సరైనోడు.. స్పీడున్నోడు.. స్టార్ట్ చేశారు
మాస్.. ఊర మాస్.. హీరోలను మాంచి మాసీగా చూపడమే కాదు, అవసరమైతే కథ ప్రకారం స్టైలిష్‌గానూ చూపడంలో సరైనోడు అన్పించుకున్న దర్శకుడు బోయపాటి శ్రీను. చేసినవి రెండు సినిమాలే అయినా డ్యాన్సుల్లో, ఫైటుల్లో మంచి స్పీడున్నోడు అని పేరు తెచ్చుకున్న హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఈ ఇద్దరి కలయికలో ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మించనున్న సినిమా శుక్రవారం మొదలైంది. ముహూర్తపు సన్నివేశానికి బోయపాటి శ్రీను కుమారుడు హర్షిత్ కెమేరా స్విచ్చాన్ చేయగా, చిత్ర దర్శక-నిర్మాతల కుమార్తెలు బోయపాటి జోషిత, మిర్యాల ద్వారకలు క్లాప్ ఇచ్చారు.
నిర్మాత మాట్లాడుతూ - ‘‘బోయపాటి మార్క్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది. సాయి శ్రీనివాస్ స్టైలిష్‌గా సరికొత్త లుక్‌లో కనిపించనున్నారు. ఈ నెల 16న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కళ: సాహి సురేశ్, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, కూర్పు: కోటగిరి వెంకటేశ్వర రావు, కెమేరా: రిషి పంజాబి, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్.