నిమిషానికి రూ.29వేలు | Each minute of Parliament in session costs approximately Rs 29,000 | Sakshi
Sakshi News home page

నిమిషానికి రూ.29వేలు

Published Sat, Jul 25 2015 6:38 AM | Last Updated on Sun, Sep 3 2017 6:09 AM

నిమిషానికి రూ.29వేలు

నిమిషానికి రూ.29వేలు

  •  పార్లమెంటు సమావేశానికయ్యే వ్యయం
  •  18 రోజులకు రూ. 35 కోట్లు
  •  నాలుగు రోజులుగా స్తంభించిన ఉభయసభలు
  •  న్యూఢిల్లీ:
     నాలుగు రోజులుగా జరుగుతున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నిరసనలు, వాయిదాలతో తుడిచిపెట్టుకుపోయాయి. అధికార, విపక్ష సభ్యులు పోటాపోటీగా ప్లకార్డుల ప్రదర్శన, ఆరోపణలు, ప్రత్యారోపణలతో చర్చ జరగకుండా విలువైన పార్లమెంటు సమయాన్ని వృథా చేస్తున్నారు. దీని వల్ల ప్రజాధనం కూడా వృథా అవుతోంది. 18 రోజుల పాటు సాగే ఈ పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ఇలాగే అంతరాయం కలిగితే వృథా అయ్యే ప్రజాధనం ఎంతో తెలుసా...? సుమారు రూ. 35 కోట్లకు పైనే. అంటే సమావేశం జరిగే ప్రతి నిమిషానికి దాదాపు రూ. 29వేలు ఖర్చు చేస్తున్నట్లు లెక్క. సమావేశాలు అర్థవంతంగా జరగపోతే ఆ మేర ప్రజాధనానికి నష్టం వాటిల్లినట్లే. రోజులో లోక్‌సభ సగటున 6 గంటలు, రాజ్యసభ 5 గంటలు పనిచేస్తాయి.
     
     మొదటి రోజు నుంచే
     ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ మంత్రులు, ముఖ్యమంత్రులను తొలగించనిదే ఎలాంటి చర్చ జరగనివ్వబోమంటూ ప్రతిపక్ష కాంగ్రెస్‌పార్టీ సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి నిరసనలకు దిగుతోంది. దీని వల్ల సభా కార్యక్రమాలు 6 శాతం మాత్రమే జరిగి, 94 శాతం అంతరాయం కలిగినట్లు ఓ నివేదిక తెలిపింది.
     ‘ప్రపంచ దృష్టి మనపై ఉంది. పార్టీ పంథా, ప్రాంతీయ ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకోవడం అవసరమే అయినా.. సభ్యులు విశాల దృక్పథాన్ని అలవరచుకోవాలి’ అని ప్రధాని నరేంద్రమోదీ గురువారం ఓ కార్యక్రమం సందర్భంగా వ్యాఖ్యానించారు. పార్లమెంటుపై ప్రజలకు ఎన్నో అంచనాలు ఉన్నాయని తెలిపారు. చర్చల అవసరాన్ని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. అయితే  ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు రాజీనామా చేయనిదే ఎలాంటి చర్చ ఉండబోదంటూ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ గురువారం స్పష్టం చేశారు.
     ప్రభుత్వం చర్చలకు అంగీకరించినప్పటికీ.. మంత్రుల రాజీనామా ప్రసక్తే లేదని ప్రతిపక్షాలు తెగేసి చెబుతున్నాయి. దీంతో సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాను లక్ష్యంగా చేసుకొని బీజేపీ ప్రతిదాడికి దిగింది. వాద్రా కొన్ని రోజుల క్రితం ఫేస్‌బుక్‌లో కొన్ని వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతాయని, వాటితో పాటే వారి దృష్టి మళ్లింపు ఎత్తుగడలు మొదలవుతాయని, ప్రజలను పిచ్చివాళ్లను చేయలేరని, దేశానికి ఇలాంటి నాయకులు నేతృత్వం వహిస్తుండడంపై చింతిస్తున్నట్లు .. వాద్రా వ్యాఖ్యానించారు. ఆయన పార్లమెంటు సభ్యులనే కాకుండా.. పార్లమెంటు మొత్తాన్నే కించపరిచారని, ఆయనను తక్షణం సభకు పిలిపించి మందలించాలని బీజేపీ నాయకులు పట్టుబడుతున్నారు.
     ప్రజాధనం వృథా అవుతుండడంపై సీపీఐ నేత డి.రాజా ఆందోళన వ్యక్తం చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు, ముఖ్యమంత్రులను తొలగించి, సభా సజావుగా జరిగేలా చూడడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు.
     ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సభకు అంతరాయం కలిగించడమే బీజేపీ ప్రథమ వ్యూహంగా వ్యవహరించిందని కాంగ్రెస్ ఆరోపించింది. దీనిపై బీజేపీ ఎంపీ బాబుల్ సుప్రియో స్పందిస్తూ.. షెడ్యూల్ కంటే ఎక్కువ సమయం సమావేశమైన ప్రభుత్వాలను ఎందుకు మనం ఆదర్శంగా తీసుకోకూడదు? అని ప్రశ్నించారు.
     

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement