నేనెప్పుడూ ఆ దేవుడితోనే ఉంటాను! | special interview to hero upendra | Sakshi
Sakshi News home page

నేనెప్పుడూ ఆ దేవుడితోనే ఉంటాను!

Published Wed, Aug 12 2015 10:46 PM | Last Updated on Sun, Sep 3 2017 7:19 AM

నేనెప్పుడూ ఆ దేవుడితోనే ఉంటాను!

నేనెప్పుడూ ఆ దేవుడితోనే ఉంటాను!

 ‘ఉపేంద్ర - 1’లో ‘నేను’ గురించి చెప్పాడు.
 ‘ఉపేంద్ర - 2’లో ‘నువ్వు గురించి చెబుతానంటున్నాడు.
 ఉపేంద్ర తీరే అంత.
 కొంచెం తిక్క తిక్కగా, ఇంకొంచెం గుక్క తిప్పుకోనివ్వకుండా
 అతని సినిమాల కాన్సెప్టులుంటాయి.
 ఉపేంద్ర చాలా నిగూఢమైన మనిషి.
 పైకి కనిపించే ఉపేంద్ర వేరు.
 లోపలి ఉపేంద్ర వేరు.
 సన్యాసం తీసుకోని సర్వసంగ పరిత్యాగిలా అనిపిస్తున్న ఉపేంద్రతో స్పెషల్ టాక్.

 
 ***     చాలా గ్యాప్ తర్వాత ‘ఉపేంద్ర 2’తో తెలుగు తెరపై హీరోగా కనిపించనున్నారు.. ఈ చిత్ర విశేషాలేంటి?
 ‘నేను’ అనే క్యారెక్టర్‌తో ‘ఉపేంద్ర’ ఉంటుంది. నేను అనే భావనను వదిలేసి, ‘నువ్వు’ అని ఆ క్యారెక్టర్ ఆలోచించడం మొదలుపెడితే ఎలా ఉంటుంది? అనే ప్రశ్న పదేళ్లుగా వెంటాడుతూ వచ్చింది. అందుకే ‘ఉపేంద్ర 2’ను ‘నువ్వు’ అనే కాన్సెప్ట్‌తో తీశాం. ‘అంతర్గత స్వేచ్ఛ’ నేపథ్యంలో సాగే చిత్రం ఇది.
 ***     అప్పట్లో నేను అన్నారు.. ఇప్పుడు నువ్వు అంటున్నారు.. అంతర్గత స్వేచ్ఛ అని ఏదేదో చెబుతున్నారు. జనాలకు అర్థమవుతుందంటారా?
 (నవ్వుతూ...) ‘ఉపేంద్ర’ అందరికీ అర్థమైంది. ఇది కూడా అందరికీ అర్థమవుతుంది. ఆ సినిమా చాలా హార్ష్‌గా ఉంటుంది. ఇప్పుడలా ఉండదు. అంతర్గతంగా ప్రతి ఒక్కరికీ జనరల్‌గా కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి. ఆ ఫీలింగ్స్ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమాలో ‘నువ్వు’ అంటే మనందరం అని అర్థం.
 ***     మీ సినిమాలంటే అదో విధంగా ఉంటాయనీ, లేడీస్ ఇబ్బందిపడతారనీ ఊహాగానాలు ఉంటాయి?
 అవును. కానీ, థియేటర్‌కి వచ్చి చూస్తే, కచ్చితంగా ఇష్టపడతారు. ఇంకా చెప్పాలంటే ఈ చిత్రాన్ని ఆడవాళ్లే ఎక్కువగా చూస్తారు. చాలామంది నాకు అభిమానులు అవుతారని కూడా అనుకుంటున్నా.
 ***     ‘ఉపేంద్ర’ చూడనివాళ్లకు ఈ చిత్రం అర్థమవుతుందా?
 అర్థమవుతుంది. అది వేరే కాన్సెప్ట్. ఇది వేరే కాన్సెప్ట్.  ఇంటర్నల్ ఫ్రీడమ్ మీద తీసిన ఈ సినిమా లక్కీగా స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా విడుదల కావడం ఆనందంగా ఉంది.
 ***     మీతో నిర్మించిన ‘రా’ ద్వారా నిర్మాతగా పరిచయమైన నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) పధ్నాలుగేళ్ల తర్వాత మళ్లీ మీతో ‘ఉపేంద్ర 2’ చేయడంపై మీ ఫీలింగ్?
 బుజ్జి, నేను చాలా ఫ్రెండ్లీగా ఉంటాం. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ తనతో నా సినిమా కుదరడం ఆనందంగా ఉంది. ‘ఉపేంద్ర’ సినిమా చాలా ఇష్టమనీ, ‘ఉపేంద్ర 2’ని తెలుగులో నేనే విడుదల చేస్తాననీ, ఈ సినిమా కథ కూడా తెలుసుకోకుండా బుజ్జి విడుదల చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని తను విడుదల చేయడం వల్ల పెద్ద రేంజ్ సినిమా అయ్యింది.
 ***     దర్శకత్వం, నటన... మీకు ఎందులో సంతృప్తి ఉంది?
 దర్శకత్వం అంటే మొత్తం అన్నీ చేసుకోవాలి. అందులో ఓ పరిపూర్ణత ఉంటుంది. నటుడిగా డెరైక్టర్ చెప్పింది చేసేసి వెళ్లిపోవడమే. అది చాలా తేలిక. కానీ, డెరైక్షన్ చాలా కష్టం. ఎక్కువ కష్టపడిన విషయాలు ఎక్కువ సంతృప్తినిస్తాయి కదా.
 ***     ఇక వరుసగా తెలుగు సినిమాలు చేస్తారా?
 చేయాలనే ఉంది. దర్శక, నిర్మాతలు పిలవాలిగా (నవ్వులు).
 ***     ఇలా జుత్తు పెంచుతుంటారు.. బాబా పాత్ర ఏమైనా చేయాలని ఉందా?
 అలా ఏం లేదు. జస్ట్ అలా ఉంటానంతే.


 ***     మీ సినిమాలు విచిత్రంగా, వాటిలో మీ వేషధారణలు కూడా అలానే ఉంటాయి. మంచి వయసులో ఉన్నప్పుడు మీరు లవర్‌బోయ్ పాత్రలు చేయలేదు. ఎందుకని మీ అందం మీద మీకు నమ్మకం లేదా?
 అందం గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. బతకడం కోసం ఏదైనా చేయాలి. నా జీవితం సినిమాలతో ముడిపడింది. నేను ఫలానా సినిమాలు చేయాలని ఎప్పుడూ అనుకోలేదు. ఏది వస్తే అది చేశాను. బేసిక్‌గా మధ్యతరగతి కుటుంబానికి చెందినవాణ్ణి. అప్పట్లో కాఫీ తాగడానికి కూడా డబ్బులు లేక ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకుని తాగేవాణ్ణి. ఆ షేరింగ్‌లో ఎంతో ఆనందం ఉంటుంది. కానీ, ఆ మూమెంట్‌ని నేను ఎంజాయ్ చేయలేదు. ‘మన దగ్గర ఏమీ లేదే’ అని బాధపడేవాణ్ణి. ఇప్పుడన్నీ ఉన్నాయి. కానీ, ఇంకా ఏదో కావాలి? అని ఉంటుంది. జీవితం అంతే. ఉన్నదాంతో సంతృప్తిపడక ఇంకా ఏదో ఎదురు చూస్తాం. ఎక్కడో చోట ఆగాలి కదా. నేను ఆగాను. ఎందుకంటే, ‘ఎక్స్‌పెక్టేషన్ ఈజ్ ఇన్‌జ్యూరి యస్ టు హెల్త్’ అని ఓ సామెత ఉంది. ఆ ఇన్‌జ్యురీస్ నాకొద్దు.
 ***     స్థిత ప్రజ్ఞత అంటారు. ప్రస్తుతం మీ స్థితి అదే అనిపిస్తోంది. పరాజయాలకు చలించరనుకోవచ్చా?
 మంచి ప్రశ్న. ఒకప్పుడు నేను సక్సెస్ గురించి టూ మచ్‌గా ఆలోచించేవాణ్ణి. సక్సెస్‌ను విపరీతంగా ఎంజాయ్ చేసేవాణ్ణి. కానీ, ఈ సక్సెస్ శాశ్వతం కాదని తెలుస్తోంది. ‘ఈ విజయం నాది కాదు.. ఏదో జరిపిస్తోంది. జరుగుతున్నదంతా డ్రామా. దాంతో పాటే వెళ్లిపోవాలి. మనం ‘నథింగ్’ అని తెలుసుకున్నాను. ఆ ‘నథింగ్’ అనే ఫీలింగ్ మీకు ఎప్పుడొస్తే, అప్పుడు ‘యు ఆర్ ఎవ్రిథింగ్’ అని అర్థం. అప్పుడు మీరు చాలా హ్యాపీగా ఉంటారు. ‘అయామ్ సమ్‌థింగ్’ అనుకుంటే ‘దెన్ ది ట్రబుల్ స్టార్ట్స్’.
 ***     ఆఫ్ట్రాల్ మనం మనుషులం. ఆకర్షణీయమైన వాటి పట్ల ఆకర్షితులం కావడం సహజం కదా?
 అవును. చాలా సహజం. కానీ, ఆకర్షణీయమైన వాటి పట్ల ఆకర్షితుణ్ణి కావడం అనే విషయాన్ని నేను ‘స్విచాఫ్’ చేసేశాను. ఈ దశ చాలా ఎంజాయబుల్‌గా ఉంది.
 ***     ఇతరులను కేర్ చేయరా?
 ‘ఐ రెస్పెక్ట్ ఎవిరీబడీ... బట్ ఐ డోంట్ కేర్ ఎనీ బడీ’ అని రజనీకాంత్ ఓ సందర్భంలో అన్నారని తెలిసింది. కేర్ అంటే.. మీ నుంచి దూరంగా వెళ్లాక కూడా మీ గురించి ఆలోచించడం. కానీ, అది రియాల్టీ కాదు. మీరు నా కళ్లెదుట ఉన్నప్పుడు మిమ్మల్ని గౌరవించాలి. మీలో దేవుణ్ణి చూడాలి. ఎందుకంటే, ఈ మూమెంట్ నిజం. సో.. రెస్పెక్ట్ కరెక్టా? కేర్ కరెక్టా?
 ***     దేవుడికి, మీకు ఉన్న రిలేషన్‌షిప్ గురించి తెలుసుకోవాలని ఉంది?
 చాలా పెద్ద ప్రశ్న. సముద్రం నుంచి ఒక నీటిబొట్టును తీసి, అది కేవలం నీటిబొట్టు అనుకుంటే అలానే అనిపిస్తుంది. కానీ, సముద్రంలోంచి తీసిన ఆ నీటిబొట్టుకి సముద్రంలో ఉండే నీటి బొట్టుకి తేడా ఉండదు. సో.. ఆ నీటిబొట్టు కూడా సముద్రమే. మనిషికీ, దేవుడికీ ఉన్న బంధం చెప్పాలంటే, మనందరం ఆ భగవంతుడిలో భాగమే. ఆ దేవుడు, మనం వేరు కాదని నా ఫీలింగ్.
 ***     అంటే...  మిమ్మల్ని మీరు ఆ దేవుడిలా భావిస్తారా?
 అవును. సముద్రంలోంచి తీసిన నీటిబొట్టులో సముద్ర లక్షణాలన్నీ ఉంటాయి. అలాగే మనం కూడా. ఆ దేవుణ్ణుంచి మనం వచ్చాం. ఆ లక్షణాలన్నీ మనలో ఉంటాయి. అందుకే ‘నేను దేవుణ్ణి కాదు’ అని ఎవరమూ అనలేం.
 ***     అసలు దేవుడంటే మీ దృష్టిలో ఏంటి?
 ‘ఇదిగో ఈ ప్రెజెంట్ మూమెంట్’నే దేవుడు అంటాను. ఈ క్షణాలను ఎంజాయ్ చేస్తాను. కానీ, మనం ఎప్పుడూ పూర్తిగా ప్రెజెంట్‌లో ఉండం. అంతకు ముందు జరిగినవాటి గురించో, భవిష్యత్తులో జరగబోయే వాటి గురించో ఆలోచిస్తుంటాం. కానీ, ఇప్పుడు జరుగుతున్న విషయాలు నిజం. ఈ రియాల్టీయే గాడ్. అందుకే నేనెప్పుడూ ఆ దేవుడితోనే ఉంటాను.
 ***     మీ మాటలను బట్టి మీరు ‘సోల్ సెర్చింగ్’ (ఆత్మాన్వేషణ) చేస్తుంటా రని అనిపిస్తోంది. అలా ఆత్మాన్వేషణలో నిమగ్నమయ్యేవాళ్లకి బాహ్య ప్రపంచంలోని అశాశ్వత అంశాల మీద ఆసక్తి ఉండదట?
 ఎస్.. ఆత్మాన్వేషణ చేస్తా. అలాగని బాహ్య ప్రపంచం మీద ఇంట్రస్ట్ లేదని కాదు. సోల్ సెర్చింగ్ అంటే అన్నీ త్యజించడం కాదు. సోల్ సెర్చింగ్ అంటే జీవితం అనే ఈ డ్రామాను ఎంజాయ్ చేయడం. ‘బాహ్య ప్రపంచంలో ఏమీ లేదు.. అంతా వేస్ట్’.. అనుకుంటే అది నెగటివ్ మెంటాల్టీ. ఇప్పుడున్నదంతా సూపర్ అని నేననుకుంటా. ఎందుకంటే, ఇది రియాల్టీ. దీన్ని ఆస్వాదించాలి.
 
 ***     మీ సినిమాలు కుండబద్దలు కొట్టినట్లుగా ఉంటాయి... సబ్జెక్ట్‌లో కూడా డెప్త్ ఉంటుంది. సొసైటీ మీద ఏమైనా ఫ్రస్ట్రేషన్ ఉందా?
 అది అందరికీ ఉంటుంది. ఉదాహరణకు మీరు ఫారిన్ వెళ్లారనుకోండి.. అక్కడ రోడ్లన్నీ క్లీన్‌గా ఉండటం చూసి, మన దేశం ఇలా ఎందుకు ఉండకూడదు? అనుకునే అవకాశం ఉంటుంది. అలాంటి ఒక ఆలోచనకు రూపమే నేను చేసిన ‘సూపర్’ చిత్రం. నేను చదివే పుస్తకాలు కూడా నా మీద చాలా ప్రభావం చూపుతుంటాయి.
 ***     ఎలాంటి పుస్తకాలు చదువుతారు?
 జిడ్డు కృష్ణమూర్తిగారి పుస్తకాలు చదువుతాను. ఆయన పుస్తకాల్లో చాలా డెప్త్ ఉంటుంది.
 ***     రియాల్టీని ఆస్వాదించడమంటే... కష్టాలొచ్చినప్పుడు కూడా సంతోషంగా ఉండాలా?
 అఫ్‌కోర్స్.. ‘అవుట్ సైడ్ ఫోర్సెస్’ మన మీద ప్రభావం చూపుతుంటాయి. కానీ, ఇది కూడా ఓ డ్రామా.. ఈ డ్రామాకి కూడా ముగింపు ఉంటుందని అర్థం చేసుకుని బతకగలిగితే ఈ మూమెంట్‌లో కష్టం వచ్చినా ఎంజాయ్ చేయగలుగుతాం.
 ***     ఆత్మాన్వేషణ... ఆధ్యాత్మిక బాట.. ఇలాంటి విషయాల పట్ల మనసు మళ్లడం అంటే అంత సులువు కాదు. కానీ, వీటిపై ఆకర్షితులైనవాళ్లు మెల్లి మెల్లిగా ఇక సన్యాసులుగా మారిపోతారనే ఫీలింగ్ ఉంటుంది. మరి భవిష్యత్తులో మీరు?
 నాకు భార్య, పిల్లలు ఉన్నారు. వాళ్లను వదిలి ఎక్కడికి వెళతాను! ‘నేను’ అంటే ఏంటి? అని తెలుసుకోవాలన్నదే నా తాపత్రయం. (నవ్వుతూ...) ఇన్నర్ సెర్చ్ చేసుకున్నంత మాత్రాన సన్యాసులుగా మారతాం అనడానికి లేదు.
 - డి.జి. భవాని
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement