‘వధ’కు చెక్‌ | Centre bans sale of cows for slaughter at animal markets | Sakshi
Sakshi News home page

‘వధ’కు చెక్‌

Published Sat, May 27 2017 12:58 AM | Last Updated on Tue, Sep 5 2017 12:03 PM

‘వధ’కు చెక్‌

‘వధ’కు చెక్‌

సంతల్లో ఆవు, గేదె, ఎద్దు, ఒంటెల్ని కబేళాలకు అమ్మకూడదు, కొనకూడదు
గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసిన కేంద్రం

కేవలం వ్యవసాయ అవసరాల కోసమే పశువుల క్రయవిక్రయాలు
ఆ మేరకు ధ్రువీకరణ పత్రాలు సమర్పిస్తేనే అనుమతి
విక్రయాలపై పశువుల సంత కమిటీల నిరంతర పర్యవేక్షణ
దూడలు, వట్టిపోయిన పశువుల విక్రయంపై నిషేధం

న్యూఢిల్లీ
సంతల్లో పశువులను కొని కబేళాలకు తరలించడం ఇక కుదరదు! కేవలం వ్యవసాయ అవసరాల కోసం మాత్రమే సంతల్లో పశువుల క్రయవిక్రయాలు సాగాలి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పశువుల క్రయవిక్రయాలపై పలు నిబంధనలు విధిస్తూ కేంద్ర పర్యావరణ శాఖ శుక్రవారం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీచేసింది. దేశ వ్యాప్తంగా జంతు మాంస పరిశ్రమపై పెను ప్రభావం చూపే ఈ నోటిఫికేషన్‌ ప్రకారం.. పశువుల విక్రయం సమయంలో తాను వ్యవసాయ దారుడినని రుజువు చేసుకునేలా కొనుగోలు దారుడు ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలి. ‘దేశవ్యాప్తంగా బహిరంగ మార్కెట్లలో కబేళాల కోసం ఆవులు (వయసులో ఉన్నవి, దూడలు సహా), గేదెలు, ఎద్దులు, ఒంటెల్ని అమ్మడం, కొనడం నిషేధం. జంతువుల పట్ల క్రూరత్వ నిరోధక చట్టం–2017(పశువుల సంతల నియంత్రణ)లోని నిబంధనల మేరకు ఈ ఆదేశాల్ని జారీ చేస్తున్నాం. ఇవి తక్షణం అమల్లోకి వస్తాయి’ అని పర్యావరణ శాఖ స్పష్టంచేసింది. పశువధపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యక్షంగా ఎలాంటి నిషేధం విధించక పోయినా.. తాజా నిబంధనలు మాత్రం ఆ స్థాయిలో పశు వర్తకులకు నష్టం కలించవచ్చని నిపుణులు భావిస్తున్నారు.

కొనడం అంత ఈజీ కాదు..
కేంద్ర పర్యావరణ శాఖ నోటిఫికేషన్‌ ప్రకారం.. కేవలం వ్యవసాయ అవసరాల కోసమే పశువుల్ని అమ్ముతున్నామని, కబేళాల కోసం కాదని స్పష్టం చేస్తూ అమ్మకందారు సంతకం చేసిన లిఖితపూర్వక ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. తన పేరు, చిరునామా సహా ఇతర వివరాల్ని స్పష్టంగా పేర్కొనాలి. ఫొటో ధ్రువీకరణ పత్రం కాపీని కూడా జత చేయాలి. పశువుల కొనుగోలుదారులు కూడా వాటిని కబేళాలకు తరలించేందుకు కాదంటూ హామీ పత్రం సమర్పించాలి. పశువుల కొనుగోలు వ్యవసాయ అవసరాల కోసమేనని, కబేళాల కోసం కాదని పశువుల సంత నిర్వహణ కమిటీలు ధ్రువీకరించాలి. కొనుగోలుదారుడు తీసుకొచ్చిన ధ్రువీకరణ పత్రాన్ని పరిశీలించి అతను వ్యవసాయదారుడేనని కమిటీలు నిర్ధారించుకోవాలి.

మరికొన్ని నిబంధనలు
1. పశువుల సంత నిర్వహణ కమిటీ పశు విక్రయాలకు సంబంధించిన రికార్డులు నిర్వహించాలి. దాదాపు ఆరు నెలల రికార్డులు అందుబాటులో ఉంచాలి.
2. అనుమతి లేకుండా పశువుల కొనుగోలుదారులు వేరే రాష్ట్రంలో వాటిని విక్రయించకూడదు.
3. వయసులో ఉన్న పశువు, ఎలాంటి ప్రయోజనం లేని పశువులు సంతకు రాలేదన్న విషయాన్ని పశువుల సంత కమిటీకి చెందిన సభ్య కార్యదర్శి నిర్ధారించుకోవాలి.
4. పశువు విక్రయానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రం ఐదు కాపీల్ని.. స్థానిక రెవెన్యూ అధికారి, పశు వైద్యుడు, పశువుల మార్కెట్‌ కమిటీకి సమర్పించాలి. కొనుగోలుదారుడు, అమ్మకందారుడు తమ వద్ద ఒక్కో కాపీని ఉంచుకోవాలి.

జంతు మాంసం పరిశ్రమకు దెబ్బే..
కేంద్రం నిర్ణయంతో దేశంలోని రూ.లక్ష కోట్ల విలువైన జంతు మాంసం, దాని అనుబంధ ఉత్పత్తుల మార్కెట్లపై ప్రభావం చూపనుంది. ఎందుకంటే ఆ మార్కెట్లకు అవసరమైన 90 శాతం ముడిసరుకు పశువుల సంతల నుంచే సరఫరా అవుతోంది. ఈ కొత్త నిబంధనలు పశువుల సంతల్లో ఎక్కువ లావాదేవీలు జరిపే ముస్లిం వర్తకులపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. అనారోగ్యంతో ఉన్న, ఉపయోగం లేని పశువుల అమ్మకంతో వచ్చే ఆదాయం మార్గం కోల్పోవడం వల్ల రైతులు కూడా ప్రభావితం అవుతారని భావిస్తున్నారు. పశువుల వర్తకుల్లో ఎక్కువ శాతం పేదలు, నిరక్షరాస్యులేనని, కొత్త నిబంధనలతో ధ్రువీకరణ పత్రాలు సమర్పించడం, కార్యాలయాల చుట్టూ తిరగడం తలకు మించిన భారమేనన్నది కొందరు నిపుణుల అంచనా.

జంతు సంక్షేమం కోసమే..: పర్యావరణ శాఖ
జంతు సంక్షేమం కోసమే ఈ నోటిఫికేషన్‌ జారీ చేసినట్లు కేంద్ర పర్యావరణ శాఖ సీనియర్‌ అధికారి ఒకరు పేర్కొన్నారు. ప్రస్తుతం పశువుల బహిరంగ మార్కెట్లలో.. పాడి, వ్యవసాయ అవసరాలతో పాటు, కబేళాల కోసం పశువుల్ని విక్రయిస్తున్నారని, అనేక మంది అమ్మకందారులు, కొనుగోలుదారులు ఉండడంతో.. ఏ ప్రయోజనం కోసం అమ్ముతున్నారో తెలియడం లేదని కేంద్ర జంతు సంక్షేమ విభాగం లీగల్‌ సబ్‌ కమిటీ మాజీ సభ్యుడు ఎన్‌జీ జయసింహ అన్నారు. వ్యవసాయ అవసరాల కోసం పశువులు ఉపయోగపడడం లేదన్నారు. కేంద్రం తాజా నిర్ణయాన్ని సమర్థించారు.

పశువుల సంతలపై నియంత్రణ కోసమే: హర్షవర్ధన్‌
పశువుల సంతలు, గోమాంస విక్రయాలపై నియంత్రణ కోసమేనని కొనుగోలు, అమ్మకంపై ఆంక్షలు విధించామని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి హర్షవర్ధన్‌ తెలిపారు. జిల్లా స్థాయిలో పశువుల సంతల పర్యవేక్షణ కమిటీలు, స్థానిక పశువుల సంతల కమిటీల కోసమే ఈ నిబంధనలు జారీ చేశామని, అయితే పశువుల్ని కబేళాలకు తరలించేందుకు తీసుకురాలేదని కొనుగోలు, అమ్మకందారుల హామీ ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్రస్థాయిలో ప్రభుత్వ నియంత్రణను, జంతుహింస నియంత్రణ ఉద్యమాన్ని బలోపేతం చేయడం కోసమే ఈ నిబంధనలు జారీచేశామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement