'ప్లీజ్.. ఆ సినిమా చూడొద్దు!'
చెన్నై : రాంగోపాల్‌వర్మ 'విల్లాది విల్లన్ వీరప్పన్' చిత్రాన్ని తమిళ ప్రజలెవ్వరూ చూడవద్దని, ఆ చిత్రాన్ని బహిష్కరించాలని చందనపు దొంగ వీరప్పన్ సతీమణి ముత్తులక్ష్మి విజ్ఞప్తి చేశారు. తన భర్త గురించి ఆయనకు ఏం తెలుసని, ఇష్టం వచ్చినట్టు కథలను అల్లుకుంటున్నారని వర్మపై మండిపడ్డారు. దర్శకుడు రాంగోపాల్‌వర్మ తెరకెక్కించిన వీరప్పన్ జీవిత కథ తమిళంలో విల్లాది విల్లన్ వీరప్పన్‌గా శుక్రవారం తమిళనాట విడుదలైంది. అయితే ఈ చిత్రం విడుదలను వ్యతిరేకిస్తూ వీరప్పన్ సతీమణి ముత్తులక్ష్మి శుక్రవారం మీడియా ముందుకు వచ్చారు.
ఆ చిత్రాన్ని ఎవ్వరూ చూడవద్దు అని, అందులోని కథ వీరప్పన్ జీవితానికి పూర్తి భిన్నంగా ఉందని ధ్వజమెత్తారు. వీరప్పన్ జీవితం ఇతివృత్తంగా హిందీలో సినిమా తీస్తున్నట్టు తనతో చెప్పిన రాంగోపాల్ వర్మ, ఇప్పుడు అన్ని భాషల్లో తన అనుమతి లేకుండా విడుదల చేస్తున్నారని ఆరోపించారు. వీరప్పన్ వ్యక్తిగత జీవితం గురించి తనకు తప్ప మరెవ్వరికీ తెలియదని, ఆయన అజ్ఞాతంలో ఉన్నా ఏ తప్పు చేయలేదని వ్యాఖ్యానించారు. లాస్ట్ ఎన్‌కౌంటర్ పేరుతో ఐపీఎస్ అధికారి విజయకుమార్ పుస్తకం రచిస్తున్నట్టు సమాచారం వచ్చిందని, అందులో తన భర్తను ఎలా చంపాడో వివరించే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు.