
గంజాయి తోటల నేపథ్యంగా సురావళి
తమిళసినిమా: గంజాయి తోటల నేపథ్యంగా తెరకెక్కనున్న చిత్రం సురావళి. సాధారణంగా మలయాళ చిత్ర దర్శకులకు తమిళంలో చిత్రాలు చేయాలన్న ఆసక్తి మెండుగా ఉంటుంది. అలా ఇప్పటికే పలువురు మలయాళ దర్శకులు తమిళంలో చిత్రాలు చేసి విజయం సాధించారు. ఆ కోవలోకి కుమార్‌నందా చేరుతున్నారు. మలయాళంలో కొట్టారత్తిల్ కుట్టి భూతం, ముళ్లచేరి మాధవన్ కుట్టి నెమం పీఓ వంటి చిత్రాలను తెరకెక్కించిన ఈయన తాజాగా ప్రముఖ మలయాళ బుల్లితెర నటి ప్రత్యూష జీవిత కథతో తమిళంలో అగధి పేరుతో చిత్రం చేస్తున్నారు.
ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం అవుతోంది. తాజాగా మరో చిత్రానికి రెడీ అవుతున్నారు. దీనికి సురావళి అనే పేరును నిర్ణయించారు. గోల్డెన్ వింగ్స్ పతాకంపై శ్యామ్‌మోహన్ నిర్మిస్తున్న ఇందులో తొట్టాల్ తొడరుమ్ చిత్రం ఫేమ్ తమన్‌కుమార్, పట్టాదారి చిత్రం ఫేమ్ అభిశరవణన్ కథానాయకులుగా నటించనున్నారు. మనీషాజిత్ కథానాయకిగా నటించనున్న ఈ చిత్రాన్ని రామ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇది గంజాయి ముఠాకు, వారిని పట్టుకోవాలనే పోలీసులకు మధ్య జరిగే ఆసక్తికరమైన అంశాలతో కూడిన చిత్రంగా ఉంటుందని దర్శకుడు తెలిపారు. చిత్ర షూటింగ్‌ను ఈ నెల 15వ తేదీ నుంచి కేరళలోని దట్టమైన అడవుల్లో చిత్రీకరించనున్నట్లు దర్శకుడు కుమార్‌నందా వెల్లడించారు.