మంగళంపల్లి కన్నుమూత
ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ (86) చెన్నైలోని తన నివాసంలో కన్నుమూశారు. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కొన్నాళ్ల పాటు చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందారు. తర్వాత మళ్లీ తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత ఆయన ఆరోగ్యం విషమించింది. చెన్నై సంగీత అకాడమీ సమీపంలో ఉన్న ఆయన ఇంట్లోనే కుటుంబ సభ్యులు సపర్యలు చేస్తుండగానే.. మంగళవారం మధ్యాహ్నం సమయంలో ఆయన కన్నుమూశారు. ఆయన మృతదేహాన్ని స్వగృహంలోనే అభిమానుల సందర్శనార్థం ఉంచారు.
బాలమురళీకృష్ణ స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా రాజోలు సమీపంలోని శంకరగుప్తం. అదే గ్రామంలో మంగళంపల్లి పట్టాభిరామయ్య, సూర్యకాంతమ్మ దంపతులకు ఆయన 1930 జూలై 6వ తేదీన జన్మించారు. కేవలం 8 ఏళ్ల చిన్న వయసులోనే తొలిసారిగా కచేరీ చేశారు. 1939 నుంచి ఆయన పూర్తిస్థాయిలో కచేరీలు మొదలుపెట్టారు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. స్వయంగా పాడటంతో పాటు పలు సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు. దాదాపు 400 పాటలకు ఆయన సంగీతం అందించారు. 25వేలకు పైగా కచేరీలు చేశారు. మహాతి, సుముఖం, సర్వశ్రీ, ప్రతి మధ్యమావతి, గణపతి, సిద్ధి అనే కొన్ని కొత్త రాగాలను కూడా ఆవిష్కరించారు. సంగీత ప్రపంచం శోకసంద్రంలో మునిగిపోయింది. శాస్త్రీయ సంగీతాన్ని ఎవరూ ఊహించని స్థాయికి ఆయన తీసుకెళ్లారు. ఆయన థిల్లానాలు ప్రపంచవ్యాప్తంగా సుప్రసిద్ధం. 'ఏమి సేతురా లింగా' అంటూ ఆయన వేదాంత ధోరణిలో పాడిన పాట పండిత పామరుల హృదయాలను తాకింది.
[ ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి ]

వయొలిన్, మృదంగం, కంజీరా లాంటి వాయిద్యాలను బాగా వాయిస్తారు. భక్తప్రహ్లాద సినిమాలో నారదుడిగా, సందెని సింధూరం అనే మలయాళం సినిమాలో నటించారు. పలు చిత్రాలకు ఆయన సంగీతాన్ని అందించారు. పద్మభూషణ్, డాక్టరేట్ల వంటి బిరుదులను పొందారు. ప్రపంచ స్థాయిలో బెనిలియర్ అనే అత్యుత్తమ పురస్కారాన్ని కూడా ఆయన అందుకున్నారు.