ఈసారీ వరద ముప్పు తప్పదా?
పంపింగ్ స్టేషన్ నిర్మాణంలో జాప్యం
సాక్షి, ముంబై: నగరంలోని పలు ప్రాంతాలు ఈ ఏడాది కూడా వరద ముప్పు ఎదుర్కోక తప్పదనిపిస్తోంది. దీనికి కారణం పంపింగ్ స్టేషన్ నిర్మాణంలో జాప్యం జరగడమే. అయితే ప్రజలు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ బాధలు అధికారులకు పట్టడంలేదని విమర్శిస్తున్నారు. నగరంలో 200 లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి. ఈ ప్రాంతాలలో ముఖ్యంగా హైటైడ్ సమయంలో అదేవిధంగా భారీ వర్షాల కారణంగా వరద నీరు ముంచెత్తనుంది.
బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) గత కొంత కాలం నుంచి వరద నీరును తొలగించేందుకు కొన్ని కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుంది. అయినప్పటికీ కొన్ని ప్రాంతాలలో వరద నీరును తొలగిపోవడంలేదు. అయితే లోతట్టు ప్రాంతాల్లో పూర్తిగా వరద నీరును తొలగించడం సాధ్యం కాదని కార్పొరేషన్ అధికారులు అభిప్రాయపడుతున్నారు. అయితే తాము లోతట్టు ప్రాంతాల్లో పంప్‌లను ఏర్పాటు చేశామనీ, అంతేకాకుండా వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని 180 పంప్‌లను కూడా అందుబాటులో ఉంచామంటున్నారు.
హింద్‌మాతా, మిలన్ సబ్‌వే, స్లాటర్ రోడ్, గాంధీ మార్కెట్‌లు చాలా కీలకమైనవీ. ఇక్కడ ప్రతి ఏడాది వర్షాకాలంలో వరద నీరు ముచెత్తుతోంది. కాగా, వర్లీలో ఉన్న లవ్‌గ్రోవర్, క్లెవెలాండ్ బండర్ పంపింగ్ స్టేషన్ల ఏర్పాటు వచ్చే ఏడాది మే వరకు పూర్తి కానుంది. అయితే ఈ పంపింగ్ స్టేషన్లను వచ్చే ఏడాది వర్షాకాలంలోనే ఉపయోగంలోకి వస్తాయి. బీఎంసీ చేపట్టిన మురికి కాలువల పూడికతీత సంతృప్తికరంగా లేదని నిపుణులు ఆరోపిస్తున్నారు. ఒక్క భారీ వర్షంతో బీఎంసీ ముందస్తుగా చేపట్టిన పనులన్ని బయట పడుతాయని వారు పేర్కొంటున్నారు.
నగరం ‘సాసర్’ ఆకారంలో ఉందని, నగరంలోని వరద నీరును ఎదుర్కోవడానికి అన్ని పంపింగ్ స్టేషన్లును నిర్వహణలో ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని బీఎంసీ రిటైర్ట్ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. కానీ ఇందుకు సంబంధించిన పనులు చాలా నెమ్మదిగా కొనసాగుతున్నాయని విచారం వ్యక్తం చేశారు. నగరంలో వెస్ట్‌ర్న్ రైల్వేలో 26 కల్వర్టులు, సెంట్రల్‌లో 10, హర్బర్‌లో ఐదు కల్వర్టులు ఉన్నాయి. కానీ రైల్వేల పరిధిలోని మురికి కాలువలను పరిశుభ్రపర్చడానికి బీఎంసీ కేవలం రూ.2.38 కోట్లను కేటాయించింది. అంతేకాకుండా రైల్వే ట్రాక్స్ వెంబడి ఉన్న మైక్రో టన్నెలింగ్ కోసం బీఎంసీ రూ.2 కోట్లను మంజూరు చేసింది.