ఆ నిజాన్ని ఎలా చూపించారో?
‘‘ఈ కథలో ఓ నిజం ఉంది. ఆ నిజాన్ని దర్శకుడు ఎలా చూపించి ఉంటారో చూడాలని ఆసక్తిగా ఉంది. పాటలు, ప్రచార చిత్రాలు బాగున్నాయి. ప్రస్తుతం ఇలాంటి చిత్రాల ట్రెండ్ నడుస్తోంది. అందుకని, తప్పకుండా ఘనవిజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని సంగీతదర్శకుడు ఆర్పీ పట్నాయక్ అన్నారు. నీరజ్ శ్యామ్, నేహా సక్సేనా జంటగా ఎస్.ఎస్. నందా వి. సమర్పణలో సంజీవ్ మేగోటి దర్శకత్వంలో లండన్ గణేశ్ నిర్మించిన చిత్రం ‘క్యూ’. చిత్రదర్శకుడు స్వరపరచిన పాటలను తెలంగాణ రాష్ర్ట సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఆవిష్కరించారు.
ఈ వేడుకలో యం.యం. శ్రీలేఖ, బంటి తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. ఈ వేడుకలో దర్శకుడు మాట్లాడుతూ - ‘‘గత ఇరవయ్యేళ్లల్లో తెలుగులో ఏడు చిత్రాలు చేశాను. ఆ తర్వాత కన్నడ చిత్రాలతో బిజీ కావడంతో తెలుగుకి దూరమయ్యాను. ఇప్పుడీ ‘క్యూ’తో తెలుగులోకి రీ-ఎంటర్ అవుతున్నా. తెలుగు, తమిళ భాషల్లో 25 రోజుల్లో ఈ హారర్ ఎంటర్‌టైనర్‌ని పూర్తి చేశాం. ఇందులో ధన్‌రాజ్‌ది చాలా ముఖ్య పాత్ర’’ అన్నారు. నిర్మాత మాట్లాడుతూ - ‘‘మంచి సినిమా తీశామన్న సంతృప్తి కలిగింది. ‘పడమటి సంధ్యా రాగం’ అని మరో చిత్రం చేస్తున్నాం’’ అన్నారు.