న్యూఢిల్లీ/లక్నో: రైల్వేశాఖను వరుస ప్రమాదాలు వెంటాడుతున్నాయి. దేశవ్యాప్తంగా 12 గంటల వ్యవధిలో దాదాపు నాలుగు రైలు ప్రమాదాలు చోటుచేసుకోగా వీటిలో 7 మంది ప్రాణాలు కోల్పోయారు. 11 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఈ నాలుగు రైలు ప్రమాదాల్లో మూడు ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకోగా, మరొకటి ఒడిశాలో జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని అమేథీలో గురువారం సాయంత్రం 7.19 గంటల సమయంలో ఓ బొలేరో వాహనాన్ని లోకల్ రైలు సిబ్బంది లేని లెవల్‌క్రాసింగ్ వద్ద ఢీకొన్న ఘటనలో నలుగురు అక్కడికక్కడే చనిపోగా, ఇద్దరికి గాయాలయ్యాయి.
మరో ఘటనలో గోవా నుంచి పట్నా వెళుతున్న వాస్కోడిగామా ఎక్స్‌ప్రెస్ యూపీలోని చిత్రకూట్ జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున పట్టాలు తప్పడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, 9 మంది గాయపడ్డారు. మరోవైపు శుక్రవారం జమ్మూ నుంచి పట్నా వెళుతున్న అర్చనా ఎక్స్‌ప్రెస్ ఇంజిన్ రెండు సార్లు బోగీల నుంచి విడిపోయింది. దీంతో అధికారులు మరో ఇంజిన్‌ను అర్చనా ఎక్స్‌ప్రెస్‌కు అమర్చారు. ఇక ఒడిశాలో శుక్రవారం ఉదయం 6 గంటల సమయంలో పారాదీప్–కటక్ గూడ్స్ రైలు గోరఖ్‌నాథ్ రఘునాథ్‌పూర్ ప్రాంతాల మధ్య పట్టాలు తప్పింది.
Comments
Please login to add a commentAdd a comment