సాక్షి, ముంబై : హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం నడిపేవారు సత్మాత్ జాగ్రత్త! ఎవరైతే ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిస్తారో ముఖ్యంగా హెల్మెట్ ధరించని వారిపై నగర ట్రాఫిక్ పోలీసులు ఇక మీదట కఠినంగా వ్యవహరించనున్నారు. నారిమన్ పాయింట్‌లో ఇటీవల నలుగురు వ్యక్తులు బైక్‌పై వెళుతూ బెస్ట్ బస్సును ఢీకొట్టారు. దీంతో బైక్‌ను నడిపిన వ్యక్తి మరణించగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే వీరిలో ఎవ్వరూ కూడా హెల్మెట్ ధరించలేదు.
దీంతో హెల్మెట్ ధరించని ద్విచక్ర వాహనదారులపై కఠన చర్య తీసుకునేందుకు ట్రాఫిక్ అధికారులు నిర్ణయించారు. ఈ సందర్భంగా జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ బి.కె.ఉపాధ్యాయ మాట్లాడుతూ.. ఈ ప్రత్యేక డ్రైవ్‌లో పాదచారుల భద్రతను దృష్టిలో ఉంచుకొని నిబంధనలు పాటించని వారిపై కఠినంగా వ్యవహరించనున్నట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది జూలైలో హెల్మెట్ ధరించని 1.6 లక్షల ద్విచక్ర వాహనదారుల నుంచి రూ.1.19 కోట్లను జరిమానా రూపంలో విధించి వసూలు చేశామన్నారు.
ఈ డ్రైవ్‌లో తప్పుడు మార్గంలో బైక్‌ను నడిపినా, హెల్మెట్ ధరించకపోయినా వారికి జరిమానా విధించనున్నట్లు స్పష్టం చేశారు. ఇవేకాకుండా ఈసారి అదనంగా జీబ్రా క్రాసింగ్ వద్ద వాహనం నిలిపిన బైకులపై కూడా కేసు నమోదు చేయనున్నామని ఆయన చెప్పారు. వేగంగా వాహనం నడిపినా, సిగ్నల్ జంప్ చేసినా ఇకమీదట కేసులు నమోదు చేయనున్నామని ఆయన వివరించారు.
అంతేకాకుండా రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు పోలీసులను కూడా ఆయా రోడ్లపై మోహరించనున్నట్లు అడిషినల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) క్వైజర్ ఖలీద్ పేర్కొన్నారు. రోడ్డు భద్రతపై కూడా నగర వాసుల్లో అవగాహన కల్పిస్తున్నామన్నారు. ముఖ్యంగా కార్యాలయ పని గంటలు ముగిసిన వెంటనే చాలా మంది బైకులపై అతి వేగంగా వెళ్లి పాదచారుల ప్రాణాలతో చలగాటం ఆడుతున్నారన్నారు. ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించే పోలీసులపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఉపాధ్యాయ తెలిపారు.
హెల్మెట్ లేకపోతే కేసే..!
Published Thu, Sep 18 2014 12:18 AM | Last Updated on Sat, Sep 2 2017 1:32 PM
Advertisement