సినిమా: కాస్త అలాంటి పాత్రలివ్వండయ్యా అని రిక్వెస్ట్ చేస్తోంది నటి వసుంధర. పేరాన్మై చిత్రంలో ఐదుగురు యువ కథానాయికల్లో ఒకరిగా నటించిన ఈ అమ్మడు గుర్తుందా? ఈ మధ్య కోలీవుడ్‌కు కాస్త దూరంగా ఉన్న ఈ అమ్మడు సుమారు ఎనిమిదేళ్ల తరువాత మళ్లీ తమిళ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అవును పేరాన్మై చిత్రం తరువాత తెన్‌మేర్కు పరువకాట్రు చిత్రంతో సోలో హీరోయిన్‌గా నటించి మంచి పేరు తెచ్చుకున్న వసుంధర దర్శకుడు ఎస్‌పీ.జననాథన్, సముద్రకని, శీనూ రామస్వామి వంటి ప్రముఖ దర్శకులతో కలిసి పనిచేసింది. ఇప్పుడు శీనూరామస్వామి దర్శకత్వంలో ఉదయనిధిస్టాలిన్, తమన్నా జంటగా నటించిన కన్నె కలైమానే చిత్రంలో ఒక ప్రధాన పాత్రలో నటించింది. ఈ చిత్రం రేపు (శుక్రవారం) తెరపైకి రానుంది. ఈ సందర్భంగా వసుంధరతో చిన్న చిట్ చాట్. ఇంత గ్యాప్ రావడానికి కారణం ఏమిటన్న ప్రశ్నకు ఈ బ్యూటీ బదులిస్తూ కన్నె కలైమానే చిత్రంలో దర్శకుడు శీనూరామస్వామి నాకు చాలా మంచి పాత్రను ఇచ్చారు. ఎప్పుడూ ఆయన చిత్రాల్లో అందరికీ ఇష్టమైన, కొంచెం హాస్యంతో కూడిన, అదే సమయంలో కాస్త కఠినమైన గ్రామీణ యువతి పాత్ర ఒకటుంటుంది. అలాంటి పాత్రనే నేనీ చిత్రంలో నటించాను. ఆ పాత్రను తయారు చేసినప్పుడే నా రూపం మదిలో మెలిగిందని దర్శకుడు శీనూరామస్వామి చెప్పారు. ఇందులో ఉదయనిధిస్టాలిన్ స్నేహితురాలిగా నటించాను.
పెద్ద కుటుంబానికి చెందిన అబ్బాయినన్న ఎలాంటి గర్వం లేకుండా మసలుకునే నటుడు ఉదయనిధిస్టాలిన్. ఇక తమన్నాతో కొన్ని సన్నివేశాల్లోనే కలిసి నటించినా అది సరికొత్త అనుభవం. ఈ చిత్రంతో పాటు వాళ్గ వ్యవసాయి అనే చిత్రంలో నటిస్తున్నాను. ఇందులోనూ గ్రామీణ యువతిగానే కనిపిస్తాను. రాజపాలైయంకు చెందిన మోహన్ అనే నవ దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఒక పక్క నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నా, మరో పక్క రైతుల ఆత్మహత్యలకు కారణం ఏమిటన్న ఇతివృత్తంతో తెరకెక్కుతున్న చిత్రం ఇది. అదేవిధంగా బక్రీద్ చిత్రంలోనూ నటిస్తున్నాను. ఇందులో విక్రాంత్‌కు భార్యగా గ్రామీణ యువతిగానే కనిపిస్తాను. ఒంటె ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తొలి భారతీయ చిత్రం ఇదేనని చెప్పచ్చు. ఇందులో చాలా తక్కువ మేకప్‌తో సహజత్వంతో కూడిన పాత్రలో నటిస్తున్నాను. పెద్ద పెద్ద దర్శకుల చిత్రాల్లో నటించి మధ్యలో గ్యాప్ రావడానికి కారణం ఏమిటని చాలా మంది అడుగుతున్నారు.
అందుకు నేను చెప్పేదొక్కటే దేనికైనా టైమ్ రావాలి. ప్రారంభదశలో కమర్శియల్ చిత్రాలు వద్దు, నటనకు అవకాశం ఉన్న పాత్రల్లో నటిస్తే చాలని భావించాను. దర్శకుడు శీనూరామస్వామి కూడా నీకు సంతృప్తినిచ్చే, ఏళ్లు గడిచిన తరువాత కూడా నువ్వు గర్వపడేలాంటి పాత్రలను ఎంచుకుని నటించు అని సలహా ఇచ్చారు. మరో విషయం ఏమిటంటే చాలా మంది దర్శకులు కథలు చెప్పినప్పుడు గ్రామీణ యువతి పాత్రలనే చెప్పడంతో వాటిని అంగీకరించలేదు. ఆహా సూపర్ పాత్ర. ఎప్పుడు అందులో నటిద్దామా అన్న ఆసక్తిని పెంచే అవకాశం రాలేదు. నేను తమిళ అమ్మాయిని కావడంతో ఏమో గ్రామీణ పాత్రల్లో మీరు బాగా నటిస్తున్నారు అంటూ అలాంటి ముద్ర వేశారు. కాగా అలా సినిమాలకు దూరం అవడంతో నన్ను మరచిపోతారన్న ఆలోచన ఆరంభంలో కలగలేదు. ఇప్పుడు అది నిజం అనిపిస్తోంది. ఇకపై వరుసగా నా చిత్రాలు చూసా ్తరు. అయితే దర్శక నిర్మాతలను నేను కోరుకునేదొక్కటే కాస్త మోడ్రన్ పాత్రలు ఇవ్వండయ్యా అనే. కొత్త దర్శకులు మంచి కథలతో వస్తే పా రితోషికం గురించి పట్టించుకోను అని నటి వసుంధర పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment