కుట్ర... ఆరుగురు రైతుల సామూహిక ఆత్మహత్య... శంకర్‌ పోరాటం అన్నీ తెలుస్తాయి. అక్కడి నుంచి శంకర్‌ రూపంలో కత్తి శీను కార్పొరేట్లపై చేసే పోరాటం, ‘అన్నదాత రైతన్న కన్నా సంచలనాలే వార్తలు’ అనుకొంటున్న మీడియాని మార్చే వైనం, తుదివిజయం– మిగతా కథ.

అలా చేసి ఉంటే? నిజానికి, ఈ చిత్ర కథకు వెన్నెముక ఉద్యమకారుడైన శంకర్‌ పాత్ర. తమిళ మూలంలో కమ్యూనిస్టు సిద్ధాంతవేత్తగా, చెల్లెలితో కమ్యూనిస్టు పుస్తకాలు చదువుతూ కనిపించే ఈ పాత్రను ఆ పద్ధతిలో ట్రీట్‌ చేయడానికి తెలుగులో ఎందుకో వెనుకంజ వేశారు. రైతు పోరాటయోధుడిగా అతని పాత్రను ప్రధానబలంగా పెట్టుకొని, రెండు పాత్రల్నీ బ్యాలెన్స్‌›్డగా నడిపితే, కథ వేరుగా ఉండేది. అయితే, కమ్‌బ్యాక్‌ ఫిల్మ్‌లో కమర్షియల్‌ అంశాలు మిస్‌ కాకూడదనే హీరో, దర్శక, రచయితల విశేష ప్రయత్నంలో రెండు పాత్రల్లో కత్తి శీనుగా చిరంజీవిదే పైచేయి అయింది. రెండు పాత్రల్లో కామెడీ వైపు దృష్టితో కత్తి శీను పాత్ర మాస్‌ను మెప్పిస్తుంది. ‘ప’ పలకలేక, దాని బదులు ‘ఫ’ పలికే వంటవాడి పాత్రలో కనిపించి కాసేపు రఘుబాబు నవ్విస్తారు. అమ్మాయి వేషం సహా, కామెడీ కోసం అలీతో అన్నీ చేయించారు. బ్రహ్మానందం (డాబర్‌మ్యాన్‌)తో చిరంజీవి కామెడీకి కలిసొచ్చేలా, ‘పంచారిష్ట’ అంటూ మద్యపానం సీన్లూ సినిమాలో విరివిగా పెట్టారు. పోసాని, కారుమంచి రఘు, పృథ్వి, జయప్రకాశ్‌రెడ్డి – ఇలా ఒకటి రెండు సీన్లకీ పెద్ద కమెడియన్లూ ఉన్నారు. జడ్జిగా నాగబాబు కనిపిస్తారు.

చిరు విశ్వరూపం: అరవై రెండో ఏట ఉన్న చిరంజీవి డ్యాన్సుల్లో మునుపటి ఎనర్జీ మాటెలా ఉన్నా గ్రేస్, స్టైల్‌ విషయంలో ఏ మాత్రం తేడా లేదు. డ్యాన్సుల్లో తెలుగు తెరపై ఇప్పటికే ఎన్నో ప్రయోగాలు చేసేసిన ఘనత చిరంజీవిది. వాటితో పోలిస్తే ఈసారి చిరంజీవి కొత్త ప్రయోగాలు, స్టెప్పులు చేయకున్నా తేలికైన స్టెప్పుల్నే హుందాగా, హుషారుగా వేయడం కన్నులపండుగ. ‘ఇంద్ర’లోని హిట్‌ వీణ స్టెప్‌ మరోసారి వేయడమే కాక బూటుకు లేసు కట్టుకొనే బిట్‌ లాంటివి ఆకర్షిస్తాయి. ‘అమ్మడు లెట్స్‌ డు కుమ్ముడు’, ‘రత్తాలు రత్తాలు’ (రాయ్‌ లక్ష్మీతో ఐటమ్‌సాంగ్‌) లాంటి మాస్‌ పాటలైనా, ‘యు అండ్‌ మీ’ లాంటి సాఫ్ట్‌ మెలొడీలైనా – అన్నిట్లోనూ చిరు మార్కుకు అభిమానులు ఈలలేస్తారు. నాణేలు ఎగరేసి, లైట్లు ఆర్పుతూ చేసే ‘కాయిన్‌ ఫైట్‌’లో జనానికి క్లారిటీ కొంత తగ్గినా డిజైనింగ్‌ బాగుంది. పంచ్‌ డైలాగ్‌తో ఇంటర్వెల్‌కు దారి తీయడం లాంటి మంచి కమర్షియల్‌ ఫార్ములాలు సరేసరి!

సగటు తెలుగు సినిమాలన్నిటి లానే ఈ సినిమాలోనూ హీరోయిన్‌ (కాజల్‌)ది తెరపై బొమ్మలా అడపాదడపా కనిపిస్తూ, పాటల్లో నర్తిస్తూ పోయే పాత్ర. అయితే, ‘కార్పొరేట్‌’ సామ్రాజ్యపు కూల్‌డ్రింక్‌ కోలా కంపెనీ ఓనరైన విలన్‌ పాత్ర కూడా మామూలుగా సాగిపోవడమే చిత్రం. ఇక, రైతుల సంతకాలతో ఊరి స్థలాల్ని చేజిక్కించుకోవాలన్నది విలన్‌ ఎత్తుగడ కాబట్టి, ఉద్యమకారుడు శంకర్‌ను చంపడానికి కాల్పులు జరిపి, యాక్సిడెంట్లు చేయించడం లాంటివి అసలు ఉద్దేశానికి ఎలా దోహదం చేస్తాయన్న సందేహాలు రావచ్చు. సినిమా క్లైమాక్స్‌కు వచ్చేసరికి, సింపుల్‌గా రెండు, మూడు డైలాగులతో కోర్టు బయటే ముగింపును తేల్చేయడం కాకుండా, కోర్టు సీన్‌ దగ్గర మరికొంత డ్రామా ఉంటే ఎఫెక్ట్‌ పెరిగేదేమో అనిపించవచ్చు. చిరంజీవి చేసిన శంకర్‌ పాత్ర వృద్ధాశ్రమం నడుపుతున్నాడా, ఊరు వాళ్ళందరూ అక్కడే ఉంటున్నారా లాంటి వాటికి స్పష్టత ఆశించకూడదు.

హీరోయిన్‌కు తాత ఉన్నట్టూ, ఆయన వృద్ధాశ్రమంలో ఉన్నట్లూ చూపించడం – ఆ హీరోయిన్‌ను అక్కడ హీరోతో కలపడం కోసమే. ‘కత్తిశీను’ను చంపాలని జైల్లోని కరడుగట్టిన ఖైదీ ప్రయత్నం. చివరకు ఆ పాత్ర ఏమైంది, ‘కత్తి శీను’ను చంపాలన్న అతని పగ ఏమైందన్నది చూపించరు. కానీ, చిరంజీవి సినిమా మాయలో ప్రేక్షకులెవరూ ఇవేవీ పెద్ద పట్టించుకోరు. అన్నిటికీ ‘సర్వలోప నివారిణి’ సినిమా అంతటా చిరంజీవి విశ్వరూపమే! సంగీతం, కళ, సినిమాటోగ్రఫీ, పంచ్‌ డైలాగులు (బుర్రా సాయిమాధవ్, వేమారెడ్డి రాసిన ‘పొగరు నా ఒంట్లో ఉంటది! హీరోయిజమ్‌ నా ఇంట్లో ఉంటది’ లాంటివి) లాంటి శాఖలకు అనుభవజ్ఞులు పనిచేయడం పెద్ద అండ. హీరో రామ్‌చరణ్‌ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తూ ‘అమ్మడు’ పాటలో తండ్రితో డ్యాన్స్‌ చేయడం అదనపు ఆకర్షణ. తొమ్మిదేళ్ళ పైగా గ్యాప్‌ వచ్చిందన్న మాటే మర్చిపోయేలా చిరంజీవి ఈ సినిమాలో అన్నీ చేశారు. అతని కోసమే ఆద్యంతం ఈ సినిమాను చూసేస్తాం. అభిమాన హీరో అందంగా, పాత వయసుకు వెళ్ళి మరీ మాస్‌ సినిమా చేసినప్పుడు – ఫ్యాన్స్‌కు అంతకన్నా ఇంకేం కావాలి! ఇప్పటికే అమెరికాలో ప్రీమియర్స్‌తో సహా ఓపెనింగ్‌ కలెక్షన్లతో కొత్త చరిత్ర సృష్టిస్తుండడమే అందుకు తార్కాణం. అందుకే, యస్‌... బాస్‌ ఈజ్‌ బ్యాక్‌..  టు ది ఫ్యాన్స్‌! బై ది ఫ్యాన్స్‌! అండ్‌ ఫర్‌ ది ఫ్యాన్స్‌!! ఇమేజ్‌లో, ఫ్యాన్స్‌ హృదయాల్లో చిరంజీవి అప్పుడూ ఇప్పుడే కాదు–ఎప్పటికీ ఖైదీ! అంకెల్లో మైలురాయి సినిమా అయిపోయింది కాబట్టి అభిమానులు, చిరంజీవి ఇకపై వైవిధ్యభరిత చిత్రాల్ని ఆశిస్తే, మరో గొప్ప ఇన్నింగ్స్‌కు ఇది గ్రేట్‌ స్టార్ట్‌!

యస్‌... హి ఈజ్‌ ట్రూలీ బ్యాక్‌!
ఫస్టాఫ్‌ నిదానంగానే అయినా కామెడీగా, ఇంటర్వెల్‌కు కాస్తంత ముందు నుంచి అసలు కథతో ఎమోషనల్‌గా, ముగింపు హడావిడిగా, హంగామాగా సాగుతుంది. ఈ సినిమా ‘ఠాగూర్‌’, ‘స్టాలిన్‌’, వి.వి. వినాయక్‌ మార్కు సినిమాల తరహాలోనే ఉంటుంది. నేపథ్యంలో వస్తూ, ఆలోచింపజేసే ‘నీరు నీరు’ పాట (రచన రామజోగయ్యశాస్త్రి, గానం శంకర్‌ మహదేవన్‌) ఇకపై చాలాకాలం మీడియాలో ప్రతిధ్వనించే భావోద్వేగ గీతం. శంకర్‌ పాత్ర అసలు కథ తెలిసే సీన్, మీడియాతో సీన్‌ లాంటి సందర్భాల్లో చిరంజీవి ఎమోషనల్‌ నటనను ప్రత్యేకించి మెచ్చుకొని తీరాలి.   – రెంటాల జయదేవ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement