సాక్షి, న్యూఢిల్లీ : ఫ్రాన్స్ లో ఇండియాకు చెందిన 22 మంది మైనర్లు అదృశ్యం కావటం కలకలం రేపుతోంది. పంజాబ్, హర్యానా, ఢిల్లీ తదితర ప్రాంతాలకు చెందిన వారు గత సంవత్సరంలో ముగ్గురు ట్రావెల్ ఏజంట్ల ద్వారా ఫ్రాన్స్ కు వెళ్లారు. వీరంతా నిబంధనలకు విరుద్దంగా అక్కడికి వెళ్లినట్లు.. అందుకుగానూ ట్రావెల్ ఏజంట్లకు ఒక్కోక్కరి నుంచి రూ. 25 లక్షల నుంచి రూ. 30 లక్షలు వసూలు చేసినట్లు తెలుస్తోంది.
తల్లిదండ్రుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సీబీఐ కేసు నమోదు చేయడంతో పాటు ట్రావెల్ ఏజంట్ల కార్యాలయాల్లో సోదాలు నిర్వహించి కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. రగ్బీ కోచింగ్ నిమిత్తం తీసుకెళ్లినట్లు రికార్డుల్లో ఉంది. ఫరీదాబాద్ లోని లలిత్ డేవిడ్, ఢిల్లీలోని సంజీవ్ రాయ్, వరుణ్ చౌదరిలు వీరిని ఫ్రాన్స్ కు పంపారని తేలింది. 13 నుంచి 18 సంవత్సరాల వయసున్న 25 మందిని ఫ్రాన్స్ లో జరిగే రగ్బీ ట్రైనింగ్ క్యాంప్ కోసమని వీసా దరఖాస్తుల్లో ఉంది. వీరిలో 22 మంది ఆచూకీ తెలియరావడం లేదు.
ఈ 25 మందీ పారిస్ వెళ్లారని, ఆపై వారం రోజుల పాటు రగ్బీ క్యాంపులో పాల్గొన్నారని, ఆ తరువాత ట్రావెల్ ఏజంట్లు వారి రిటర్న్ టికెట్లను క్యాన్సిల్ చేశారని, అంతకుముందే ఏదో ప్రమాదం జరగబోతుందని ఊహించి, ఇద్దరు ఇండియాకు వెనక్కు వచ్చారని తెలిపారు. మరో యువకుడు ఫ్రెంచ్ పోలీసులకు పట్టుబడ్డాడని, ఈ విషయం ఫ్రాన్స్ ఇంటర్ పోల్ నుంచి సీబీఐకి సమాచారం అందిందని అన్నారు. మరి మిగతా వారు ఏమయ్యారన్న ఆందోళన ఇప్పుడు వారి తల్లిదండ్రుల్లో నెలకొంది. ఈ విషయాన్ని ఫ్రెంచ్ ఫెడరేషన్ తో చర్చిస్తున్నామని సీబీఐ ప్రతినిధి అభిషేక్ దయాల్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment