Sanjeev megoti
-
యాక్షన్ థ్రిల్లర్ కి సై
నెగటివ్ రోల్స్‌తో దూసుకెళుతూ, పాజిటివ్ క్యారెక్టర్స్‌లోనూ భేష్ అనిపించుకున్నారు వరలక్షీ శరత్‌కుమార్ (Varalaxmi Sarathkumar). కథ నచ్చినప్పుడుల్లా కథానాయికప్రాధాన్యం ఉన్న చిత్రాలు కూడా చేస్తుంటారామె. తాజాగా ఆ తరహా చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారామె. ఈ సినిమాకి ‘ఆదిపర్వం’ మూవీ డైరెక్టర్ సంజీవ్ మేగోటి(Sanjeev Megoti) దర్శకత్వం వహించనున్నారు.‘‘సంజీవ్ మేగోటి రాసుకున్న సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ కథకి వరలక్ష్మి ఓకే చెప్పారు. ఈ మూవీలో ఆమె మెయిన్ లీడ్ చేయనున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించనున్న ఈ సినిమాలో పలువురు ప్రముఖ నటీనటులను తీసుకోనున్నాం. పూర్తి వివరాలు అతి త్వరలోనే ప్రకటిస్తాం’’ అని మేకర్స్ తెలిపారు. -
వరలక్ష్మీ శరత్ కుమార్ చేతికి మరో క్రేజీ ప్రాజెక్ట్
ప్రముఖ నటుడు శరత్ కుమార్ కూతురిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన వరలక్ష్మీ(Varalaxmi Sarathkumar ).. తనదైన నటనతో సౌత్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. కెరీర్ తొలినాళ్లలో హీరోయిన్గా కొన్ని సినిమాలు చేసింది. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పలు కీలక పాత్రలు పోషించి సౌత్ ఇండియాలో విలక్షణ నటిగా గుర్తింపు సంపాదించుకుంది. టాలీవుడ్‌లోనూ ఈమె మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. గతేడాది సంక్రాంతికి రిలీజైన హనుమాన్ చిత్రంలో వరలక్ష్మీ పోషించిన పాత్రకు మంచి స్పందన వచ్చింది. ఆ మూవీ రిలీజ్ తర్వాత ఆమెకు ఇక్కడ వరుస సినిమా చాన్స్‌లు వస్తున్నాయి. తాజాగా ఈ విలక్షణ నటి చేతికి భారీ ప్రాజెక్ట్ వచ్చినట్లు తెలుస్తోంది. 'ఆదిపర్వం' మూవీ డైరెక్టర్ సంజీవ్ మేగోటి దర్శత్వంలో వరలక్ష్మీ ఓ తెలుగు సినిమా చేయబోతున్నట్లు సమాచారం. సంజీవ్ మేగోటి రాసుకున్న సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ సబ్జెక్టు కోసం వరలక్ష్మి శరత్ కుమార్ ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ఇందులో వరలక్ష్మి శరత్ కుమార్ మెయిన్ లీడ్ పాత్ర చేయనుంది.భారీ బడ్జెట్‌తో డైరెక్టర్ సంజీవ్ మేగోటి తెరకెక్కించనున్న ఈ సినిమాలో పలువురు ప్రముఖ నటీనటులను తీసుకోబోతున్నారట. వరలక్ష్మి శరత్ కుమార్ మెయిన్ లీడ్‌గా సంజీవ్ మేగోటి తెరకెక్కించనున్న ఈ ప్రాజెక్టు ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. పూర్తి వివరాలు అతి త్వరలోనే ప్రకటించనున్నట్టు సమాచారం. -
అందుకే మంచు లక్ష్మిని తీసుకున్నా: ‘ఆదిపర్వం’ డైరెక్టర్
1974-90 మధ్య కాలంలో జరిగిన యదార్థ ఘటనల నేపథ్యంలో ‘ఆదిపర్వం’ చిత్రాన్ని తెరకెక్కించాం. అప్పట్లో నిధి నిక్షేపాల కోసం గుడులలో విగ్రహాలు ధ్వంసం చేసేవారు. ఆ ఘటనలకు ఫిక్షన్ యాడ్ చేసి ఈ చిత్రంలో చూపిస్తున్నా. అమ్మోరు, అరుంధతి చిత్రాల తరహాలో ‘ఆదిపర్వం’ ఉంటుంది’అని అన్నారు దర్శకుడు సంజీవ్ మేగోటి. ఆయన దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘ఆదిపర్వం’. ఈ సినిమాలో మంచు లక్ష్మి, ఎస్తేర్, శివ కంఠమనేని ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మరో కీలక పాత్రను ఆదిత్య ఓం పోషిస్తున్నారు. ఎర్రగుడి నేపథ్యంలో అమ్మవారి చుట్టూ అల్లుకున్న పీరియాడిక్ ప్రేమకథగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఈ నెల 8న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా దర్శకుడు సంజీవ్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..⇢ మా నాన్నగారు ప్రభుత్వ ఉద్యోగి. చిన్నప్పుడు పద్య నాటకాలు చూసేవాడిని. ఇంట్లో ఉన్న పెడల్ హార్మోనియం వాయించేవాడిని. అలా మ్యూజిక్ పట్ల చిన్నప్పుడే అవగాహన ఏర్పడింది. రచన, సంగీత జ్ఞానం చిత్ర పరిశ్రమలో నా కెరీర్ కు ఉపయోగపడ్డాయి.⇢ 1994 లో మధు ఫిలిం ఇనిస్టిట్యూట్ లో స్టూడెంట్స్ చేరడం ద్వారా చిత్ర పరిశ్రమలో నా జర్నీ మొదలైంది. 1995లో ప్రొడ్యూసర్ గా ఒక సినిమా చేశాను. నాకు అప్పుడు 21 ఏళ్లు. 97లో సింధూరం సినిమా చూసి రవితేజను కలిసి నువ్వు పెద్ద హీరో అవుతావు అని చెప్పి అడ్వాన్స్ ఇచ్చి కథ చెప్పాను. ఆ మూవీ పలు కారణాలతో పట్టాలెక్కలేదు. 14 సినిమాలకు మ్యూజిక్ చేశాను, తమిళ, తెలుగు, కన్నడ కలిపి 10 సినిమాలకు డైరెక్షన్ చేశాను. 42 సీరియల్స్ కు స్క్రిప్ట్ రాశాను. కొన్ని సినిమాలకు మ్యూజిక్ చేశాను. సీరియల్స్, సినిమాల్లో నటించాను. ఇలా నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, లిరిసిస్ట్ గా, మ్యూజిక్ డైరెక్టర్ గా నా జర్నీ కొనసాగుతోంది.⇢ "ఆదిపర్వం" సినిమా నా రీఎంట్రీ మూవీ అనుకోవచ్చు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళంలో ఈ నెల 8వ తేదీన రిలీజ్ చేస్తున్నాం. రాయలసీమ కడప దగ్గరలోని ఎర్రగుడి నేపథ్యంగా అమ్మవారి సినిమాగా "ఆదిపర్వం" రూపొందించాను. గ్రాఫిక్స్ కు ప్రాధాన్యత ఇచ్చాం. ఈ సినిమాలో కొన్ని సీన్స్ చూసి గ్రాఫిక్స్ తో చేసినవి అని గుర్తుపట్టరు. మాకున్న బడ్జెట్ లో క్వాలిటీ గ్రాఫిక్స్ చేయించాం. 11 నెలలు సీజీ కోసమే వర్క్ చేశాం. మొత్తం మూవీ చేయడానికి ఏడాదిన్నర టైమ్ పట్టింది.⇢ ఆదిపర్వం సినిమాలో మంచు లక్ష్మి కీ రోల్ చేస్తున్నారు. ఆమె నెగిటివ్ గా, పాజిటివ్ గా రెండు షేడ్స్ లో మెప్పించగలరు. యాక్షన్ చేయగలరు. అందుకే ఈ సినిమాలో ఆమెను తీసుకున్నాం. మంచు లక్ష్మి షూటింగ్ టైమ్ లో మాకు ఎంతో కోపరేట్ చేశారు. ఆదిత్య ఓం మరో ప్రధాన పాత్రలో కనిపిస్తారు. ఎస్తేర్ ఒక మంచి పర్ ఫార్మెన్స్ ఓరియెంటెడ్ క్యారెక్టర్ లో నటించారు. అలాగే మలయాళ నటి శ్రీజిత ఘోష్, చంటిగాడు ఫేం సుహాసినీ కథలో ఇంపార్టెన్స్ ఉన్న రోల్స్ చేశారు. ఈ మూవీలో హీరో హీరోయిన్స్ అంటూ ప్రత్యేకంగా ఉండరు. అందరూ కథలో భాగంగా ఉంటారు.⇢ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచేలా "ఆదిపర్వం" థియేటర్స్ లోకి తీసుకొస్తున్నాం. మంచు లక్ష్మి గారితో సహా ప్రతి పాత్రను కొత్తగా స్క్రీన్ మీద చూస్తారు. కన్నడలో మంచి రిలీజ్ దొరికింది. అక్కడ మేము పబ్లిసిటీ చేయలేదు అయితే దర్శకుడిగా నాకు కన్నడలో మంచి పేరుంది. అక్కడ సక్సెస్ పుల్ సినిమాలు తీశాను. దాంతో "ఆదిపర్వం" సినిమా కన్నడలో గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది.⇢ ప్రస్తుతం సర్పయాగం అనే సినిమా డైరెక్ట్ చేస్తున్నాను. మరో వెబ్ సిరీస్ కు సంప్రదింపులు జరుగుతున్నాయి. -
ఆ నిజాన్ని ఎలా చూపించారో?
‘‘ఈ కథలో ఓ నిజం ఉంది. ఆ నిజాన్ని దర్శకుడు ఎలా చూపించి ఉంటారో చూడాలని ఆసక్తిగా ఉంది. పాటలు, ప్రచార చిత్రాలు బాగున్నాయి. ప్రస్తుతం ఇలాంటి చిత్రాల ట్రెండ్ నడుస్తోంది. అందుకని, తప్పకుండా ఘనవిజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని సంగీతదర్శకుడు ఆర్పీ పట్నాయక్ అన్నారు. నీరజ్ శ్యామ్, నేహా సక్సేనా జంటగా ఎస్.ఎస్. నందా వి. సమర్పణలో సంజీవ్ మేగోటి దర్శకత్వంలో లండన్ గణేశ్ నిర్మించిన చిత్రం ‘క్యూ’. చిత్రదర్శకుడు స్వరపరచిన పాటలను తెలంగాణ రాష్ర్ట సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఆవిష్కరించారు. ఈ వేడుకలో యం.యం. శ్రీలేఖ, బంటి తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. ఈ వేడుకలో దర్శకుడు మాట్లాడుతూ - ‘‘గత ఇరవయ్యేళ్లల్లో తెలుగులో ఏడు చిత్రాలు చేశాను. ఆ తర్వాత కన్నడ చిత్రాలతో బిజీ కావడంతో తెలుగుకి దూరమయ్యాను. ఇప్పుడీ ‘క్యూ’తో తెలుగులోకి రీ-ఎంటర్ అవుతున్నా. తెలుగు, తమిళ భాషల్లో 25 రోజుల్లో ఈ హారర్ ఎంటర్టైనర్ని పూర్తి చేశాం. ఇందులో ధన్‌రాజ్‌ది చాలా ముఖ్య పాత్ర’’ అన్నారు. నిర్మాత మాట్లాడుతూ - ‘‘మంచి సినిమా తీశామన్న సంతృప్తి కలిగింది. ‘పడమటి సంధ్యా రాగం’ అని మరో చిత్రం చేస్తున్నాం’’ అన్నారు.