చిరుపై అభిమానం తగ్గలేదు : అల్లు అరవింద్
‘‘చిరంజీవిగారి రీఎంట్రీని ప్రేక్షకులు ఎంతో ఆదరించారు. అప్పటికీ.. ఇప్పటికీ ఆయనపై ప్రజల అభిమానం ఏమాత్రం తగ్గలేదనడానికి వసూళ్లే నిదర్శనం. ‘ఖైదీ నంబర్ 150’ని ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అని నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. చిరంజీవి, కాజల్ అగర్వాల్ జంటగా కొణిదెల సురేఖ సమర్పణలో వీవీ వినాయక్ దర్శకత్వంలో రామ్‌చరణ్ నిర్మించిన ‘ఖైదీ నంబర్ 150’ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ– ‘‘చిరు రీ–ఎంట్రీ కోసం ఏ దర్శకుడైతే బాగుంటాడని మేం వేటాడి, వెంటాడ లేదు. వినాయక్ ది బెస్ట్ అని ఫిక్స్ అయ్యాం. అనుకున్నట్లే ఆయన చిరంజీవిని చక్కగా చూపించారు. తక్కువ టైమ్‌లో వంద కోట్ల గ్రాస్‌లో చేరిన చిత్రం మాదే అని చెప్పడానికి సంతోషంగా ఉంది.
మా చిత్రం విడుదలైన వారానికే ప్రపంచవ్యాప్తంగా 108.48కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 76.43 కోట్లు వసూలు కావడం విశేషం. నాలుగైదు రోజుల్లో థ్యాంక్స్ మీట్ నిర్వహించనున్నాం’’ అని చెప్పారు. వినాయక్ మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రానికి కథ 49 శాతమైతే, చిరంజీవి గారి గ్లామర్ 51 శాతం. తన మేనల్లుడు నిర్మాత కావడంతో అల్లు అరవింద్‌గారు వెనకుండి మా టీమ్‌ను ముందుకు నడిపించారు. ‘ఖైదీ నంబర్ 150’ చిత్రం ఎంత సంతోషాన్నిచ్చిందంటే చాగల్లులోని మా ఇంట్లో నిజమైన సంక్రాంతి జరుపుకున్నాం. ఇప్పటి వరకూ చాగల్లులో ఐదులక్షలకు మించి ఏ చిత్రం వసూళ్లు చేయలేదు. మా చిత్రం ఇప్పటికే ఏడులక్షలు వసూలు చేసింది.
సమస్యలపై ఈ చిత్రంలో మాతృకకు మించి లోతుగా చర్చించాం. అన్నయ్య నుంచి ప్రేక్షకులు వినోదాన్ని ఆశిస్తారు. దానికి ప్రాధాన్యం ఇచ్చాం. నాకు ఇంతమంచి కథ ఇచ్చిన మురుగదాస్‌గారికి కృతజ్ఞతలు. మహిళా ప్రేక్షకులు కూడా మా సినిమాకు బ్రహ్మర థం పడుతున్నారు. చిరుపై తమకున్న అభిమానాన్ని ప్రేక్షకులు కలెక్షన్ల రూపంలో వర్షంలా కురిపిస్తున్నారు. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్‌తో చిరంజీవిగారు కొత్త ఉత్సాహంతో ఉన్నారు. తర్వాతి చిత్రంలో ఇంతకంటే హ్యాండ్‌సమ్‌గా కనిపించేందుకు కష్టపడుతున్నారు. ఈ చిత్రం కోసం ఎగ్జిక్యూటివ్ నిర్మాత వాకాడ అప్పారావుగారు, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, కెమెరామేన్ రత్నవేలుతో పాటు టెక్నీషియన్స్ అంతా బాగా కష్టపడ్డారు. వారందరికీ, మా చిత్రాన్ని ఆదరించిన తెలుగువారికీ కృతజ్ఞతలు’’ అని చెప్పారు.