
గోమాంస నిషేధంపై గందరగోళం
పశువులను కబేళాలకు తరలించకుండా నిరోధించేందుకు కేంద్రం తీసుకొచ్చిన కొత్త ఆంక్షలపై కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు భగ్గుమంటున్నాయి. కేంద్రం సమాఖ్య స్ఫూర్తిని మంటకలుపుతోందని మండిపడుతున్నాయి. దీనికి కేంద్ర పర్యావరణ శాఖ వివరణ ఇస్తూ ఆహారం కోసం జంతువులను హతమార్చడాన్ని నిషేధించలేదని, జంతువులను హింస నుంచి రక్షించే చట్టం కిందనే ఆంక్షలు తీసుకొచ్చామని, అందుకని సమైక్య స్ఫూర్తిని దెబ్బతీయలేదని స్పష్టం చేశారు.
పశుమాంసం క్రయ, విక్రయాలపై, కబేళాలకు పశువుల అమ్మకాలపై నిషేధం విధిస్తూ చట్టాలు తెచ్చే హక్కు రాష్ట్రాలకు మాత్రమే ఉంది. అందుకే బీజేపీ తాను అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో గోమాంస నిషేధ చట్టాలను తెచ్చింది. దేశవ్యాప్తంగా ఈ గోమాంస విక్రయాలను నిరోధించేందుకు కేంద్రం జంతువులను క్రూరత్వం నుంచి రక్షించే (ప్రివెన్షన్ ఆఫ్ క్రూయాలిటీ టువర్డ్స్ యానిమల్స్ యాక్ట్) చట్టాన్ని ఆశ్రయించింది. ఆ చట్టంలో 22వ నిబంధన కింద పశువుల సంతలో పశువులను వ్యవసాయ అవసరాల కోసమే తీసుకుంటున్నట్లు కొనుగోలు, విక్రయదారుల నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకోవాలంటూ ఆంక్షలు తీసుకొచ్చారు. అదే చట్టంలోని 11వ సెక్షన్ (ఈ) నిబంధన ప్రకారం అనవసరంగా హింసించనంత కాలం ఆహారం కోసం జంతువులను చంపడం తప్పు కాదని కూడా ఉంది.
చట్టం ఇంత స్పష్టంగా జంతువులను ఆహారం కోసం చంపవచ్చని చెబుతుండగా, కబేళాలకు తరలించరాదనే నిబంధన ఎలా చెల్లుతుంది? చట్టం పశుపక్ష్యాదులన్నింటినీ కలిపి జంతువులుగా పరిగణిస్తే, కొత్తగా విధించిన ఆంక్షల్లో పశువులను మాత్రమే పేర్కొన్నారు. ఇదీ ఎంతవరకు సబబు? దేశవ్యాప్తంగా గోమాంసం నిషేధించాలనే ఆరెస్సెస్ డిమాండ్‌ను అమలు చేయడానికి కేంద్రం అతి తెలివిగా వ్యవహరించడమే ఈ గందరోగోళానికి కారణం.
గోమాంసం నిషేధం, కబేళాల నిషేధం రాష్ట్రాల పరిధిలోని అంశం కావంతో కేంద్రం జంతువులను క్రూరత్వం నుంచి రక్షించే చట్టం నిబంధనలను ఆశ్రయించింది. ఆ చట్టం కింద పశుమాంసం క్రయవిక్రయాలను గానీ, కబేళాలను గానీ నిషేధించే హక్కు లేకపోవడం వల్ల కేంద్రం మధ్యేమార్గాన్ని అనుసరించినట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా కేంద్రమే గోమాంసాన్ని నిషేధించాలంటే రాజ్యాంగ సవరణ చేయాలి. అందుకు బీజేపీ ప్రభుత్వం సిద్ధంగా లేదు. నిషేధం వల్ల వచ్చే పర్యవసనాలను కూడా పరిశీలించాలి. దేశంలో గోమాంసం, దాని సంబంధిత పరిశ్రమలపై ఆధారపడి బతుకుతున్న నాలుగైదు కోట్ల మంది రోడ్డున పడతారని ప్రాథమిక అంచనాలు తెలియజేస్తున్నాయి. యూపీలో మాంసం పరిశ్రమ స్తంభించిపోవడం వల్ల ఏడాదికి 56 వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానాకు నష్టం వాటిల్లుతుందని గణాంకాలు తెలియజేస్తున్నాయి.