పన్ను ఎగవేతదారులు భారత్‌లోనే ఎందుకెక్కువ?
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే ఆర్థికంగా మూడవ బలమైన దేశంగా ఎదుగుతున్న భారత్, పన్ను చెల్లింపుల్లో మాత్రం ఎందుకు వెనకబడి పోయింది. ఉద్యోగులు మినహాస్తే దేశ జనాభాలో ఒక్క శాతం మంది ప్రజలు కూడా ఎందుకు సక్రమంగా పన్నులు చెల్లించడం లేదు? అమెరికా, చైనా దేశాల్లోలాగా భారత్‌లో క్రిమినల్ కేసులు పెట్టకపోవడమే కారణమా? అదే నిజమైతే సివిల్ కేసులను మాత్రమే పెట్టే స్విడ్జర్లాండ్‌లో ఎక్కువ మంది ప్రజలు పన్నులను సక్రమంగా చెల్లిస్తున్నారు? పన్నులు ఎక్కువగా ఉండడం వల్ల చెల్లించలేకపోతున్నారా? అదే నిజమైతే పన్నులు అధికంగా ఉండే స్కాండినేవియన్ దేశాల ప్రజలు ఎక్కువగా ఎందుకు చెల్లిస్తున్నారా? మన దేశంలో పన్ను ఎగవేతదారులు ఎక్కువగా ఉండడానికి ఇతరేతర కారణాలు ఏమైనా ఉన్నాయా?
భారత్‌లో ఆదాయం పన్ను చట్టం కింద క్రిమినల్ కేసులను దాఖలు చేసే అవశాశం ఉన్నప్పటికీ అమెరికా, చైనా దేశాల్లోలాగా కఠిన చట్టాలు లేవు. అమెరికాలో ఆర్థిక నేరానికి 20,30 ఏళ్లు జైలు శిక్షలు విధిస్తుండగా, చైనాలో ఉరిశిక్షలు కూడా విధిస్తారు. అందుకనే మన చట్టాలను కూడా మరింత కఠినతరం చేయాలంటూ అప్పుడప్పుడు అర్థిక నిపుణుల నుంచి ప్రతిపాదనలు వస్తుంటాయి. కఠిన చట్టాల వల్ల ఫలితం పరిమితంగానే ఉంటుందని సామాజిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రజల పట్ల ప్రభుత్వానికి, ప్రభుత్వం పట్ల ప్రజలకు పరస్పరం విశ్వాసం ఉన్నప్పుడే ప్రజలు స్వచ్ఛందంగా పన్నులను నిజాయితీగా చెల్లిస్తారని వారు భావిస్తున్నారు.
వసూలు చేస్తున్న పన్నుల సొమ్మును ప్రజలకు మెరుగైన సౌకర్యాల కోసమే ఖర్చు చేస్తుందా? మనతోపాటు మన తోటి వారు కూడా తమ వాటా పన్నును సక్రమంగా చెల్లిస్తున్నారా? పన్ను వసూళ్ల వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుందా? అన్న మూడు అంశాలపై ఆధారపడి ప్రభుత్వం పట్ల ప్రజలకు విశ్వాసం ఏర్పడుతుంది.
ప్రజలు దశాబ్దాలుగా పన్నులు చెల్లిస్తున్నా రోడ్డు, రవాణా వ్యవస్థ లాంటి మౌలిక సౌకర్యాలు సక్రమంగా లేకపోవడం, ప్రభుత్వ విద్యా, వైద్య రంగం కుదేలవడం, రాజకీయ, అధికార, పోలీసు వ్యవస్థలు అవినీతిమయం అవడం, తమకన్నా ధనవంతులైన తోటివారు పన్నులు ఎగవేయడం, సహేతుకమైన పన్ను లేదా రెవెన్యూ వ్యవస్థ లేకపోవడం వల్ల భారత్ ప్రజలకు ప్రభుత్వం విశ్వాసం పోయింది. స్వచ్చందంగా పన్ను చెల్లించడం మంచిదన్నా భావం లేకుండా పోయింది. ప్రభుత్వం, ప్రజల పట్ల పరస్పర విశ్వాసం బలపడిననాడే పన్నుల వసూళ్లు పెరుగుతాయి. దేశం మరింత అభివృద్ధి చెందుతుంది.