భళిరా.. దలేర్‌! | Sakshi special interview with Daler Mehndi | Sakshi
Sakshi News home page

భళిరా.. దలేర్‌!

Published Sun, Nov 11 2018 12:50 AM | Last Updated on Sun, Nov 11 2018 1:10 AM

Sakshi special interview with Daler Mehndi

తునక్‌ తునక్‌ తున్‌..తునక్‌ తునక్‌ తున్‌..'ఎక్కడో విన్నట్లుండదు.ఇప్పుడే విన్నట్లుంటుంది!ఇరవై ఏళ్ల తర్వాత కూడా వాయిస్‌లో అదే ఎనర్జీ.'చెప్పానే చెప్పొద్దు వంక..'- చెప్పడానికేం ఉందని ?'నువ్వంటే పడీ పడీ...' పడేస్కున్నాడలా పాడి.'భళి రా భళి..'- బంగ్రాలో దలేరా బాహుబలి.లేటెస్ట్‌గా ఇప్పుడు రెడ్డీ ఇక్కడ సూడు..'(అరవింద)ఈ బిహారీ గొంతు తెలుగులో ఇంతగా..స‍్వర విహారం చేస్తోంది ఎందుకని?జోష్‌ ఉంటుంది. అదే జోష్‌లో సాక్షి ఫ్యామిలీకి దలేర్‌ మెహందీ ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్వ్యూ ఇది.

‘అరవింద సమేత వీర రాఘవ’లో ‘రెడ్డీ ఇక్కడ సూడు...’ అంటూ మీ వాయిస్‌తో తెలుగు ఆడియన్స్‌ని మరోసారి మెస్మరైజ్‌ చేశారు.. ఎన్టీఆర్‌కి మీరు మూడోసారి పాడారు కదా?
దలేర్‌ మెహందీ: అవును. ‘యమదొంగ’లో ‘నువ్వంటే పడి పడి చస్తానే..’ పాట పాడాను. ఆ పాట సూపర్‌ హిట్‌. ఆ తర్వాత ‘బాద్‌షా’ సినిమాలో ‘బంతిపూల జానకీ జానకీ..’ పాడాను. అది కూడా మంచి మాస్‌ హిట్‌. ఇప్పుడు ‘అరవింద సమేత..’లో పాడిన ‘రెడ్డీ ఇక్కడ..’ సాంగ్‌కి కూడా మంచి అప్లాజ్‌ వస్తోంది. నిజానికి నార్త్‌ నుంచి సౌత్‌ వరకూ నా వాయిస్‌ వస్తుందని ఊహించలేదు. సౌత్‌లో దొరుకుతున్న ప్రేమకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. దక్షిణాది రాష్ట్రాల్లో కూడా అభిమానులు ఏర్పడటానికి కారణమైన సంగీత దర్శకులు యం.యం.కీరవాణి, తమన్‌లకు ధన్యవాదాలు.

తెలుగు పాటలు పాడుతున్నప్పుడు ఆ పదాలు పలకడం, ఉచ్చారణ ఇబ్బందిగా అనిపించదా?
పాట లిరిక్స్‌ను పంజాబీలో రాసుకుంటాను. తెలుగు పదాలు పలుకుతుంటే ఉర్దూ, పర్షియన్‌ భాషల కలయికలా ఉంటుంది. పంజాబీ ఫోనటిక్స్‌ తెలుగు లైన్స్‌ సిమిలర్‌గా ఉంటాయి. అందుకని మరీ కొత్త భాషలా అనిపించదు. పంజాబీ పాటలు పాడుతున్నప్పుడు ఎలా ఎంజాయ్‌ చేస్తానో ఇవి కూడా అలానే ఎంజాయ్‌ చేస్తాను.


(‘మగధీర’లో రామ్‌చరణ్‌)

మీ పాటలు ఫుల్‌ జోష్‌తో నిండి ఉంటాయి. మీ ఎనర్జీని స్క్రీన్‌ మీద హీరోలు తమ డ్యాన్స్‌తో మ్యాచ్‌ చేసినప్పుడు ఎలా అనిపిస్తుంది?
నేను పాడుతున్నప్పుడే ఈ పాటకు హీరో ఎంత బాగా డ్యాన్స్‌ చేస్తారు? అని ఆలోచిస్తా. నా వాయిస్‌ పీక్స్‌లో ఉండి.. హీరో స్టెప్పులు సాదాసీదాగా ఉంటే సాంగ్‌ పేలవంగా అయిపోతుంది. అందుకే నా వాయిస్‌లోని ఎనర్జీని హీరో స్టెప్స్‌ మ్యాచ్‌ చేస్తే సంతోషంగా ఉంటుంది. ముఖ్యంగా సౌత్‌ యాక్టర్స్‌ ఎనర్జీ లెవల్స్‌ సూపర్‌. అందరూ మంచి డ్యాన్సర్స్‌. అందుకే ఇప్పటివరకూ ఏదీ ‘మిస్‌ మ్యాచ్‌’ కాలేదు.

ఎక్కువ పాటలు ఎన్టీఆర్‌కే పాడారు.. కారణం?
వేరే వాళ్లకు పాడకూడదని కాదు. కానీ ఎన్టీఆర్‌కే మూడుసార్లు పాడటం కుదిరింది. ఎన్టీఆర్‌  యాక్టింగ్, డ్యాన్స్‌లు ఇష్టపడతాను. తనకోసం పాడిన మూడు పాటలూ హిట్టయి, హ్యాట్రిక్‌ కొట్టడం సంతోషంగా ఉంది. నిజానికి నాకు సౌత్‌ యాక్టర్స్‌ అందరికీ పాడాలని ఉంది. సాంగ్‌ సౌండింగ్‌ బావుండి, నాకు నచ్చితే ఎవ్వరికైనా పాడతాను.

పరభాషల్లో పాడేటప్పుడు అర్థం తెలుసుకుంటారా?
ఈ పాట ఏ సందర్భంలో వస్తుంది, పాట ఉద్దేశం ఏంటి? అని సంగీత దర్శకుడిని అడిగి తెలుసుకుంటాను. అప్పుడే ఆ పాట మూడ్‌కు కావాల్సినట్టు ఎనర్జీతో పాడగలం. ‘బాహుబలి’(భళి భళిరా భళి పాట)కి పాడాను. సూపర్‌ హిట్‌ అయింది. ఆ పాట ఏంటి అని అర్థం చేసుకుంటేనే మన బెస్ట్‌ ఇవ్వగలం అని నమ్ముతాను. సంగీతానికి భాష లేదు. భాష అడ్డు కాదు కూడా. నా పాటలు సౌత్‌ కొరియా, పోలండ్‌లో కూడా పాపులర్‌. అక్కడివాళ్లకు తెలుగు, హిందీ, పంజాబీ తెలిసే అవకాశం తక్కువ. అయినా ఎంజాయ్‌ చేస్తున్నారంటే సౌండ్‌ బాగుండబట్టే కదా.

వాయిస్‌ ఫ్రెష్‌గా ఉంచుకోవడానికి ఎలాంటి ఎక్సర్‌సైజ్‌లు చేస్తుంటారు?
నా వాయిస్‌ ఫ్రెష్‌గా ఉండటానికి కారణం దేవుణ్ణి ఆరాధించడమే. రియాజ్‌ (సంగీతాన్ని సాధన చేయడం) అన్నింటికన్నా ముఖ్యం. మన వాయిస్‌కి తిరుగులేదు అని సాధన మానేసిన రోజున బయట మన పాట వినిపించదు.



(‘అరవింద సమేత’లో ఎన్టీఆర్, పూజా హెగ్డే )

మీ ఫస్ట్‌ స్టేజి పెర్ఫార్మెన్స్‌ గురించి?
నా ఫస్ట్‌ స్టేజి పెర్ఫార్మెన్స్‌ అప్పుడు నాకు 13ఏళ్లు. ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్‌లో ఆ షో జరిగింది. ఎదురుగా దాదాపు 20 వేల మంది శ్రోతలు. నాకేం భయం అనిపించలేదు. తడబడలేదు. ఎందుకంటే అంతమందిని చూడగానే ఎక్కడలేని హుషారు వచ్చింది. మ్యూజిక్‌ అంటే నాకు ప్రేమ. ప్రూవ్‌ చేసుకోవాలనే తపనతో బాగా పాడాను. అందరూ మెచ్చుకున్నారు.

అసలు మ్యూజిక్‌ అంటే ఎప్పుడు ఇంట్రస్ట్‌ మొదలైంది?
మా అమ్మగారికి సంగీతం అంటే ఇష్టం. నేను ఆమె గర్భంలో ఉన్నప్పుడు ఎవరూ పాడలేనంత అద్భుతంగా పాడే బిడ్డను ఇవ్వమని ఆ దేవుడ్ని ఎప్పుడూ కోరుకుంటూ ఉండేవారట. ఆమె సంకల్పం బలమైనది. అమ్మ కోరిక తగ్గట్టుగానే నన్ను పుట్టించాడు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే నాలో మ్యూజిక్‌ పుట్టిందని భావిస్తాను.

కొందరు సింగర్స్‌ వాయిస్‌ కేర్‌లో భాగంగా వేడి నీళ్లు తాగుతారు. ఐస్‌క్రీమ్‌లు తినరు. అలాంటివి ఏవైనా చేస్తారా?
సరైన ఆహారం తీసుకుంటాను. నాకు సంతోషాన్ని ఇచ్చే పనులే చేస్తాను. మనం సంతోషంగా ఉంటే అది మన వాయిస్‌లోనూ ప్రతిబింబిస్తుంది. ఫుడ్‌ విషయంలో అస్సలు కాంప్రమైజ్‌ అవ్వను. నేను మందు జోలికి వెళ్లను. సంగీతం నేర్చుకోవాలనుకుంటున్న వాళ్లకు నేను చెప్పేది ఒక్కటే... మద్యం జోలికి వెళ్లకండి. ఒక మంచి సింగర్‌ అవ్వాలంటే మద్యానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

ధూమపానమూ గొంతును పాడు చేస్తుంది కదా?
అవును.. స్మోకింగ్‌ ప్రభావం వాయిస్‌ మీద చాలా ఉంటుంది. వీటితో పాటు మనసులో నెగటివిటీ కూడా గొంతుపై ప్రభావం చూపుతుందని నమ్ముతాను. వేరే వాళ్ల పట్ల ఈర్ష్య, దేవుడి పట్ల కృతజ్ఞతా భావంతో ఉండకపోవడం.. ఇవన్నీ మన గొంతుపై ప్రభావం చూపుతాయి. గొంతులో నుంచి మాట రావడమంటే గాలే కదా. దేవుడి పట్ల కృతజ్ఞతా భావంతో లేకపోతే దాన్ని తీసేసుకోవడం ఆయనకు ఎంతసేపు? బావుంటే ఆన్‌ ది నోట్‌ లేదంటే ఆఫ్‌ ది నోట్‌ అయిపోతుంది.

వాయిస్‌కి వయసు ఉంటుందా? సాధారణంగా కొంత వయసు వచ్చాక గొంతులో మార్పు కనిపిస్తుంది కదా?
దేవుడి ఆశీస్సులు మన మీద ఉంటే గొంతుకి ఏజ్‌ అయిపోవడం లాంటివి ఉండవు. అప్పుడు గొంతు ఏజ్‌లెస్‌ అవుతుంది.

మీ వాయిస్‌ సమ్‌థింగ్‌ డిఫరెంట్‌గా ఉంటుంది. మీ సక్సెస్‌కి కారణం అదేనంటారా?
ఒక్కో ఆర్టిస్ట్‌కి ఒక్కో శైలి ఉంటుంది. ఆర్టిస్ట్‌ శైలిలో ఇదొకటి అని అనుకుంటాను. పుట్టేటప్పుడు నా వాయిస్‌ ఇది కాదు. కానీ రాను రాను నా వాయిస్‌ని ట్రైన్‌ చేసుకున్నాను.  రియాజ్‌ చేసి  చేసి ఇలాంటి వాయిస్‌ని సంపాదించగలిగాను. పెద్దలు అంటుంటారు కదా ‘ప్రాక్టీస్‌ మేక్స్‌ మ్యాన్‌ పర్ఫెక్ట్‌’ అని.

సింగర్‌గా మీరు పాపులర్‌. అయితే కొన్ని విమర్శలూ ఉన్నాయి. మ్యూజికల్‌ షోస్‌ పేరుతో ఇక్కడినుంచి విదేశాలకు సింగర్స్‌ని తీసుకెళ్లారని ‘హ్యూమన్‌ ట్రాఫికింగ్‌’ అభియోగం ఎదుర్కొంటున్నారు. దాని గురించి?
అవన్నీ అసత్యపు ప్రచారాలు. దాని మీద ఫైట్‌ చేస్తున్నాం కూడా. త్వరలోనే అందులో నుంచి బయటకు వస్తాను కూడా. ఈ ఆరోపణలు నా మీద బురద జల్లే ప్రయత్నం.

అంత అవసరం ఎవరికి ఉంటుంది?
ఎవరైనా ఇంకొకరి మీద అనవసరంగా ఎందుకు నిందలు వేస్తారు? కేవలం అత్యాశ వల్లే. అత్యాశే అన్ని తప్పుడు పనులు చేసేలా చేస్తుంది. నాలా ఉన్నత స్థాయికి ఎదగలేదనే ఈర్ష్య ఉండొచ్చు. ప్రతిభ లేకపోయినా నా అంత పాపులార్టీ రావాలనుకునే అత్యాశ అయ్యుండొచ్చు.

ఎంతో పేరు, ప్రఖ్యాతులతో దూసుకెళుతున్న సమయంలో ఇలాంటి ఆరోపణలు మీ ‘వాయిస్‌’ మీద ఏమైనా ప్రభావం చూపించే అవకాశం ఉందా?
అస్సలు లేదు. ఎందుకంటే అవి నిజం కాదని నాకు తెలుసు. నేను గురునానక్‌ని నమ్ముతాను. ఏది జరిగినా ఒక కచ్చితమైన కారణాలతోనే జరుగుతుంది. నాకు ఈ పేరు,  ప్రఖ్యాతులు అన్నీ ఇచ్చింది దేవుడే. ఇప్పుడు ఇలాంటి ఓ సంఘటన సృష్టించాడంటే ఏదో జరగాలనే కదా. ఇలా జరిగిందని ఎవర్నీ నిందించను. ఇలాంటి సమస్యల మధ్యలో పడేసిన ఆ దేవుడే మళ్లీ ఇందులో నుంచి బయటకు తీస్తాడనే నమ్మకం ఉంది.



(‘బాహుబలి’లో ప్రభాస్‌)

అవకాశాలు రావాలంటే ‘అడ్జస్ట్‌ అవ్వాలి’ అంటుంటారు అని కొందరు నటీమణులు ‘క్యాస్టింగ్‌ కౌచ్‌’ గురించి బయటపెడుతున్నారు. మ్యూజిక్‌ ఫీల్డ్‌లో కూడా అది జరుగుతుందా?
నేను సంగీత దర్శకుడిని కాదు. ఎవరికీ అవకాశాలు ఇచ్చే చాన్స్‌ కూడా నాకు లేదు. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి నేను కరెక్ట్‌ కాదేమో. ఒకవేళ నా ప్రెజెన్స్‌లో ఇలాంటివి జరిగి ఉంటే చెప్పేవాణ్ణి.

మరి.. ఇండస్ట్రీలో సింగర్స్‌కి ఉండే కష్టాలే ంటి?
కేవలం సింగర్‌కి అనే కాదు ఇంజనీర్, డాక్టర్‌..  ఎవ్వరైనా ఏ ఫీల్డ్‌ వాళ్లకైనా ఏదో ఒక సమస్య ఎదురవుతుంది. సమస్య ఎదురైంది అని వెనక్కి తిరగకూడదు. ఆ విషయంలో నేను చాలా లక్కీ. చాలామంది నన్ను ప్రేమిస్తున్నారు.

ఓకే.. రియాలిటీ షోలు రియల్‌ టాలెంట్‌ని తీసుకొస్తాయి అంటారా?
కచ్చితంగా. ప్రస్తుతం నేను ‘సూఫీ సుల్తాన్‌’ అనే పెద్ద రియాలిటీ షో కోసం ప్రిపేర్‌ అవుతున్నాను. సూఫీలో సరికొత్త టాలెంట్‌ని ఇండస్ట్రీకు పరిచయం చేయాలన్నది ఆ షో ఉద్దేశం.

మీ డ్రెస్సింగ్‌ స్టైల్‌ యునిక్‌గా ఉంటుంది. దాని వెనకాల మార్కెటింగ్‌ స్ట్రాటెజీ ఏదైనా ఉందా?
నా దృష్టిలో ప్రతి ఆర్టిస్ట్‌కి ఒక యునిక్‌ స్టైల్‌ ఉండాలి. నేనెలా ఉండాలో 1991లోనే నిశ్చయించుకున్నాను. డ్రెస్సింగ్‌ స్టైల్‌ ఇలా ఉంటే బాగుంటుందనుకున్నాను. అప్పటికి నా ఫస్ట్‌ మ్యూజికల్‌ బ్యాండ్‌ కూడా ఏర్పాటు చేసుకోలేదు.

అందరూ మీ మ్యూజిక్‌ ఎంజాయ్‌ చేస్తారు. మీరు ఎవరి సంగీతం ఎంజాయ్‌ చేస్తారు?
హిందుస్తానీ క్లాసికల్‌ సింగర్‌ బడే గులామ్‌ అలీ సాబ్, పాకిస్తానీ సంగీతకారుడు నస్రత్‌ ఫతే అలీలకు వీరాభిమానిని. గాయకులు సుఖ్వీందర్‌ సింగ్, సోనూ నిగమ్‌ పాటలనూ ఎక్కువగా ఇష్టపడతాను.

మీ కుటుంబం గురించి?
నా భార్య తరణ్‌ప్రీత్‌. తనూ పంజాబీ సింగరే. నాకు నలుగురు పిల్లలు. పెద్దమ్మాయికి పంజాబీ సింగర్‌ నవరాజ్‌ హాన్స్‌తో వివాహం అయింది. మరో పాప సైకాలజీ చదువుతోంది. మా అబ్బాయి గుర్‌దీప్‌ సింగర్‌ అనే విషయం తెలిసిందే. మేమంతా మ్యూజిక్‌ ఫీల్డ్‌లోనే ఉన్నాం. బహుశా సంగీతం మా జీన్స్‌లోనే ఉందేమో.

ఫైనల్లీ.. సింగర్‌ కాకపోతే ఏమై ఉండేవారు?
నాకు 70 ఆవులు, 80 మేకలు ఉన్నాయి. సింగర్‌ కాకపోయి ఉంటే అవన్నీ చూస్తూ ఫార్మింగ్‌లోకి వెళ్లిపోయి ఆ పని చేసుకుంటూ ఉండేవాణ్ణి అనుకుంటా.


దలేర్‌ పాడిన పాటల్లో కొన్ని
మగధీర – చెప్పనే చెప్పొద్దు వంక
యమదొంగ – రబ్బరు గాజులు.. రబ్బరు గాజులు...
శ్రీమన్నారాయణ – చలాకీ చూపులతో..
యమలీల – ఓ తాయారు..
బాహుబలి – 2 – భళి భళి రా భళి..
పైసా వసూల్‌ – పైసా వసూల్‌..
అరవింద సమేత – రెడ్డీ ఇక్కడ సూడు..
– డి.జి.భవాని

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement