
నిష్ర్కమించిన నాద రవళి
తెలుగింట పుట్టి దాదాపు ఎనిమిది దశాబ్దాలపాటు దేశదేశాల్లో ప్రవహించిన ఒక మనోహర, మహత్తర సంగీత ఝరి ఆగిపోయింది. సకల జనావళినీ నిరంతరా యంగా సమ్మోహితుల్ని చేసిన ఒక కమనీయ కంఠం మూగవోయింది. మంగళ వారం చెన్నైలో కన్నుమూసిన డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ అపురూపమైన విద్వత్కళాకోవిదుడు. విశిష్ట వాగ్గేయకారుడు. మూడో తరగతితో చదువు మానేసిన ఒక బుడతడు భవిష్యత్తులో బహుభాషల్లో నిష్ణాతుడవుతాడని...సంగీత ప్రపం చాన్నే శాసిస్తాడని... అనేకానేక నూత్న రాగాలను సృష్టించి ఆ ప్రపంచాన్నే అబ్బుర పరుస్తాడని ఎవరి ఊహకూ అంది ఉండదు.
నమ్మకమున్నవారైతే దీన్ని పూర్వ జన్మ సుకృతమనుకుంటారు. కారణజన్ముడిగా భావిస్తారు. తమిళనాట కావేరీ తీరానున్న తిరువయ్యూరు గ్రామంలో త్యాగరాజస్వామి సమాధి చెంతన గాన కళాకోవిదు లంతా కొలువుదీరిన విద్వత్ సభలో తొమ్మిదేళ్ల చిరు ప్రాయంలో మురళీకృష్ణగా ఆయన తొలిసారి గళం విప్పారు. ఆనాటి సభలో పాలుపంచుకునే అదృష్టం దక్కిన వారు అనంతరకాలంలో దాన్నొక అపురూప సన్నివేశంగా పదేపదే గుర్తుచేసుకునే వారు. ఆయన రంగప్రవేశమే ఆశ్చర్యకరమైనది.
సంగీత గురువు పారుపల్లి రామకృష్ణయ్య పంతులు అనుకోకుండా అస్వస్థులై తన బదులు శిష్యుడు మురళీకృష్ణతో సభ చేయించమని చెప్పినప్పుడు నిర్వాహకురాలు నాగరత్నమ్మాళ్‌తోసహా అందరూ విస్మయపడ్డారు. కొమ్ములు తిరిగిన విద్వాంసులంతా పాల్గొంటున్న ఆ సభలో ఈ బాలుడితో పాడించడం ఎలాగని తర్జనభర్జనపడ్డారు. అప్పటికి గాయక సార్వభౌముడిగా నీరాజనాలందుకుంటున్న పారుపల్లి ముందు మారు మాట్లాడ లేక ‘సరే’నని బయటపడ్డారు. ఇతర పక్కవాయిద్య కళాకారులతోపాటు తండ్రి తంబురా వాయిస్తుంటే గొంతెత్తిన ఆ పసివాడు అందరినీ మంత్రముగ్ధుల్ని చేశాడు. తనకిచ్చిన అరగంట సమయమూ అయ్యాక ముగించబోయిన ఆ బాలగంధర్వుణ్ణి రసజ్ఞులు కదలనివ్వలేదు. పట్టుబట్టి మరో అరగంట పాడించుకుని విని తరిం చారు. నాగరత్నమ్మాళ్ అయితే ఆయన్ను సాక్షాత్తూ త్యాగరాజస్వామి అవతారం గానే భావించారు. సరిగ్గా ఆ సభలోనే ఆయనను ఒక వక్త బాలమురళిగా సంబోధిం చారు. అప్పటినుంచీ సకల సంగీత ప్రపంచానికీ ఆయన బాలమురళీకృష్ణగానే తెలుసు.
చిన్ననాటనే అసాధారణ ప్రజ్ఞాపాటవాలను ప్రదర్శించేవారిని చైల్డ్ ప్రాడిజీ (బాల మేధావి) అంటారు. అయితే వయసొస్తున్నకొద్దీ ఎందుకనో ఆ శక్తులు క్రమేపీ అడుగంటుతాయి. చిన్ననాట అంతగా కీర్తి ప్రతిష్టలందుకున్నవాడు ఇలా మిగిలాడేమని అందరూ ఆశ్చర్యపోతుంటారు. కానీ బాలమురళి పథమే వేరు. ఆరేళ్ల ప్రాయంలో సంక్లిష్టమైన రాగాలను అలవోకగా ఆలాపించిన తీరులోనే ఆయన సుదీర్ఘ సంగీతయాత్ర కొనసాగింది. కాలంతోపాటే ఆయనలోని విద్వత్తు ఎదిగింది. వయోలిన్‌పై సైతం పట్టుసాధించారు. రాగ, తాళ, లయ విన్యాసాల్లో అపారమైన జ్ఞానం ఆయన సొత్తు. విశేష సంగీత పాండితీ ప్రకర్ష ఉన్నవారికి సైతం ఓ పట్టాన లొంగని పల్లవులు ఆయన గొంతులో సులభంగా సుడులు తిరిగేవి. అంతేకాదు... అప్పటికప్పుడు తానుగా సృష్టించిన పల్లవులతో సభికుల్ని అబ్బు రపరచడం ఆయనకే చెల్లింది. తరచు రాగాలను మారుస్తూ ఆయన చేసే స్వర విన్యాసాలను అందుకోలేక పక్కవాయిద్య కళాకారులు కిందుమీదయ్యేవారు. ఆహూతుల రసజ్ఞతను పసిగట్టి, నూతన స్వరాలాపనలతో వారిని అమృతమయ ప్రపంచంలోకి తీసుకెళ్లి కట్టిపడేయడం బాలమురళికి మాత్రమే సాధ్యమని విద్వాంసులంటారు.
ఆయన సృష్టించిన లవంగి, త్రిశక్తి, మహతి, సుముఖం, మనోరమ, ఓంకారి వంటి రాగమాలికలు బాలమురళిని ఆకాశమంత ఎత్తులో నిలిపాయి. తాను స్వరకల్పన చేసిన కృతులన్నిటిపైనా ఆయన ఎన్నో గ్రంథాలు వెలువరిం చారు. తెలుగు, కన్నడ, తమిళం, సంస్కృత భాషల్లో బాలమురళికున్న జ్ఞానం అపారమైనది. కానీ ఆయన నిలువెల్లా వినమ్రుడు. ‘నాకు సంగీతం పెద్దగా తెలియదండీ...కానీ సంగీతానికి నేను తెలుసును’ అనేవాడాయన. త్యాగరాజ విరచిత కీర్తనలను ఆలాపించినప్పుడు శ్రోతలను ఆయన మరో ప్రపంచపుటంచు లకు తీసుకెళ్లేవాడు. త్యాగరాజస్వామి హృదయం నుంచి ఏ సందర్భంలో ఏ కీర్తన ఉబికి వచ్చి ఉంటుందో ఊహించుకుని ఆ హృదయావేదననూ, ఆవేశాన్నీ ఆకళింపు చేసుకుని ప్రదర్శిస్తున్నారా అనిపించేంతగా వాటిని ఆలాపించేవారు. అది అనితర సాధ్యమైనది.
సంగీత ప్రపంచంలో బాలమురళి సర్వస్వతంత్రుడు. ఏ శాసనాలూ ఆయన ముందు చెల్లుబాటు కావు. ఎవరి నిర్దేశాలూ ఆయన ముందు నిలబడవు. ఎప్పటి కప్పుడు కొత్త మార్గాలను అన్వేషించడమే ఆయనకిష్టం. అందుకే పాత ప్రమా ణాలనే శిరోధార్యాలుగా భావించే సంప్రదాయవాదులకు ఆయన కంటగింపు అయ్యాడు. కర్ణాటక సంగీతాన్ని భ్రష్టుపట్టిస్తున్నాడని పండితలోకం నోరుపారేసు కుంది. శాస్త్రీయ సంగీతాన్ని ఖూనీ చేస్తున్నాడని అభియోగం మోపింది. స్వీయ కృతులు పాడుతూ తానేదో గొప్పవాడినని భ్రమపడుతున్నాడన్నది. తిరుగు బాటు దారన్నది. ఆ గొంతులో వెనకటి మార్దవం లేదని విమర్శించింది. ‘మీకు ఇష్టమైతే వినండి... కష్టమైతే మానుకోండి’ అన్నది బాలమురళి జవాబు.
సంప్రదాయ కర్ణాటక సంగీతానికి కొత్త కాంతులు జోడించకపోతే అది క్షీణించడం ఖాయమని ఆయన హెచ్చరించారు. సంగీతాన్ని ఒక తపస్సులా, యజ్ఞంలా భావించి చివరి శ్వాస వరకూ దాని కోసమే తపించారు. ఒకపక్క సంగీతంలో కొత్త రీతుల్ని సృష్టి స్తూనే చలనచిత్ర రంగ ప్రవేశం చేసి ‘హంసగీతె’(కన్నడ)కు సంగీత దర్శకత్వం నెరపి ఉత్తమ సంగీత దర్శకుడిగా పురస్కారాన్ని అందుకున్నారు. ఒకటి రెండు చిత్రాల్లో నటించారు. నేపథ్య గాయకుడిగా రాణించారు. పద్మవిభూషణ్ పురస్కా రాన్ని సైతం అందు కున్నారు. ఎన్నో శిఖరాలను అధిరోహించి సాటిలేని మేటిగా వెలుగొందిన బాలమురళీకృష్ణ ఎప్పటికీ చిరంజీవి. ఆయన దివ్యస్మృతికి ‘సాక్షి’ ఘనంగా నివాళులర్పిస్తోంది.