శ్రీనివాస కల్యాణం కుదిరేనా?
మోడరన్ కల్చర్ ప్రభావంతో మనిషి జీవన విధానంలో మార్పులు రావొచ్చు. కానీ, భావోద్వేగాలలో ఎటువంటి మార్పులూ రాలేదు. మూలాలనూ మర్చిపోవడం లేదు. తెలుగు తెరపై విజయాలు సాధిస్తోన్న కుటుంబ కథా చిత్రాలే ఈ మాటలు నిజమని చెప్పడానికి చక్కటి నిదర్శనాలు. అందుకు ఈ సంక్రాంతికి మంచి హిట్ అందుకున్న ‘శతమానం భవతి’ని ఓ ఉదాహరణగా పేర్కొనవచ్చు. ఇప్పుడీ విజయంతో అక్కినేని నాగార్జున చిత్రానికి దర్శకత్వం వహించే ఛాన్స్ సతీష్ వేగేశ్నకు వచ్చిందని టాక్. నాగార్జున హీరోగా ఓ సినిమా నిర్మించాలని ‘దిల్’ రాజు ఎప్పటి నుంచో అనుకుంటున్నారట. మొన్నామధ్య తండ్రీకొడుకులు నాగార్జున–నాగచైతన్య హీరోలుగా ఆయన ఓ సినిమా నిర్మించనున్నారని వార్తలొచ్చాయి. వాటిని నాగార్జున ఖండించారనుకోండి.
తాజా ఖబర్ ఏంటంటే.. ‘శ్రీనివాస కల్యాణం’ పేరుతో సతీష్ వేగేశ్న ఓ మాంచి కుటుంబ కథను రెడీ చేశారట. నాగార్జునకు ఈ కథ బాగా సూటవుతుందని ఆయన అనుకున్నారట. ఈ మాటను ‘దిల్’ రాజుకు చెప్పగా, నాగార్జున దృష్టికి తీసుకువెళ్లారని వినికిడి. ప్రస్తుతం హీరో–దర్శక–నిర్మాతల మధ్య చర్చలు జరుగుతున్నాయట. ఆల్రెడీ ‘శతమానం భవతి’తో సతీష్ వేగేశ్న–‘దిల్’ రాజులు మంచి హిట్ అందుకున్నారు. ‘శ్రీనివాస కల్యాణం’ కూడా అలాంటి చక్కటి కుటుంబ కథా చిత్రమేనట. సో, నాగార్జున ఓకే చెప్పే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయని ఫిల్మ్‌నగర్ వర్గాలు అంటున్నాయి.