ఏడుగురి ప్రాణాలు తీసిన అతివేగం
ముంబై :
అతివేగం ఏడుగురు వ్యక్తుల ప్రాణాలు తీసింది. రత్నగిరి జిల్లాలో ముంబై-గోవా జాతీయ రహదారిపై బుధవారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ముంబై నుంచి గోవా వైపు వెళుతున్న గ్జైలో కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముంబైకి చెందిన ఏడుగురు మృతిచెందగా, మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. రత్నగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని కనూ గ్రామ సమీపంలో ఈ సంఘన చోటు చేసుకుంది.
డ్రైవర్ అతివేగంగా కారును నడపడం వల్లే కంట్రోల్ చేయలేకపోవడంతో రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టాడని పోలీసులు తెలిపారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు హుటాహుటిన సహాయకచర్యల్లో పాల్గొన్నారు. అయితే ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురు రత్నగిరి సివల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. మృతిచెందిన వారిలో ప్రశాంత్ గౌరవ్, సచిన్ సావంత్, అక్షయ్ కారేకర్, మయూర్ పెద్నేకర్, నిహాల్ కోలేకర్, కేదార్ కోలేకర్, వైభవ్ మానవెలు ఉన్నారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ మరో వ్యక్తి చికిత్స అందిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.