లక్నో: ఎన్ఐఏ అధికారి తంజిల్ అహ్మద్ హత్యకేసుకు సంబంధించి ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. తంజిల్ హత్యకేసులో శనివారం జైనుల్, రీయాన్ను అదుపులోకి తీసుకున్నట్లు బిజ్నూర్ జోన్ ఐజీ విజయ్ కుమార్ మీనా తెలిపారు. కాగా ఈ కేసులో ప్రధాన నిందితుడు మునీర్ మాత్రం పరారీలోనే ఉన్నాడు. అతనిపై రూ.50వేల రివార్డు కూడా ఉంది.
పఠాన్ కోట్ ఉగ్రదాడి కేసు దర్యాప్తు అధికారిగా ఉన్న మొహమ్మద్ తంజీల్ అహ్మద్ ఈ నెల 4వ తేదీన స్వగ్రామంలో జరిగిన వివాహానికి హాజరై కుటుంబంతో సహా కారులో తిరిగివస్తుండగా బిజ్నూర్ సమీపంలో దుండగులు అతణ్ని కాల్చిచంపిన సంగతి తెలిసిందే. 24 బుల్లెట్లు దూసుకెళ్లడంతో తంజీల్ అక్కడికక్కడే మరణిచారు. అతని పక్కసీట్లో కూర్చున్న భార్య ఫాతిమాకు నాలుగు బుల్లెట్లు తగిలాయి. ప్రస్తుతం ఆమె ఎయిమ్స్లో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.