karnatic musician
-
తెనాలి అమ్మాయి.. డోలు నేర్చుకుని! అరుదైన ఘనత.. 35 రకాల తాళాలతో..
రాజ్‌భవన్‌లో.. సోమవారం, మార్చి 6న హైదరాబాద్ గవర్నర్ తమిళిసై కొంతమంది మహిళలకు సత్కారం చేశారు. అదే సందర్భంగా ఏర్పాటైన గాత్ర కచ్చేరిలో అందరి దృష్టి లలిత మనీషా మీద పడింది. అందుకు కారణం ఆమె డోలు వాద్యం పై విన్యాసం చేస్తూ ఉండటమే. తెలుగునాట నాదస్వరం వాయించే స్త్రీలు కొద్దిమందైనా ఉన్నారు. కాని డోలు వాయించే వారు అతి తక్కువ. రెండు రాష్ట్రాలకు కలిసి డోలు విద్వాంసురాలిగా ఇటీవల గుర్తింపు పొందుతున్నది 24 ఏళ్ల లలిత మనీషా. తెనాలి అమ్మాయి లలిత మనీషాది తెనాలి. వీరి తల్లి మస్తాన్‌బీ, తండ్రి షేక్ వెంకటేశ్వర సాహెబ్ నాదస్వర విద్వాంసులు. ఇద్దరూ వందలాది ప్రదర్శనలు ఇచ్చారు. మస్తాన్ బీ వంశంలో 300 వందల ఏళ్లుగా నాదస్వరం కొనసాగుతూ ఉంది. అయితే డోలు వాయించిన మహిళలు లేరు. మస్తాన్ బీకి ఇద్దరు కూతుళ్లు. పెద్దమ్మాయి నాగ భ్రమరాంబ గాత్ర విద్వాంసురాలిగా శిక్షణ తీసుకుంది. ఇప్పుడు చదువు నిమిత్తం అమెరికా వెళ్లింది. చిన్నమ్మాయి లలిత మనీషా డోలు నేర్చుకోవడంలో ఆసక్తి చూపింది. ‘నేను ఏడవ తరగతి చదువుతున్నప్పుడు వరుసకు వదిన అయ్యే ఒకామె డోలు నేర్చుకోవడానికి ప్రయత్నించింది. ఆమెకు రాలేదు. నేను నేర్చుకోవడానికి ప్రయత్నించాను. నాకు వచ్చేసింది. డోలు వాయిద్యానికి తాళంతో పాటు శక్తి కూడా కావాలి. నాలో అవి రెండూ గమనించి మా అమ్మా నాన్నలు ప్రోత్సహించారు’ అంటుంది మనీషా. కుంభకోణం వెళ్లి డోలు వాయిద్యాన్ని సాధన చేయాలంటే ఇక్కడ అనుకూలంగా లేదని తొమ్మిదో తరగతి డిస్కంటిన్యూ చేసి కుంభకోణంలో డోలు విద్వాంసుడు టి.ఆర్.సుబ్రహ్మణ్యం దగ్గర సంవత్సరం పాటు శిష్యరికం చేసింది లలిత మనీషా. గురువు ఇంట్లోనే ఉంటూ డోలు నేర్చుకుని వచ్చింది. ఆ తర్వాత తెలుగు యూనివర్సిటీ నుంచి సర్టిఫికెట్ కోర్సు, డిప్లమా కూడా పూర్తి చేసింది. డిగ్రీ ఉండాలి కనుక బీసీఏ చేసి డోలు వాయిద్యంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలనుకుంది. ఆ కోర్సు అన్నామలై యూనివర్సిటీ కింద చిదంబరంలో ఉంది. ‘అక్కడ మా బేచ్‌లో మొత్తం 50 మంది విద్యార్థులు ఉంటే నేనొక్కదాన్నే అమ్మాయిని. అందుకని నన్ను అందరూ బాగా చూసుకునేవారు. మిగతా దక్షిణాది రాష్ట్రాలతో పాటు తమిళనాడులో కూడా డోలు వాద్యం మగవారిదే అని భావించడం వల్ల ఇప్పటి వరకూ ఒక్క ఆడపిల్ల కూడా ఆ కోర్సు చేయలేదు. దాంతో మొత్తం దేశంలోనే డోలు వాయిద్యంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన ఏకైక అమ్మాయిగా నేను నిలిచాను’ అంటుంది మనీషా. నిజంగా ఇది తెలుగువారి గర్వకారణమే. మంగళవాయిద్యం డోలు, సన్నాయి మంగళకరమైన వాయిద్యాలు. దక్షిణ భారతంలో శుభకార్యక్రమాలకు సన్నాయి మేళం తప్పనిసరి. అయితే కర్నాటక సంగీతంలో కూడా సన్నాయి, డోలు ప్రాశస్త్యం మెండుగా ఉంది. డోలు సహ వాయిద్యంగా ఉంటోంది. ‘గాత్ర కచ్చేరిలో గాని వయొలిన్, ఫ్లూట్ కచ్చేరిలో గాని మృదంగాన్ని సహ వాయిద్యంగా తీసుకుంటారు. డోలును కూడా తీసుకునేవారు ఉంటారు. కర్నాటక సంగీతంలో డోలు వాయిద్యకారిణిగా నేను గుర్తింపు పొందాలనుకుంటున్నాను. డోలు వాయించడానికి 108 రకాల తాళాలు ఉన్నాయి. ఉద్దండులు లోతుకు వెళితే ఇంకా వినూత్న తాళాలు వేస్తారు. నేను ఇప్పటి వరకూ 35 రకాల తాళాలు డోలు మీద వేయగలను. మా అమ్మా నాన్నలతో కలిసి అనేక కచ్చేరీలు చేస్తున్నాను. శ్రీశైలం, భద్రాచలం, హరిద్వార్, పూరీ, ద్వారకా, కాశీ పుణ్యక్షేత్రాలలో కచ్చేరీలు ఇచ్చాను. అలాగే తమిళులు డోలు, సన్నాయి కచ్చేరీలను ఇష్టపడతారు. వారి ఆహ్వానం మేరకు మదురై, తంజావూరు... ఇలా అనేక నగరాల్లో ప్రదర్శనలు ఇచ్చాను. ఇంకా నేను చాలా సాధించాల్సి ఉంది’ అంది మనీషా. – ఇన్పుట్స్: బి.ఎల్.నారాయణ, సాక్షి, తెనాలి -
నిష్ర్కమించిన నాద రవళి
తెలుగింట పుట్టి దాదాపు ఎనిమిది దశాబ్దాలపాటు దేశదేశాల్లో ప్రవహించిన ఒక మనోహర, మహత్తర సంగీత ఝరి ఆగిపోయింది. సకల జనావళినీ నిరంతరా యంగా సమ్మోహితుల్ని చేసిన ఒక కమనీయ కంఠం మూగవోయింది. మంగళ వారం చెన్నైలో కన్నుమూసిన డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ అపురూపమైన విద్వత్కళాకోవిదుడు. విశిష్ట వాగ్గేయకారుడు. మూడో తరగతితో చదువు మానేసిన ఒక బుడతడు భవిష్యత్తులో బహుభాషల్లో నిష్ణాతుడవుతాడని...సంగీత ప్రపం చాన్నే శాసిస్తాడని... అనేకానేక నూత్న రాగాలను సృష్టించి ఆ ప్రపంచాన్నే అబ్బుర పరుస్తాడని ఎవరి ఊహకూ అంది ఉండదు. నమ్మకమున్నవారైతే దీన్ని పూర్వ జన్మ సుకృతమనుకుంటారు. కారణజన్ముడిగా భావిస్తారు. తమిళనాట కావేరీ తీరానున్న తిరువయ్యూరు గ్రామంలో త్యాగరాజస్వామి సమాధి చెంతన గాన కళాకోవిదు లంతా కొలువుదీరిన విద్వత్ సభలో తొమ్మిదేళ్ల చిరు ప్రాయంలో మురళీకృష్ణగా ఆయన తొలిసారి గళం విప్పారు. ఆనాటి సభలో పాలుపంచుకునే అదృష్టం దక్కిన వారు అనంతరకాలంలో దాన్నొక అపురూప సన్నివేశంగా పదేపదే గుర్తుచేసుకునే వారు. ఆయన రంగప్రవేశమే ఆశ్చర్యకరమైనది. సంగీత గురువు పారుపల్లి రామకృష్ణయ్య పంతులు అనుకోకుండా అస్వస్థులై తన బదులు శిష్యుడు మురళీకృష్ణతో సభ చేయించమని చెప్పినప్పుడు నిర్వాహకురాలు నాగరత్నమ్మాళ్తోసహా అందరూ విస్మయపడ్డారు. కొమ్ములు తిరిగిన విద్వాంసులంతా పాల్గొంటున్న ఆ సభలో ఈ బాలుడితో పాడించడం ఎలాగని తర్జనభర్జనపడ్డారు. అప్పటికి గాయక సార్వభౌముడిగా నీరాజనాలందుకుంటున్న పారుపల్లి ముందు మారు మాట్లాడ లేక ‘సరే’నని బయటపడ్డారు. ఇతర పక్కవాయిద్య కళాకారులతోపాటు తండ్రి తంబురా వాయిస్తుంటే గొంతెత్తిన ఆ పసివాడు అందరినీ మంత్రముగ్ధుల్ని చేశాడు. తనకిచ్చిన అరగంట సమయమూ అయ్యాక ముగించబోయిన ఆ బాలగంధర్వుణ్ణి రసజ్ఞులు కదలనివ్వలేదు. పట్టుబట్టి మరో అరగంట పాడించుకుని విని తరిం చారు. నాగరత్నమ్మాళ్ అయితే ఆయన్ను సాక్షాత్తూ త్యాగరాజస్వామి అవతారం గానే భావించారు. సరిగ్గా ఆ సభలోనే ఆయనను ఒక వక్త బాలమురళిగా సంబోధిం చారు. అప్పటినుంచీ సకల సంగీత ప్రపంచానికీ ఆయన బాలమురళీకృష్ణగానే తెలుసు. చిన్ననాటనే అసాధారణ ప్రజ్ఞాపాటవాలను ప్రదర్శించేవారిని చైల్డ్ ప్రాడిజీ (బాల మేధావి) అంటారు. అయితే వయసొస్తున్నకొద్దీ ఎందుకనో ఆ శక్తులు క్రమేపీ అడుగంటుతాయి. చిన్ననాట అంతగా కీర్తి ప్రతిష్టలందుకున్నవాడు ఇలా మిగిలాడేమని అందరూ ఆశ్చర్యపోతుంటారు. కానీ బాలమురళి పథమే వేరు. ఆరేళ్ల ప్రాయంలో సంక్లిష్టమైన రాగాలను అలవోకగా ఆలాపించిన తీరులోనే ఆయన సుదీర్ఘ సంగీతయాత్ర కొనసాగింది. కాలంతోపాటే ఆయనలోని విద్వత్తు ఎదిగింది. వయోలిన్‌పై సైతం పట్టుసాధించారు. రాగ, తాళ, లయ విన్యాసాల్లో అపారమైన జ్ఞానం ఆయన సొత్తు. విశేష సంగీత పాండితీ ప్రకర్ష ఉన్నవారికి సైతం ఓ పట్టాన లొంగని పల్లవులు ఆయన గొంతులో సులభంగా సుడులు తిరిగేవి. అంతేకాదు... అప్పటికప్పుడు తానుగా సృష్టించిన పల్లవులతో సభికుల్ని అబ్బు రపరచడం ఆయనకే చెల్లింది. తరచు రాగాలను మారుస్తూ ఆయన చేసే స్వర విన్యాసాలను అందుకోలేక పక్కవాయిద్య కళాకారులు కిందుమీదయ్యేవారు. ఆహూతుల రసజ్ఞతను పసిగట్టి, నూతన స్వరాలాపనలతో వారిని అమృతమయ ప్రపంచంలోకి తీసుకెళ్లి కట్టిపడేయడం బాలమురళికి మాత్రమే సాధ్యమని విద్వాంసులంటారు. ఆయన సృష్టించిన లవంగి, త్రిశక్తి, మహతి, సుముఖం, మనోరమ, ఓంకారి వంటి రాగమాలికలు బాలమురళిని ఆకాశమంత ఎత్తులో నిలిపాయి. తాను స్వరకల్పన చేసిన కృతులన్నిటిపైనా ఆయన ఎన్నో గ్రంథాలు వెలువరిం చారు. తెలుగు, కన్నడ, తమిళం, సంస్కృత భాషల్లో బాలమురళికున్న జ్ఞానం అపారమైనది. కానీ ఆయన నిలువెల్లా వినమ్రుడు. ‘నాకు సంగీతం పెద్దగా తెలియదండీ...కానీ సంగీతానికి నేను తెలుసును’ అనేవాడాయన. త్యాగరాజ విరచిత కీర్తనలను ఆలాపించినప్పుడు శ్రోతలను ఆయన మరో ప్రపంచపుటంచు లకు తీసుకెళ్లేవాడు. త్యాగరాజస్వామి హృదయం నుంచి ఏ సందర్భంలో ఏ కీర్తన ఉబికి వచ్చి ఉంటుందో ఊహించుకుని ఆ హృదయావేదననూ, ఆవేశాన్నీ ఆకళింపు చేసుకుని ప్రదర్శిస్తున్నారా అనిపించేంతగా వాటిని ఆలాపించేవారు. అది అనితర సాధ్యమైనది. సంగీత ప్రపంచంలో బాలమురళి సర్వస్వతంత్రుడు. ఏ శాసనాలూ ఆయన ముందు చెల్లుబాటు కావు. ఎవరి నిర్దేశాలూ ఆయన ముందు నిలబడవు. ఎప్పటి కప్పుడు కొత్త మార్గాలను అన్వేషించడమే ఆయనకిష్టం. అందుకే పాత ప్రమా ణాలనే శిరోధార్యాలుగా భావించే సంప్రదాయవాదులకు ఆయన కంటగింపు అయ్యాడు. కర్ణాటక సంగీతాన్ని భ్రష్టుపట్టిస్తున్నాడని పండితలోకం నోరుపారేసు కుంది. శాస్త్రీయ సంగీతాన్ని ఖూనీ చేస్తున్నాడని అభియోగం మోపింది. స్వీయ కృతులు పాడుతూ తానేదో గొప్పవాడినని భ్రమపడుతున్నాడన్నది. తిరుగు బాటు దారన్నది. ఆ గొంతులో వెనకటి మార్దవం లేదని విమర్శించింది. ‘మీకు ఇష్టమైతే వినండి... కష్టమైతే మానుకోండి’ అన్నది బాలమురళి జవాబు. సంప్రదాయ కర్ణాటక సంగీతానికి కొత్త కాంతులు జోడించకపోతే అది క్షీణించడం ఖాయమని ఆయన హెచ్చరించారు. సంగీతాన్ని ఒక తపస్సులా, యజ్ఞంలా భావించి చివరి శ్వాస వరకూ దాని కోసమే తపించారు. ఒకపక్క సంగీతంలో కొత్త రీతుల్ని సృష్టి స్తూనే చలనచిత్ర రంగ ప్రవేశం చేసి ‘హంసగీతె’(కన్నడ)కు సంగీత దర్శకత్వం నెరపి ఉత్తమ సంగీత దర్శకుడిగా పురస్కారాన్ని అందుకున్నారు. ఒకటి రెండు చిత్రాల్లో నటించారు. నేపథ్య గాయకుడిగా రాణించారు. పద్మవిభూషణ్ పురస్కా రాన్ని సైతం అందు కున్నారు. ఎన్నో శిఖరాలను అధిరోహించి సాటిలేని మేటిగా వెలుగొందిన బాలమురళీకృష్ణ ఎప్పటికీ చిరంజీవి. ఆయన దివ్యస్మృతికి ‘సాక్షి’ ఘనంగా నివాళులర్పిస్తోంది. -
మౌనమె నీ భాష అంటూ...
-
మౌనమె నీ భాష అంటూ...
''మౌనమె నీ భాష ఓ మూగ మనసా''... ఈ పాట తెలుగువారందరికీ సుపరిచితం. 1979లో విడుదలైన గుప్పెడు మనసు చిత్రం కోసం ఆచార్య ఆత్రేయ రాసిన ఈ పాటను మంగళంపల్లి బాలమురళీకృష్ణ పాడిన తీరు అందరి హృదయాలను కట్టిపడేసింది. ఆయన ఎంతటి విద్వాంసుడో.. అంతటి ఆత్మాభిమానం కూడా కలవాడు. తన మాట చెల్లుబాటు కాదంటే అసలు తెలుగు గడ్డమీదే అడుగుపెట్టనంటూ చాలా కాలం పాటు శపథం పట్టి మరీ సొంత రాష్ట్రానికి దూరంగా చెన్నైలోనే ఉండిపోయారు. నిజానికి అక్కడకు వెళ్లిన తర్వాత ఆయనకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది కూడా. కొందరు దాన్ని గర్వం అనుకున్నా తాను లెక్క చేసేది లేదని.. తన ఆత్మాభిమానం దెబ్బతింటే తాను సహించేది లేదని చాలా సందర్భాల్లో ఆయన స్పష్టం చేశారు. అలాంటి బాలమురళీకృష్ణ లేరంటే సంగీత లోకం నమ్మలేకపోతోంది. ఆయన అందుకున్న పలు అవార్డులు మంగళంపల్లి బాలమురళీకృష్ణ అత్యంత ప్రతిష్టాత్మకమైన పద్మ శ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ మూడు అవార్డులను అందుకున్నారు. 1976, 87లలో నేషనల్ ఫిల్మ్ ఫేర్ అవార్డులు దక్కాయి. టీటీడీ ఆస్థాన విద్యాంసుడిగా ఆయన సేవలందించారు. తెలుగు, మలయాళం, కన్నడ, ఒరియ, హిందీ, బెంగాలి, ప్రెంచ్ భాషల్లో వందల సంఖ్యలో పాటలు పాడారు. 400కు పైగా సినీ గీతాలకు సంగీతమందించారు. అమెరికా, కెనడా, బ్రిటన, రష్యా, సింగపూర్ సహా పలు దేశాల్లో 25 వేలకు పైగా కచేరీలు నిర్వహించి ప్రశంసలు పొందారు. మంగళంపల్లి మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. సినీ, సంగీత ప్రపంచానికి మంగళంపల్లి మృతి తీరని లోటని ప్రముఖ దర్మకుడు, కళాతపస్వి కె.విశ్వనాథ్ అన్నారు. ప్రముఖ నటుడు కమల్ హాసన్ ట్విట్టర్ ద్వారా సంతాపం వ్యక్తం చేశారు. బాలమురళీకృష్ణ మృతికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్, ఏపీ పీసీసీ అధ్యక్షుడు ఎన్ రఘవీరారెడ్డి సంతాపం తెలిపారు. -
మంగళంపల్లి కన్నుమూత
-
మంగళంపల్లి కన్నుమూత
ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ (86) చెన్నైలోని తన నివాసంలో కన్నుమూశారు. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కొన్నాళ్ల పాటు చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందారు. తర్వాత మళ్లీ తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత ఆయన ఆరోగ్యం విషమించింది. చెన్నై సంగీత అకాడమీ సమీపంలో ఉన్న ఆయన ఇంట్లోనే కుటుంబ సభ్యులు సపర్యలు చేస్తుండగానే.. మంగళవారం మధ్యాహ్నం సమయంలో ఆయన కన్నుమూశారు. ఆయన మృతదేహాన్ని స్వగృహంలోనే అభిమానుల సందర్శనార్థం ఉంచారు. బాలమురళీకృష్ణ స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా రాజోలు సమీపంలోని శంకరగుప్తం. అదే గ్రామంలో మంగళంపల్లి పట్టాభిరామయ్య, సూర్యకాంతమ్మ దంపతులకు ఆయన 1930 జూలై 6వ తేదీన జన్మించారు. కేవలం 8 ఏళ్ల చిన్న వయసులోనే తొలిసారిగా కచేరీ చేశారు. 1939 నుంచి ఆయన పూర్తిస్థాయిలో కచేరీలు మొదలుపెట్టారు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. స్వయంగా పాడటంతో పాటు పలు సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు. దాదాపు 400 పాటలకు ఆయన సంగీతం అందించారు. 25వేలకు పైగా కచేరీలు చేశారు. మహాతి, సుముఖం, సర్వశ్రీ, ప్రతి మధ్యమావతి, గణపతి, సిద్ధి అనే కొన్ని కొత్త రాగాలను కూడా ఆవిష్కరించారు. సంగీత ప్రపంచం శోకసంద్రంలో మునిగిపోయింది. శాస్త్రీయ సంగీతాన్ని ఎవరూ ఊహించని స్థాయికి ఆయన తీసుకెళ్లారు. ఆయన థిల్లానాలు ప్రపంచవ్యాప్తంగా సుప్రసిద్ధం. 'ఏమి సేతురా లింగా' అంటూ ఆయన వేదాంత ధోరణిలో పాడిన పాట పండిత పామరుల హృదయాలను తాకింది. [ ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి ] వయొలిన్, మృదంగం, కంజీరా లాంటి వాయిద్యాలను బాగా వాయిస్తారు. భక్తప్రహ్లాద సినిమాలో నారదుడిగా, సందెని సింధూరం అనే మలయాళం సినిమాలో నటించారు. పలు చిత్రాలకు ఆయన సంగీతాన్ని అందించారు. పద్మభూషణ్, డాక్టరేట్ల వంటి బిరుదులను పొందారు. ప్రపంచ స్థాయిలో బెనిలియర్ అనే అత్యుత్తమ పురస్కారాన్ని కూడా ఆయన అందుకున్నారు.