మనసును మెలిపెట్టే ప్రేమకథ
‘‘ ‘నిన్ను నన్ను విడదీసిన విధిపై నాకు అపారమైన నమ్మకం! ఎప్పుడో ఒకప్పుడు మళ్లీ అది మనల్ని కలుపుతుందని’... చలం ‘ప్రేమలేఖ’ల్లో చిన్న లైన్ ఇది. మా సినిమా లైన్ కూడా సింపుల్‌గా అదే. హృదయాలను బరువెక్కించే ప్రేమకథలొచ్చి చాలాకాలమైంది. ఆ లోటును మా సినిమా తీర్చేస్తుంది’’ అని ‘ఓనమాలు’ చిత్రం ఫేమ్ క్రాంతిమాధవ్ అన్నారు. శర్వానంద్, నిత్యామీనన్ జంటగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో కె.ఎస్.రామారావు ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇంకా పేరు ఖరారు కాని ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం వైజాగ్‌లో జరుగుతోంది.
ఈ సందర్భంగా ఈ సినిమా గురించి మాట్లాడారు క్రాంతిమాధవ్. ‘‘అద్భుతమైన స్క్రిప్ట్‌తో తెరకెక్కుతోన్న చిత్రమిది. మలినం లేని ప్రేమంటే ఏంటో ఈ సినిమాలో చూపిస్తున్నాం. శర్వానంద్, నిత్యామీనన్‌లు తమ పాత్రల్ని ప్రేమించి ఈ సినిమా చేస్తున్నారు. శర్వా ఇందులో స్పోర్ట్స్‌మేన్. దానికి తగ్గట్టుగా తన శారీరకభాషను మార్చుకున్నారు. శర్వా, నిత్యాలు లేని సన్నివేశం ఈ సినిమాలో ఒక్కటీ ఉండదు. తెలుగులో చాలాకాలం తర్వాత వస్తున్న మనసును మెలిపెట్టే ప్రేమకథ ఇది. సాంకేతికంగా కూడా ఈ సినిమా అభినందనీయంగా ఉంటుంది. బుర్రా సాయిమాధవ్ మాటలు, జ్ఞానశేఖర్ కెమెరా ఈ చిత్రానికి పెద్ద ఎస్సెట్. సంగీతానికి ప్రాధాన్యం ఉన్న కథ ఇది. అందుకే, మలయాళంలో నంబర్‌వన్ సంగీత దర్శకునిగా భాసిల్లుతున్న గోపీసుందర్‌ని సంగీత దర్శకునిగా తీసుకున్నాం.
20 రోజుల పాటు వైజాగ్‌లోనే చిత్రీకరణ జరుగుతుంది. ‘ఓనమాలు’ నా అభిరుచిని బయటపెట్టిన సినిమా అయితే... ఇది కమర్షియల్‌గా నేనేంటో తెలియజెప్పే సినిమా అవుతుంది’’అని చెప్పారు క్రాంతిమాధవ్.