బాలా చిత్రంలో మనీషా?
జాతీయ ఉత్తమ అవార్డు గ్రహీత బాలా దర్శకత్వంలో బాలీవుడ్ నటి మనీషాకోయిరాలా నటించనున్నారా? కోలీవుడ్ వర్గాల్లో జరుగుతున్న తాజా చర్చ ఇది. ఇంతకు ముందు కోలీవుడ్‌లో ముదల్వన్, ముంబై, ఇండియన్, బాబా వంటి చిత్రాల్లో కథానాయకిగా నటించిన మనీషాకోయిరాలా ఆ తరువాత అనూహ్యంగా క్యాన్సర్ వ్యాధి బారిన పడి చిరకాలం పోరాడి గెలిచారు. తాజాగా అర్జున్ హీరోగా నటిస్తున్న ఒక మెల్లియ కోడు చిత్రంలో నటిస్తున్నారు. ఇకపోతే దర్శకుడు బాలా తెరకెక్కించిన తారైతప్పట్టై చిత్రం శుక్రవారం తెరపైకి రానుంది.
దీంతో ఆయన తదుపరి చిత్రానికి సిద్ధమవుతున్నారు. ఇందులో ఆర్య, అరవింద్‌సామి, రానా, అధర్వ నలుగురు హీరోలు నటించనున్నారనే ప్రచారం జరుగుతోంది. దీనికి కుట్ర పరంపరై అనే టైటిల్‌ను కూడా నిర్ణయించినట్లు సమాచారం. ఈ చిత్రంలో అందాల భామ అనుష్క కథానాయికిగా నటించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. తాజాగా మనీషాకోయిరాలా పేరు తెరపైకి రావడం విశేషం. ఇందుకు కారణం బాలా, నటి మనీషాకోయిరాలా కలుసుకోవడమే.
బాలా తన తాజా చిత్రాన్ని మల్టీస్టార్స్‌తో రూపొందించనున్నారనే ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో ఆ స్టార్స్‌లో మనీషాకోయిరాలా ఒకరు కానున్నారనే మాట కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే వర్క్ మోర్ టాక్ లెస్ సూక్తికి సొంతదారుడైన బాలా తన తాజా చిత్రం గురించి ఇంత వరకూ పెదవి విప్పలేదన్నది గమనార్హం.