ఆ పోలీసు ఒబేసిటీకి చికిత్స | Cop Daulatram gets help from Mumbai doctors | Sakshi
Sakshi News home page

ఆ పోలీసు ఒబేసిటీకి చికిత్స

Published Sat, Feb 25 2017 7:01 PM | Last Updated on Tue, Sep 5 2017 4:35 AM

ఆ పోలీసు ఒబేసిటీకి చికిత్స

ఆ పోలీసు ఒబేసిటీకి చికిత్స

మధ్యప్రదేశ్ : ప్రముఖ వ్యాసకర్త శోభా డే చేసిన వ్యాఖ్యలతో పోలీస్ అధికారికి మంచి రోజులులొచ్చాయి. ఇటీవల భారీకాయుడైన ఓ పోలీసు అధికారిపై ట్వీట్‌ చేసి శోభాడే అందరి ఆగ్రహానికి గురయ్యారు. అయితే, ఆయనకు అవసరమైన చికిత్స జరిపి బరువు తగ్గించేందుకు ముంబైకి చెందిన ఓ ఆస్పత్రి ముందుకు వచ్చింది. ముంబై ఒబేసిటీ అండ్‌ డైజెస్టివ్‌ సర్జరీ సెంటర్‌ సర్జన్‌, లాప్రోస్కోపి నిపుణుడైన డాక్టర్‌ ముఫజల్‌ లక్డావాలా సూచన మేరకు అడ్మినిస్ట్రేటివ్‌ డైరెక్టర్‌ ఫ్లాయిడ్‌ డి సౌజా శనివారం మధ్యప్రదేశ్‌లోని నీముచ్‌లో పనిచేసే పోలీసు అధికారి దౌలత్‌రాం జోగేవాట్‌(58)​ను కలిశారు.

( చదవండి : ఆ ఫొటో ట్వీట్‌పై పోలీసుల ఘాటు రిప్లై! )
 

ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ దౌలత్‌రాంకు తమ ఆస్పత్రిలోనే అవసరమైన పరీక్షలు చేయిస్తామని, దాని ప్రకారం అవసరమైతే శస్త్రచికిత్స లేదా వైద్యసాయం అందజేస్తామని చెప్పారు. దౌలత్‌రాం మాట్లాడుతూ.. శోభాడే కామెంట్స్‌ బాధ కలిగించాయని తీవ్ర విచారం వ్యక్తం చేశారు. 1993లో చేయించుకున్న గాల్‌ బ్లాడర్‌ ఆపరేషన్‌తో శరీరంలో హార్మోన్‌ అసమతుల్యత ఏర్పడి ఊబకాయం వచ్చిందని ఆయన తెలిపారు. బరువు తగ్గటం, విధుల్లో చురుగ్గా పాల్గొనటం కంటే తనకు సంతోషకరమైనది ఏముంటుందని చెప్పారు.

శోభా డే ట్వీట్‌ అనంతరం జిల్లా సూపరింటెంటెంట్‌ మనోజ్‌ కుమార్‌ స్పందిస్తూ పోలీస్‌ సంక్షేమ బోర్డు ద్వారా దౌలత్‌రాం చికిత్సకు అవసరమైన సాయం అందజేస్తామన్నారు. దీంతోపాటు ఇండోర్‌లోని అరబిందో ఆస్పత్రిలో ఉచితంగా చికిత్స చేయిస్తామని పోలీసు శాఖ ఉన్నతాధికారులు హామీ ఇచ్చారు. దౌలత్‌రాం బరువు ప్రస్తుతం 180 కిలోలుగా ఉంది. ఫిబ్రవరి 21వ తేదీన ముంబైలో జరిగిన ఎన్నికల బందోబస్తులో పాల్గొన్న ఓ పోలీసు అధికారి ‘హెవీ బందోబస్త్‌’ అంటూ శోభా డే దౌలత్‌రాం ఫొటోను జత చేసి ట్వీట్‌ చేశారు. దీనిపై నెటిజన్లు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన విషయం తెలిసిందే.

 

Advertisement
Advertisement